‘జేగంట’ పత్రిక ఆఫీసుముందు స్కూటర్‌ పార్క్‌ చేసి లోపలికెళ్లాను.ముందుగా చిన్న గది. నా దృష్టి గదిలో బల్ల వెనకాల ఉన్న ఎగ్జిక్యూటివ్‌ చెయిర్‌ మీద పడింది. అది ఖాళీగా ఉంది. భారంగా నిట్టూర్చి వెనక్కి తిరగబోతుంటే వెనుక గదిలోంచి సుమారు పాతికేళ్ల యువతి వచ్చింది. ఆమెను లీల అని గుర్తుపట్టి పలకరింపుగా నవ్వితే, ‘మీరా?’’ అని తనూ నిట్టూర్చింది.అప్పటికి నేనా ఆఫీసు చుట్టూ తిరగడం మొదలై రెండు నెలలు దాటింది. ఈ రెండు నిట్టూర్పుల వెనుకా ఆ రెండు నెలల కథా ఉంది.మూడునెలల క్రితం ఆ పత్రిక కొత్త రచయితల్ని ప్రోత్సహిస్తామంటూ ఓ ప్రకటన చేసింది. నేనో కథ రాసి పంపాను. ఆ తర్వాత మూడు వారాలకి ఆ పత్రిక ఆఫీసు నుంచి నాకో ఫోనొచ్చింది. ‘‘కొత్త రచయితల నుంచి అసంఖ్యాకంగా కథలు రావడం వల్ల - లాటరీ పద్ధతి మీద ఓ కథని ఎన్నుకున్నాం. ఆ కథ మీది. 

వచ్చేవారం మీరు పత్రిక ఆఫీసుకి వచ్చి ఎడిటర్‌ సుందరాన్ని కలుసుకోగలరు’’అని.కథ గొప్పగా ఉందని కాక లాటరీ పద్ధతిలో ఎన్నికైందని విన్నాక కాస్త నొచ్చుకున్నా, ఎలాగోలా నా కథ ఎన్నికైంది కదా అని సరిపెట్టుకుని ఫోన్లో చెప్పిన టైంకి వెళ్లి సుందరాన్ని కలుసుకున్నాను. నన్నాయన ఆప్యాయంగా పలకరించి, ‘‘మా పత్రిక ప్రథమ వార్షికోత్సవం సం దర్భంగా ఈ ఏడాది సంక్రాంతికి ప్రత్యేక సంచిక తీసుకొస్తున్నాం. కవర్‌ స్టోరీలో ఓ సాహితీ ప్రతిభామూర్తిని పరిచయం చెయ్యాలనుకుంటు న్నాం. ఆయన జీవిత వివరాలతో పాటు, ఆయనకి నచ్చిన ఓ కథ, ఆయన అభిరుచులు ప్రచురిస్తాం. ఆయన కొత్త రచయితల్ని బాగా ప్రోత్సహిస్తారనీ, మీ కథని ఆయనే వెలుగులోకి తెస్తున్నారనీ పాఠకులకు చెబుతాం. ఆయన మీ కథని అభినందిస్తూ నాలుగు మాటలు కూడా రాస్తారు. మీకు ఓకే కదా’’ అన్నాడు.ఆనందం పట్టలేకపోయాను. ‘‘థ్యాంక్యూ వెరీ మచ్‌ ’’ అన్నాను వేరే మాట రాక.‘‘ఇప్పుడు మీకో విషయం చెప్పాలి. సంక్రాంతి సంచికలో కవర్‌స్టోరీ రచయిత గురించి ఇప్పట్నుంచీ పబ్లిసిటీ మొదలుపెడుతున్నాం. ఐతే ఆ రచయిత ఎవరూ, ఆయన ప్రోత్సహిస్తున్న కొత్త రచయిత ఎవరూ అన్నది ఆ సంచిక వచ్చేదాకా సస్పెన్స్‌. మీరు కూడా ఎవరికీ చెప్పకూడదు-మీ ఇంట్లో కూడా’’ అన్నాడు సుందరం.