విజయవాడ స్టేషనుల్లో ఆగిన గౌహతి - ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లోంచి ప్లాట్‌ఫారం మీదకి దిగాడు కిషోర్‌. అతడి పర్సనాలిటీ, వంటిపై ఉన్న యూనిఫారం అతడు మిలటరీలో పని చేస్తున్నాడని చెప్పకనే చెబుతున్నాయి. అతడి వెనకాలే దిగారు భార్యా, పిల్లలూ. వారి వెనకనే మిలటరీ వాళ్లు మాత్రమే వాడే నల్లని ఇనుపపెట్టె మరియు ఇతర సామాన్లు మోసుకుంటూ కూలీలు దిగారు. చుట్టూ చూశాడు కిషోర్‌. అతడి కళ్ళు తండ్రి కోసం వెతుకుతున్నాయి. దూరం నుంచి చెయ్యి ఊపుకుంటూ అతడి దగ్గరకు వచ్చారు కిషోర్‌ తండ్రి అయిన వెంకట్రామయ్య. ‘‘ప్రయాణం బాగా జరిగిందా? ఎలా వున్నావు?’’ అని కొడుకునుద్దేశించి అడిగాడు. ‘‘ఏమ్మా బాగున్నావా?’’ కోడలిని ప్రశ్నించాడు. మనవలిద్దరి తలలపై చేయివేసి ప్రేమగా నిమిరాడు.‘‘వెళదామా నాన్నా?’’ ప్రశ్నించాడు కిషోర్‌.‘‘పద, పద, టాక్సీ మాట్లాడుకునే వచ్చాను. త్వరగా ఇంటికి చేరాలి. ఇవాళ అర్ధరాత్రే కద నీ ఇంటి గృహ ప్రవేశ ముహూర్తం. 

అయినా నువ్వు కట్టుకొన్న కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయడానికి నువ్వే ఇలా ఆఖరు నిమిషంలో వస్తే ఎలారా? నీకంటే ముందే బంధువులంతా వచ్చారు. ముందే రాలేక పోయావా?’’‘‘బార్డురులో డ్యూటీ కద నాన్నా! లాంగ్‌లీవు అనేసరికి, నాకు ప్రతిగా ఇంకొకరు రావాలి. అన్నీ తెముల్చుకొని వచ్చేసరికి ఈ టైము అయింది. సరేగానీ, ఇల్లు పూర్తయిందా, ఇంకా పనేమైనా మిగిలుందా నాన్నా?’’‘‘అంతా పూర్తయినట్టే, కరెంటు, నీళ్ళ కనెక్షన్లు కూడా వచ్చేశాయి. గృహ ప్రవేశం చేయడమే తరువాయి. ఫర్నీచరు షిఫ్ట్‌ చేసుకొని కొత్త ఇంట్లో ఉండవచ్చు. మొత్తానికి ఈ వయసులో నామీద పెద్దభారమే పెట్టావురా. ఇంటిపనుల గురించి తిరగలేక చచ్చాననుకో. సమయానికి నీకు డబ్బు సర్దుబాటు అవుతుందో, కాదో.... ఇల్లు పూర్తవుతుందో లేదో అని భయపడ్డాను. సమయానికి అవసరమైనంత డబ్బు నువ్వు పంపడం వల్లే ఇల్లు త్వరగా పూర్తయింది. అయినా అడిగినప్పుడల్లా డబ్బు ఎలా సర్దుబాటు చేయగలిగేవురా?’’‘‘లోన్‌ పెట్టాను నాన్నా! దానికితోడు ఈ మధ్య రావలసిన ఎలవెన్సుల ఎరియర్స్‌ వచ్చాయి. అందుకే సమయానికి డబ్బు సర్దుబాటు చేయగలిగాను. అవునూ, బంధువులందరినీ పిలిచినట్టేనా! కేశవాచారిని కూడా పిలిచావా నాన్నా’’. మాట మార్చుతూ అడిగాడు కిషోర్‌.ఒక్కక్షణం తడబడ్డాడు వెంకట్రామయ్య. వెంటనే తమాయించుకుని ‘‘ఆ! అందరినీ పిలిచాను’’ అన్నాడు ముక్తసరిగా. ఇంతలో టాక్సీ సత్యనారాయణపురంలోని వాళ్ళ ఇల్లు చేరింది.విజయవాడలో ఇటీవల అభివృద్ధి చెందుతున్న గొల్లపూడి ప్రాంతంలో తనకోసం కట్టుకున్న ఆకర్షణీయమైన భవంతిలోకి ఆ రోజు రాత్రి గృహప్రవేశం చేశాడు కిషోర్‌. తాను చేసిన సూచనల మేరకు, తన అభిరుచులకు తగ్గట్టుగా ఇంటిని కట్టించినందుకు తండ్రికి ధన్యవాదాలు తెలియజేశాడు. ఇల్లు నచ్చిందని భార్య కళ్లతోనే చేసిన ప్రశంసని గర్వంగా అందుకున్నాడు.

మరుసటిరోజు పొద్దున సత్యనారాయణ వ్రతం. ఈలోగా బంధువుల పలకరింపులు, అభినందనలు, మర్యాదలు, ఉద్యోగధర్మం గురించి ఆరాలు... కిషోర్‌కి ఊపిరి సలపలేదు. సాయంత్రానికి సద్దుమణిగింది. విశ్రాంతిగా కూర్చొని తండ్రితో పిచ్చాపాటి మాట్లాడుతుండగా, హఠాత్తుగా గుర్తుకు వచ్చిందతడికి, గృహప్రవేశానికి తన బాల్యమిత్రుడు కేశవాచారి రాలేదని, ‘‘కేశవాచారి వచ్చినట్టు లేడే? మీరతన్ని పిలిచారుగా?’’ అని అడిగాడు.