అనుకోకుండా తారసిల్లిన పెళ్ళిళ్ళ పేరయ్యను చూడగానే హమ్మయ్య దొరికి పోయాడు! వెదకబోయిన తీగ కాలుకే తగిలిందని (తాకిందని) సంభ్రపడి పోయాను!మండుతున్న ఎండలో, వాహనాలు కక్కుతూన్న పొగలో గాలి పీలుస్తూ, ఏ కొద్దిపాటి గాలివీచినా లేచి పోయేలా ఉన్న పేరయ్యను నా మోటార్‌ సైకిల్‌ వెనుకాల ఎక్కించుకొని ఒకటే పరుగు ఓ మంచి హోటల్‌ వైపు.ఎయిర్‌ కండిషన్డ్‌ హోటల్‌లోకి తీసుకుపోయాను పేరయ్యను. రిఫ్రెష్‌ రూం కెళ్ళి ఫ్రెష్‌ అయి వచ్చాడు చిన్నగా నవ్వుకొంటూ పేరయ్య.రెండు టూటీ ప్రూటీలు, రెండు ధమ్స్‌అప్‌లు తెప్పించాను. అక్కడికక్కడి కబుర్లయ్యాక అసలు సంగతి చెప్పడం మొదలెట్టాను కోపం తాపం, నిరసన వగైరా మేళవించి.‘‘నీకు తెలుసో తెలియదో గాని... నాల్గేండ్ల క్రిందట నువ్వు అమర్చిన ఓ గొప్పింటి సంబంధం రెండేళ్ల క్రితం నా కొంప ముంచి విడాకులు తీసుకుంది! ఆ షాక్‌ను భరించలేక మా అమ్మ మంచం పట్టుకుంది.‘‘...నేను మరో పెళ్ళి చేసుకుందామనుకొంటున్నాను. జేబులో దుబాయ్‌ వీసా కూడా ఉంది. పెళ్ళయ్యాక కూడా తీసుకెళ్దామనుకొంటున్నానుపెళ్ళికూతుర్ని. 

అక్కడే హనీమూన్‌ అనుకో...’’ అంటూ చిన్నగా నవ్వుతూ పేరయ్య ఏదో చెప్పబోతుండగా అతని మాటకు అడ్డుతగిలి, ‘‘విడాకులు పొందిన లేదా భర్తపోయిన... పిల్లలు లేని.. గ్రాడ్యుయేట్‌... ముప్పయ్‌ ఏండ్ల లోపు... చూడటానికి ముద్దుగా ఉన్న ఏ గువ్వ అయిన పర్వాలేదోయ్‌! కట్న - కానుకలు వగైరా వగైరాలు అవసరం లేదనుకో!’’ అని నసిగాను.‘‘పెండ్లి ఎప్పటివరకు చేసుకుందామనుకొంటున్నారు?’’ ఏదో ఆలోచిస్తూ అడిగాడు పేరయ్య.‘‘ఇప్పుడే! ఇక్కడే!!’’ ఎంత తొందర్లో ఉన్నానో చెప్పడానికి అలా చెప్పాను.పేరయ్య ఇకిలిస్తూ ‘‘అయితే అబ్బాయిగారు చాలా తొందర్లో ఉన్నారన్న మాట! ఇక ఫొటోలు, పెద్దలతో మాట్లాడుకోవడాలు వగైరా వగైరాల్లాంటివి కావాలంటే చాలా టైం పట్టుతుంది. నా ఉద్దేశ్యంలో ఒకర్నొకరు చూసుకుని సై అంటే మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చును!’’‘‘డైరెక్ట్‌గా అమ్మాయినే తీసుకు వస్తాను. తనే స్వతహాగా నిర్ణయం తీసుకొంటుంది. ఆమె మిమ్మల్ని చూసి సై అంటే ఆమె పెద్దలు కూడా సై అంటారు. నువ్వేమంటావ్‌?’’ అనడిగాడు పేరయ్య.