పావుగంట నుంచి తదేకంగా ఆ అక్వేరియంలో చేపల్నే చూస్తోంది రజని. ఒక్క రెండు చేపలు తప్ప మిగిలిన చేపలన్నీ తమ ఇష్టమొచ్చినట్టు కదులు తున్నాయి. రెండు చేపలు మాత్రమే ఒకదానినొకటి వెంబడిస్తున్నట్టు కదులు తున్నాయి. అందులో ఒక చేప ఇంకో చేపని స్వేచ్ఛగా కదలనివ్వడం లేదు. వెంటే ఉంటూ దాని దారికి అడ్డొస్తోంది. కచ్చితంగా ఇది మగ చేపే అయ్యుంటుంది అందుకే ఇలా అడ్డు తగుల్తోంది అనుకోకుండా ఉండలేకపోయింది రజని. ఆ అడ్డమొచ్చే చేపను చూస్తే రజనీకి ఆనంద్‌లా కనిపించాడు.అరగంటక్రితం తామిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. వద్దనుకున్నా కూడా ఆ చేప ఆనంద్‌నే గుర్తు చేస్తోంది. ఏం తక్కువ, ఇద్దరికిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లే. హాయిగా అన్నీ అమర్చుకున్నారు. అప్పుడే పెళ్లై ఆరేళ్ళయిపోయింది. చిన్న పిల్లల్ని చూసినప్పుడల్లా తనకో వెలితి. తమింట్లో అలాంటి పాపో, బాబో తిరుగాడుతుంటే ఇల్లెంత కళకళలాడుతుంది అనుకుంది. తమ ఇల్లెప్పుడూ ధ్యానమందిరంలా నిశ్శబ్దంగా కొంచెం భయపెడుతున్నట్లు కూడా ఉంటుంది. ఇంకా ఎన్నాళ్ళిలా హింసపడాలి అని అనుకోకుండా ఉండలేకపోయింది. ఒళ్లంతా గీరినట్లు ఆనంద్‌ మాటలు గుచ్చుతూనే ఉన్నాయి. ఏమన్నాడు ఆనంద్‌...‘‘రజనీ డియర్‌! నీ ఆదుర్దా నాకర్థమైంది. 

మనకింకా పిల్లలు లేరే అన్నది కదా నీ బాధ. పిల్లలుండాలి సరే. నీ పిల్లలకు అన్నిసౌకర్యాలు నువ్వివ్వ గలగాలి కదా! దానికి మనం సంపాదించేది సరిపోతుందా? మనకి గేటెడ్‌ కమ్యూనిటీలో ఇల్లుండాలి. స్కూలుకు లక్ష రూపాయల ఫీజుకట్టే స్తోమతుండాలి. ఈలోగా మనం ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ స్థాయి నుంచి టీం లీడర్లవ్వాలి. ఒక ఫారిన్‌ అసైన్‌మెంట్‌ సంపాదించాలి. అంతవరకు ఓపిక పట్టాలి! తప్పదు’’ లోపలి అసహనాన్ని నవ్వుతో కప్పేస్తూ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. దానికి తనేం చెప్పింది ‘‘ఆనంద్‌, జీవితమంతా లెక్కలు వేసుకుంటూ బతకటమేనా? ఆఫీస్‌ తప్పిస్తే నీకు వేరే ప్రపంచం అక్కర్లేదా! ఇంకా ఎన్నాళ్ళు ఎండమావి వెనక పరిగెడతావు?’’‘‘రజ్జూ డియర్‌, ఇవాళ నీ చుట్టాల్లో, స్నేహితుల్లో నీకో స్టేటస్‌ ఉంది. ఓ గుర్తింపు ఉంది. కాదనను. అది మాత్రమే సరిపోతుందా చెప్పు. ఇవాళ నీకో మంచి అపార్ట్‌మెంట్‌ ఉంది. వచ్చే సంవత్సరానికి అది పాతన్యూస్‌. మనం ఎప్పటికప్పుడు మనల్ని అప్‌గ్రేడ్‌ చేసుకుంటూ ఉంటేనే మనకా స్టేటస్సూ, గుర్తింపూ! ఇదో పరుగుపందెం రజనీ. దీన్ని ఆపటానికి వీల్లేదు. ఇలా పరిగెడుతూనే ఉండాలి. నువ్వు పరుగు ఆపావనుకో. నిన్ను మర్చిపోతుందీ లోకం. కాబట్టి దానికి తగ్గట్టు ఓ ‘ఆడి’ కారుకు ప్లాన్‌ చేస్తున్నా. అలాగే మన యూ.ఎ్‌స. ట్రి్‌పకు ప్రయత్నం చేస్తున్నా. ప్రస్తుతం ఇవే నా లక్ష్యాలు. సరేనా’’ మళ్ళీ అదే తెచ్చిపెట్టుకున్న నవ్వు ఆనంద్‌ మొహంలో..