ఆ రోజు కెమెరా వెనక నిలబడి నేను వేసిన పిచ్చి వేషాలకు అమ్మ ఎంతలా నవ్విందో! ఆ నవ్వునే బాచి మావయ్య బాగా ఒడిసి పట్టుకుని ఇల్లంతా దీపావళి చేశాడు. అప్పుడప్పుడే తను సందర్శించి వచ్చిన నయాగరా జలపాతం ఛాయాచిత్రంపైన ఈ నవ్వుల మతాబాని పెట్టి ఒక సుందరతరమైన ఫోటో క్రియేట్‌ చేశాడు. ఆ ఒక్క ఫోటోతో ఎంత వెలుగునీ ఉత్సాహాన్నీ నింపాడు ఇంటో!్ల ఇంకిప్పుడు మిగిలింది అదే!జల జల రాలే జాజిపువ్వుల నవ్వు.దోసిటపట్టి దాచుకోవాలనిపించే నవ్వు.నిజానికి ఆవిడకు వెన్నెల అని పేరుపెట్టి వుండాలి అమ్మమ్మ. కాని నాకు పెట్టింది ఆ పేరు.నారింజరంగు చీరె, ఎర్రరాళ్ల బుట్టలు, గాలికి ఎగిరే ముంగురులు ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేసాయి. ఎంత అందం మా అమ్మది! ఎంత చల్లని నవ్వు మా అమ్మది! ఎంత ఉత్సాహం మా అమ్మది!నా చిన్నప్పుడు మా నాన్న పాటలు బాగా పాడేవాడు. అమ్మ తలంటుకుని తల తుడుచుకుంటూ వుంటే ‘‘కొంజిగురాకు వేళల కురుల్‌ తడి యార్చుచు కూరుచున్న అభ్యంగన మంగళాంగి జడలల్లుదునా ఆ ఆ ఆ’’ అని పొడుగు పొడుగు రాగాలు తీసేవాడు. మొక్కలకు నీళ్ళు పోస్తుంటే ‘‘నారింజకు నీరువోయు శశిరేఖవె నీవు’’ అని పాడేవాడు. 

అమ్మ పేరు శశిరేఖ. అవును నాన్నే....మా నాన్నే!దీపం వెలుగుతున్న ఆ ఫోటో దగ్గర, గులాబీల దండ వేసుకున్న ఆ నయాగరా సుందరి దగ్గర ఇప్పుడు నేను నిలబడి చూస్తున్నాను. ఆ దండనీ, దీపాన్నీ నమ్మటానికి ప్రయత్నిస్తున్నాను.నిన్న సాయంత్రం నిర్జీవమైపోతున్న కళ్ళు సగం తెరిచి ‘‘జాగ్రత్త కన్నా! నన్ను క్షమించరా తల్లీ ఇట్లా విడిచిపెట్టిపోతున్నందుకు. ఐ యాం హెల్ప్‌ లెస్‌’’ అంది. ఆమె కళ్ళలో తడి ఇంకిపోయి కొన్నాళ్లయింది. నా చేతిని ఆమె చేతిలో ఉంచాను. ఆ చెయ్యి ఎప్పుడూ వెచ్చగా వుండేది. ఇప్పుడు చాలా చల్లగా వుంది. మృత్యు శీతలం.. ఇప్పుడో ఇంకాసేపో! అది ఖాయం అయిపోయింది. సంసిద్ధం అయిపోతున్నాం అందరం. లేపి కూచోబెట్టి వెనుక తాను ఆనుకుని కూచుంది చిట్టి. అమ్మ తలపై ఇప్పుడిప్పుడే వస్తున్న అరంగుళం జుట్టు. లోతుకుపోయిన బుగ్గలు. కిమోలు, రేడియేషనులు, మందులు, మాకులు, వాంతులు, జ్వరాలు ఒకటా రెండా? చిత్రవధకి లోనైన శరీరం. అమ్మేం చేసిందని ఆమెకీ శిక్ష? నిండా యాభై ఏళ్ళు కూడా లేని అమ్మకి? మా హాలులో పాతిక భాగం గోడని ఆక్రమించుకున్న ఫోటోలోని అమ్మ మా అమ్మ. ఈవిడ కాదు. అమ్మ తల ఊపింది, ఏడవద్దని కాబోలు. నేను పరిగెత్తుకుంటూ బాల్కనీలోకి పోయి ఏడ్చాను చాలాసేపు. చిట్టి వచ్చి చెప్పింది ‘‘అమ్మ ఎక్కువసేపు వుండదు. వెళ్ళి ఆమె దగ్గర కూచో’’ అని. రాత్రంతా అలానే కూచున్నాం. పొద్దుటికి అంతా అయిపోయింది.