‘‘రే ఇబ్రూ...సందల్‌ఖోడ్‌ (గంధపు చెక్క) యాడన్నా చూసినావారా?’’ ఇంట్లోంచి అమ్మ కేకేసింది.‘‘లేదు మా’’ వీధిలోంచి నేను కూడా కేకేసిన... ఎర్రగా బండిగానుకు తొడగటానికి పిడకల్లో కాల్చిన కమ్మీలా పడమటి కొండ మీద ఆనబోతున్న పొద్దు అందం చూడ్డంలో మునిగి.‘‘బా...బా...రొవంత వెతికి పెడ్దువురా నాయనా’’ అమ్మ వేడికోలు గొంతు మృదువుగా రెట్టపట్టుకుని లాగింది.‘‘వస్తుండాలేమా’’ బదులిస్తూనే ఇంట్లోకి పరుగెత్తా.గడపలో అడుగుపెడ్తానే కమ్మగా కమ్ముకున్నది... మసాలాలో పొర్లాడి, షేర్వాలో ఈదులాడి మెత్తమెత్తగా ఉడికిన ముక్కల ఘుమ ఽఘుమ. అది ముక్కుల్లోకి జొరబడి గుండెల్నిండా పాకి కడుపులోకి సందు జేసుకుని ఏదో కరకరను పుట్టిస్తాంటే దాని దెబ్బకు తట్టుకోలేక అమ్మవైపు జూసిన.అమ్మ నన్ను చూళ్లేదు. ఘాబరా ఘాబరాగా వెదుక్కుంటోంది. అమ్మకు ప్రతిదానికీ ఘాబరానే! అందునా ఈ రోజు పండగ...వెనకరూములో పొయ్యిదిగిన కుండల్లోంచి తోసుకొస్తున్న రకరకాల వాసనలు పేగుల్ని బోరింగుబండి పైపుల్లా కిందకి మీదికి కలదిప్పుతాంటే ఆత్రంగా నేను కూడా సందల్‌ఖోడ్‌ వెతికే పనిలో పడినా.ముందు ఖురాన్‌పెట్టె ఉండే గూట్లో చూసిన. పెట్టె తెరవగానే ఊదుబత్తీల వాసన గుప్పున మొఖమ్మీదికొచ్చింది.‘‘ఆడ చూసినా నాయనా!’’ ఇంకోగూట్లో వెతుకుతూ అంది అమ్మ. ‘‘ఈడ లేదంటే...ఇంగేడ ఉంటదిబ్బా!’’ ఆలోచనలో పడిన. అదసలే చిన్నముక్క. నేను పుట్టకముందు నుంచే ఇంట్లో ఉన్నెట్టుంది. 

మొదట్లో ఎంతున్నదో! ఎట్లున్నదో? పండక్కి పండక్కి అరిగిపోయి ఇప్పుడు చిన్న త్రికోణాకార పు చెక్కగా చిక్కిపోయి వుంది.ఎక్కడ పడిపోయిందో అది. దొరక్కపోతే ఇబ్బందే. అందుకే అమ్మకు ఆదుర్దా.ఈ రోజు పెద్దల పండగ. పొద్దుగూకీ గూకకముందే చదివింపులు చేసెయ్యాల.పైలోకంలో ఉండే పెద్దోల్లు, ‘మావాళ్లు మాకోసం ఏం వండి పెట్టారో’ అని తొక్కులాడ్తా ఉంటారంట.వాళ్లకిష్టమైనవన్నీ ఇయాల వండిపెట్టాల. వాళ్ళలో ఎవరికన్నా ఆకు వక్క, బీడీలాంటి అలవాట్లుంటే-అవి కూడా తెచ్చిపెట్టాల. ఇవే కాక పండ్లు, పూలు, ఇంట్లో వాడకుండా ఏమన్నా కొత్త గుడ్డలుంటే అవీ...అన్నీ పెట్టి వాళ్ల పేరిట చదివింపులు చెయ్యాల.అప్పుడు పెద్దలంతా భూమ్మీదికి దిగొచ్చి ఈ చదివింపులన్నీ అందుకుంటారని నమ్మకం. నిజంగా వాళ్ళు అందుకుని అనుభవించకపోయినా, వాళ్లకు చదివించినవి పేదలకు దానం చేస్తే ఆ పుణ్యం వాళ్లకు దక్కుతుందని విశ్వాసం.ఎవరింట్లో చదివింపులు ముందుగా పూర్తవుతాయో, ఎవరి పెద్దలు ముందుగా భూమ్మీదికి దిగొస్తారో ఆ ఇంటోల్లకు ఇంకా పుణ్యమట! అందుకే చదివింపులు త్వరగా చెయ్యాలని ప్రతి అమ్మకు తొందర. మాయమ్మ గ్గూడా అదే తొందర.పెద్దలకు భూమ్మీదికొచ్చే తొందరైతే అమ్మకు చదివింపుల తొందర. నాకు అమ్మ చేసినవన్నీ గబగబా లాగియ్యాలనే తొందర.ఈ తొందరలన్నీ సందల్‌ఖోడ్‌తో ముడిపడివున్నై. అది కనబడితే గానీ ఈ ముళ్లన్నీ విడిపోవు.