‘‘ఏంటండీ.. అన్నాన్ని అలా కోడిలా కెలుకుతున్నారు...’’ అడిగింది వసుమతి...రఘురాం వెంటనే సమాధానం చెప్పలేదు...‘‘ఏంటండీ కూర నచ్చలేదా...’’ అడిగింది..మళ్ళీ సమాధానం చెప్పలేదు రఘురాం...‘‘మీకు నచ్చుతుందనే కదా పొట్లకాయలో పచ్చశనగపప్పు వేసి చేశాను..’’ వివరణ ఇచ్చుకుంది వసుమతి.రఘురాం ఒక్కసారిగా భార్య ముఖంలోకి చూస్తూ..అన్నం కంచంలో చెయ్యి కడిగేశాడు...‘‘అయ్యో ఏమిటండి భోజనం పూర్తి కాకుండా లేస్తున్నారు..’’ ఆందోళనగా అంది వసుమతి...‘‘అన్నం తినాలనిపించడం లేదు వసూ... పడుకొనే ముందు ఒక గ్లాసు మజ్జిగ ఇవ్వు చాలు..’’ చెప్పాడు రఘురాం..వసుమతి ఏమీ మాట్లాడలేదు.‘‘సర్లెండి.. మీకు క డుపులో బావో లేదేమో... రెండు పండ్లు తిని పడుకోండి.. మజ్జిగ తెచ్చిస్తాలే...’’ చెప్పింది వసుమతి...రఘురాం చిద్విలాసంగా ఒక నవ్వు నవ్వి..‘‘బావోలేంది కడుపు కాదే.. మన సులో..’’’ అనుకొన్నాడు.రాత్రి పడక మీద దొర్లుతుంటే..‘‘ఏంటండీ.. ఏం బావులేదా?..’’ వసుమతి మళ్ళీ అడిగింది.‘‘మనసు బావోలేదూ వసూ..’’ చెప్పాడు రఘురాం.‘‘మనసా? ఏమైందండి..’’ ఆదుర్దాగా అడిగింది వసుమతి..‘‘సాయంత్రం కృష్ణమూర్తిని చూడాలని వాడింటికెళ్ళా.. లైటు కూడా వేసుకోకుండా అలాగే పడుకొని వున్నాడు. మనిషి చాలా నలిగిపోయినట్లు వున్నాడు.. ‘ఏమైందిరా అలా వున్నావని’ అడిగా.. కృష్ణమూర్తి కాసేపు ఏమీ మాట్లాడలేదు...‘రఘు లైట్‌ వేయరా?..’ అని అడిగాడు. నేను లైటు వేసి కృష్ణమూర్తి ముఖంలోకి చూశాను.. పది లంకణాలు చేసిన వాడిలా వున్నాడు.. ‘ఏమైందిరా ఇలా వున్నావ్‌..’’ మళ్ళీ అడిగాను..‘‘ఏమీ లేదురా బాగానే వున్నాను..’’ అని బుకాయించాడు.

‘‘కృష్ణా నాకెప్పుడైనా అబద్దం చెప్పావా?’’అని అడిగాను..ఏమనుకున్నాడో ఏమో..పది నిముషాల తర్వాత.. ‘‘అమూల్య మ్యారేజ్‌ చేసుకొంది రా...’’ అని చెప్పాడు.‘‘అవునా? ఇది శుభవార్త కదరా...’’ అన్నాను.వాడు షాకైనట్టు చూశాడు....‘‘అలా పెళ్ళి చేసుకోవడం నీకేం ఆశ్చర్యం కల్గించలేదా?’’అడిగాడు..నేను వెంటనే మాట్లాడలేదు...వాడి ఫీలింగ్స్‌ అర్ధమయ్యాయి నాకు..‘‘సారీ కృష్ణా..’’ చెప్పాను.‘‘గుండెల్ని పిండేస్తున్నట్టుగా వుంది రా రఘు..’’ చెప్పాడు.‘‘ఇది రెండువేల పదిరా.. నువ్వు నైన్‌టీన్‌ సెవంటీలో ఆగిపోతే ఎలా..’’అన్నాను...కృష్ణమూర్తిలో దు:ఖం పొంగుకువచ్చింది.‘‘చేయాల్సిందంతా చేసి నేరుగా చెప్పే ధైర్యం లేదని.. అందుకే ఈ మెయిల్‌ పెడుతున్నానని మెసేజ్‌ పెట్టింది. దాని గురించి ఎన్నో కలలు కన్నాను..’’ కృష్ణమూర్తి గొంతు దు:ఖంతో పూడుకుపోయింది.జరిగింది భార్యకు చెప్పాడు రఘురాం..‘‘మీరేం చేయగలరండి..’’ అంది బాధగా వసుమతి.రఘురాం భార్య కళ్ళల్లోకి చూస్తూ..‘‘నా బిడ్డ నా పెంపకంలో ఆదర్శంగా పెరుగుతుందని.. తన మాట జవదాటదని.. ఆశించాడు.. పదేళ్ళ వయసు నుండి అన్నీ తానై పెంచాడు. ఇలా చెప్పా పెట్టకుండా అమూల్య ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జీర్ణించుకోలేకున్నాడు.. తన పెంపకంలో లోపం ఎక్కడా? అని మదన పడుతున్నాడు.?’’ చెప్పాడు రఘురాం..వసుమతి కళ్ళ ముందు కృష్ణమూర్తి గతం కదలాడింది...