‘‘అన్నా, సాధువుకి సన్నాసికి తేడా ఏంటి?’’ అసిస్టెంట్ డైరెక్టర్ భానుమూర్తి అడిగాడు.బట్టతలని తడుముకున్నాడు ప్రొడక్షన్ సుబ్రమణ్యం. ఫీల్డ్‌లోనే అతని జుట్టు పండిపోయి రాలిపోయింది కూడా. ఆర్టిస్టవ్వాలని వచ్చి జూనియర్ ఆర్టిస్టయ్యాడు. యాక్టింగ్ కంటే కేటరింగే లాభమని గ్రహించి, ప్రొడక్షన్‌లో ఫుడ్ సప్లయ్ చూస్తున్నాడు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ఫ్రేమ్‌లో కనిపించి, ఆ ఫోటోకి ఫ్రేమ్ కట్టించుకుంటూ ఉంటాడు.‘‘సాధువుకి పొడుగాటి గడ్డముంటాది, సన్నాసికి గడ్డముండాలని రూల్ లేదు.’’‘‘చచ్చాను. ఇప్పుడు గడ్డమోన్ని నేనెక్కడ తెచ్చి సచ్చేది. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో క్యాస్టింగ్ చూడ్డమంత దరిద్రం ఇంకొటి లేదు.’’‘‘ఇదిగో ఈ టీ తాగి క్లారిటీగా చెప్పు.’’‘‘మా డైరెక్టరున్నాడు కదా, మెంటల్ సెంటిమెంటల్ కలిసిపోయి వాడు సెమిమెంటల్‌గా తయారయ్యాడు. లొకేషన్‌లో సీన్లు మారుస్తాడు, డైలాగ్‌లు చేంజ్ చేస్తాడు. ఫాలో కాలేక ఇద్దరు కో డైరెక్టర్లు ఇప్పటికే పారిపోయి రైలెక్కేసారు. ఇప్పట్లో తిరిగి రారు. ఏం మాట్లాడినా కరుస్తాడు. తీసేది తక్కువ, తిట్టేది ఎక్కువ.’’‘‘ఏందిరా భయ్ లొల్లి’’ అంటూ యాదగిరి వచ్చాడు.
డైరెక్టర్ని ఎవడైనా తిడుతూ ఉంటే అతనికి మహా ఆనందం. సొంతూరు షిర్డీ. నాన్న లేడు. అమ్మ చిన్న హోటల్ నడుపుతోంది. డైరెక్షన్ పిచ్చి పట్టి ఇంట్లోంచి పారిపోయి వచ్చాడు. సంచి నిండా కథలైతే రెడీగా ఉన్నాయి కానీ, కొనే నిర్మాత ఇంకా దొరకలేదు.‘‘లంచ్ టైంకల్లా సాధువునో, సన్నాసినో తెచ్చి లొకేషన్‌లో రెడీగా ఉంచమంటున్నాడు మన డైరెక్టర్.’’‘‘సాధువా? సీన్ పేపర్లో ఆ క్యారెక్టర్ లేదు కదరా...!’’‘‘మన డైరెక్టర్‌కే కేరక్టర్ లేదు, సినిమాలో ఏ కేరక్టర్ ఎక్కడుంటుందో ఎవడికి తెలుసు?’’
‘‘అరే, నా సర్వీస్‌లో ఎందర్నో చూసినా. డైరెక్టర్‌తో తిట్లు తినని అసిస్టెంట్ డైరెక్టర్లు లేరు. డైరెక్టర్ని చాటుగా తిట్టకుండా ఉండే అసిస్టెంట్ డైరెక్టర్లూ లేరు’’ అన్నాడు సుబ్రమణ్యం.మేకప్పోడు అటుగా పోతూ కనిపించాడు. లొకేషన్‌లో చాలామందిని డిపార్ట్‌మెంట్ల పేర్లతోనే పిలుస్తుంటారు. పేర్లు గుర్తుండవు.‘‘గురువా, డైరెక్టర్ కావాలంటున్నాడు. పొడుగాటి గడ్డాలు, మీసాలు అరేంజ్ చేస్తావా?’’ అడిగాడు భానుమూర్తి.‘‘అవన్నీ ముందే చెప్పాలి. గడ్డాలు మీసాలు రెడీగా ఉంచుకోడానికి మనమేమైనా పౌరాణికం తీస్తున్నామా. కృష్ణానగర్ వెళ్ళి తెచ్చుకోవాలి’’ అని అతగాడు వెళ్ళిపోయాడు.