ఆ సాయంకాలం కాలేజీ స్టాఫ్‌ రూములో పది మందికీ చర్చనీయాంశమైన విషయం రాజశేఖరం మాస్టారికే మాత్రమూ ఆసక్తిని కలిగించలేదు! మిగతా లెక్చరర్లు కూడా ఆ విషయాన్ని ఆయనతో చర్చించలేదు. వారి దృష్టిలో ఆయనొక కొరకరానికొయ్య. ‘మనకెందుకులే... మరో అయిదేళ్లలో రిటైరయ్యే పెద్దమనిషితో’ అనుకున్నారు.ఆయన తన చేతుల్లో ఉన్న ‘వేయిపడగలు’ చదవడంలో పూర్తిగా నిమగ్నమై పోయి ఉన్నారు. అడపాదడపా కొందరు సైన్సు, మ్యాథ్స్‌, ఇంగ్లీష్‌ లెక్చరర్ల మాటలు ఆయన చెవిని పడుతూనే ఉన్నాయి.‘‘వాట్‌ప్లెజర్‌ హీ గెట్స్‌ బై రీడింగ్‌ చట్‌ ఓల్డ్‌ స్టఫ్‌...?’’‘‘డోంట్‌ నో యార్‌...! నెవెర్‌సీన్‌ సబ్‌ ఎ బుక్‌ వార్మ్‌...’’ ఇద్దరి సంభాషణలో కల్పించుకుంటూ ఓ కుర్ర లెక్చరర్‌ అన్నాడు. ‘‘డోంట్‌ సే లైక్‌ దట్‌... ఓల్డ్‌ ఈస్‌ గోల్డ్‌..’’ మాసికల జీన్సు ప్యాంటును జారిపోతుండగా పైకి లాక్కుంటూ... కాసేపయ్యాక ఆ కుర్రాడే రాజశేఖరం గారినుద్దేశించి అన్నాడు.

‘‘మీకు తెలుసుగా సార్‌... మన కాలేజీలో అయిదేళ్ల క్రితం ఫస్ట్‌ బ్యాచ్‌ చదివిన స్టూడెంట్స్‌ ‘ఓల్డ్‌ స్టూడెంట్స్‌ డే’ జరపబోతున్నారు’’ఆయన కళ్లజోడు సవరించుకుని చెప్పారు- ‘‘అలాగా... చాలా సంతోషం...’’‘‘వాళ్లు మిమ్మల్ని ఇన్వైట్‌ చెయ్యడానికొచ్చినప్పుడు మీరు లీవులో ఉన్నారు. అందువల్ల నన్ను మీకు చెప్పమన్నారు. ఆదివారం సాయంకాలం నాలుగింటికి మీరు తప్పక రావాలట’’. భుజాలెగరేసి తన బాధ్యత తీరిపోయిందన్నట్లు మళ్లీ కబుర్లలో పడ్డాడు.మాటల మధ్యలో ఎవరో అంటున్నారు. ‘‘ఆయనకంతగా గుర్తుపెట్టుకుని చెప్పాల్సిన పనిలేదు... ఆ ఓల్డ్‌ స్టూడెంట్సంతా ఇంజనీరింగ్‌, మెడికల్‌ కోర్సులు చదువుతున్న వాళ్లు. ఈ తెలుగు మాస్టారితో వాళ్లకేమంత ‘క్లోజ్‌నెస్‌’ ఉండదు. చెప్పినా చెప్పకపోయినా వాళ్లేమంతగా ఫీల్‌ కారులెండి’’.అప్రయత్నంగా చెవిన పడుతున్న వారి మాటలను వింటూ ఆయన నిర్లిప్తంగా తన పుస్తకంలో లీనమయ్యారు. ఒక్కసారిగా చదువుతున్న పుస్తకంలోని పేజీలు ఆయన గతం తాలూకు జ్ఞాపకాల పుటలుగా మారిపొయ్యాయి..అవి రాజశేఖరం గారు పదో తరగతి పాసైన రోజులు. అప్పుడప్పుడే ఇంజనీరింగ్‌, మెడికల్‌ కోర్సులకు తల్లిదండ్రులు కొంచెం ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్న రోజులు.‘‘మన శేఖరం ఇంజనీరింగ్‌ చదవనంటున్నాడండీ కాస్త మీరయినా నచ్చ జెప్పండి’’.కాలేజీలో అడ్మిషన్‌ కొరకు అప్లై చేద్దామనుకుంటూండగా తల్లిమాటలు ఆయన చెవిని పడ్డాయి.‘‘అదే... నేనూ చెప్పి చూసాను. బాబు వినడం లేదు. తనెంతసేపూ ఇంటర్‌లో ఆర్ట్స్‌ గ్రూప్‌తో చదివి ఆ తర్వాత బి.ఏ., ఎం.ఏ తెలుగు సాహిత్యం చదువుతానంటున్నాడు. లెక్చరర్‌ నవుతానంటాడు’’ తండ్రి బాధగా చెప్పాడు.‘‘మరోసారి చెప్పండి... ఏ డాక్టరో, ఇంజినీరో అవుతే సంఘంలో ఆ గౌరవం వేరు...’’‘‘అమ్మా... లెక్చరర్స్‌కు కూడా సమాజంలో ఎంతో గౌరవం ఉందిగా తల్లీ’’ శేఖరం తాతగారు కోడలికి నచ్చచెప్పబోయారు.