అనిర్వచనీయమైన అనుభూతిలో మునిగిపోయాం మేమంతా. ఏ మాత్రం అర్థం కాని భాష... అంతరంగ అంతఃపురంలో రసస్పందన... కంఠంలో శ్రావ్యత... మాటలోని సౌందర్యం... మంత్ర ముగ్థులయిపోయాము. మాటలు రాని మూగవాళ్ళలా కాసేపు వుండిపోయాము. ఆ పైన... నా వెనుక నుండి ఎవరో అభినందిస్తున్నట్టుగా చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్ల పరంపర ఆ ప్రాంగణమంతా మారుమ్రోగిపోయింది.అతను పాడిన పాటల్లోని మాటల కర్థమేమిటని ఎవరూ అడగలేదు. అడగరు కూడా... జవం జీవం ఆ భాషలో ఉట్టి పడుతున్నాయ్‌. తెలీని భాషలో తెలపాలనుకున్న భావాన్ని వ్యక్తం చేయగలిగాడు అతను. అందరికీ ఏర్పాటు చేసినట్టే, అనువాదకుడిని ఏర్పాటు చేసారు. ఆ అనువాద కుడు- తనకి అనువాదకుడు అవసరంలేదని ఆ వ్యక్తి చెప్పిన విషయాన్ని తెలియజేస్తూ కూచున్నాడు.అక్కడ వున్నవారెవరికీ గ్రీకు భాష తెలియదు. ఆ భాష ఔన్నత్యం వేరే భాషలో అందించడం అతనికి యిష్టం లేదు.ఒకే ఒక వాక్యం ఇంగ్లీషులో చెప్పాడు. గ్రీకు దేశంలో, గ్రామాల్లో పాడుకునే జానపద గీతమని మాత్రం తెలియజేసాడు. ‘జన హృదయం’ ఆ జానపద గీతంలో వొదిగి వుండి వుంటుంది. అందుకే గుండెకి సూటిగా తాకింది ఆ గీతం.ఆ పాట పాడడం మొదలుపెట్టిన క్షణంలో అతని కళ్ళలో ముత్యాల్లా కన్నీళ్ళు.ఆ కన్నీళ్ళు కొత్త భాషకి పురుడు పోస్తున్నట్టు అనిపించింది. పాడుతున్నంతసేపు తనని తాను మరచిపోయాడు. అతనే కాదు, ఆ చుట్టు పక్కలవాళ్ళు, తన్మయత్వంతో కొత్త లోకాల్లోకివిహరించారు. 

‘నా భాషలో గొప్పతనముంటే అదే మీ అందరిని రంజింప చేస్తుంది’ అన్న ధీమా వుంది అతని చూపులో.శబ్దంలోని స్వరం గమకాలు తొక్కింది. ఒక్కోసారి గొప్ప వాటికి అర్థం తెలుసుకోవడంలో కన్నా,నిరంతరం వూహించుకోవడంలో ఆనందం వుంటుంది.చాలామంది లాగానే నేనూ, వేదిక దగ్గరకి చేరాను. అభినందనల పర్వం పూర్తయ్యింది. అందరికి వినయంగా రెండుచేతులతోనూ నమస్కరిస్తున్నాడు అతను. అణకువ, విధేయత జ్ఞానులకి అలంకారాలుగా నిలుస్తాయి.నాకు మాటలు రాక, శిలా ప్రతిమలా వుండి, అతన్ని కళ్ళతోనే పలకరించి, అతని చేతిని నా చేతిలోకి తీసుకుని ఆనందపడ్తున్నాను.అపడే త్రివిక్రమ్‌ అటుగా వొచ్చాడు. నా‘బాధ’ని అర్థం చేసుకున్నట్టు - ‘వీరిపేరు మార్కోస్‌. ఏథెన్స్‌ నుండి వొచ్చారు.’ అని పరిచయం చేసాడు. మార్కొస్‌కి నా పేరు వివరాలు చెప్పాను. అంతరించిపోతున్న భాషా సంస్కృతుల మీద త్రివిక్రమ్‌ ముంబయిలో ఓ సదస్సు ఏర్పాటు చేసాడు. వీలుంటే నన్నూ రమ్మన్నాడు.ఇలాంటి సదస్సుల్లో మేధావులు తీర్మానాలు చేస్తారు. ఆ రెండురోజులు హడావిడిగా సాగిపోతుంది. ఆ తరువాత ఎవరి గోల వారిదేలా వుంటుంది. అంచేత, ముందుగా రావాలని అనుకోలేదు. అనుకోకుండా వచ్చాను. రెండు రోజుల కార్యక్రమం ‘అలవాటు’ ప్రకారం హాజరయిన కార్యక్రమం లాగే వుంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగారి ఉపన్యాసంతో సహా అన్నీ షరా మామూలే పద్ధతిలో నడిచాయి.