మే నెల... వేసవికాలం మొదలైంది. పండుటాకులాంటి టోమాస్‌ ఎప్పటిలానే ఇంటి వరండాలో కూర్చున్నాడు. నిజం చెప్పాలంటే గత పదేళ్ళుగా అదేవరస. అతడి దినచర్య చెక్కుచెదరలేదు. కొండవాలులో ఊరి చివర ఉంది టోమాస్‌ ఇల్లు. అతనికి నల్లకుక్క ఒకవైపు, పసుపు రంగు పిల్లి మరోవైపు ఎప్పటిలానే కూర్చున్నాయి. తన చుట్టూ ఉన్న చెట్టూ చేమా లాగానే టోమాస్‌ కూడా కదలకుండా మెదలకుండా రాయిలా కూర్చుండిపోయాడు.రాత్రుళ్ళు పచ్చని పొలాల పైనుంచి వీచే పైరగాలి, సముద్రం మీదనుంచి పైకి తేలి వచ్చే చంద్రుడు, సుదూరంగా కనిపించే కొండల వరుస, వాటిని ఆనుకున్న ఆకుపచ్చని లోయలు చూసినప్పుడు మాత్రం టోమా్‌సకి తన చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తాయి. అతనికి ఎప్పుడూ అంతగా మాట్లాడే అలవాటులేదు. టోమాస్‌ మనుమరాలు జెనా. అతన్ని పడుకోమని చెప్పడానికి వరండాలో కుర్చీ దగ్గరకు వచ్చి కదలకుండా రాయిలా బిగుసుకుపోయిన టోమా్‌సని చూసి చనిపోయాడని భయపడింది. పక్కింటి జియాలెనార్డా సహాయంతో టోమా్‌సని అతికష్టం మీద లేపి ఇంట్లోకి తీసుకువచ్చి నెగడు ముందు పడుకోబెట్టింది జెనా.‘‘తాత శవంలా బిగుసుకుపోయాడు, డాక్టర్‌ని పిలవడం మంచిదేమో అనుకుంటున్నాను జియా లెనార్డా’’ అంది జెనా.

‘‘డాక్టరు ఊళ్ళో లేడు. చెవికి సంబంధించిన వ్యాధుల మీద అధ్యయనానికి రెండు నెలలు సెలవు మీద వెళ్ళాడు. తన పొలాలకి కౌలు చెల్లించమని ఏ కౌలుదారును అడిగినా వినిపించుకోవడం లేదట. అందుకని వ్యాధుల అధ్యయనానికి వెళ్ళాట్ట. ఆ పొలాలన్నీ అతను ఇక్కడివాళ్ళ డబ్బులతో కొనుక్కున్నవేగా. ఆయన స్థానంలో వచ్చిన పట్నం డాక్టరు తనేదో రాజుగారి ఆస్థాన వైద్యుడిని అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. పిలిస్తే ఆయన వస్తాడో రాడో మరి’’.‘‘ఏది ఏమైనా ఆయన రాక తప్పదు లెనార్డా. ఆయన మన ఇంటికి వచ్చి తాతయ్యను చూసినందుకు ఇరవై లైర్‌లు తీసుకుంటాడట’’ అంది జెనా.లెనార్డా డాక్టరు కోసం బయలుదేరింది. కొత్తగా వచ్చిన డాక్టరు అక్కడికి దగ్గరలోనే తోటలో ఉన్న బంగ్లాలో ఉంటాడు. ఊరు మొత్తం మీద అదే మంచి ఇల్లు. దాన్ని ఊరు అనేదానికన్నా చిన్నపట్నం అనొచ్చు. అయినా పెద్దపట్నాల్లో ఉండే అవలక్షణాలన్నీ దానికి కూడా వచ్చాయి. కొద్దిపాటి సౌకర్యాలు, వాటిని మించిన నేరాలు, హంతకులు, వ్యభిచారులు, పేకాట క్లబ్బులు అన్నీ ఉన్నాయి.