నగరంలోని ఒక ఇరానీ హోటల్‌. కామేశం, రాంబాబు, గోపి ఒక మూల టేబుల్‌ దగ్గర కూర్చుని వన్‌ బై త్రీ చాయ్‌ను అపురూపంగా అమృతం సేవిస్తున్నట్లు సేవిస్తున్నారు. ముగ్గురూ నిరుద్యోగులు. కాస్తో కూస్తో చదువుకున్నారు కానీ వీళ్ళ చదువుకు సంతోషించి ఉద్యోగాలిచ్చే తలకుమాసిన వాడెవడూ భూలోకంలో లేడు.‘‘మనం ఇక్కడ సమావేశమైన కారణం?’’ అడిగాడు గోపి.గొంతు సవరించుకున్నాడు కామేశం. ‘‘ఫ్రెండ్స్‌... మీకు బాగా తెలుసు.... ’’ చెప్పనారంభించాడు.‘‘మాకేం తెలియదు. సూటిగా విషయం చెప’’ అన్నాడు రాంబాబు.‘‘అఫ్‌కోర్స్‌... సాధారణంగా ఉపన్యాసాలన్నీ ఇలాగే ప్రారంభమౌతాయి కదా?’’‘‘ఉపన్యాసాలొద్దు. సూటిగా పాయింట్లోకి రా’’‘‘ఓ.కే... ఈనాడు జంటనగరాలలోని సాంస్కృతిక సంస్థలన్నీ వ్యాపారమయమయ్యాయి. డబ్బుతో తెగబలిసిన వారికి, అధికార పదవులలో వున్న వారికి, పైరవీకారులకు అడక్కుండానే సన్మానాలు, సత్కారాలు జరుగుతున్నాయి. నిజమైన కళాకారులను, సాహితీవేత్తలను పట్టించుకునే నాధుడే లేడు. 

దాంతో ఎంతోమంది కవులు, పండితులు, నటులు, గాయకులు లోలోన కుమిలిపోతున్నారు. అంచేత...’’‘‘వారికి సానుభూతిగా మనమూ రోజూ ఓ గంటసేపు కుమిలిపోదామా?’’‘‘ఆమరణ నిరాహారదీక్షలు చేసేవారికి మద్దతుగా రిలే నిరాహారదీక్షలు చేసినట్లు...’’‘‘బీ సీరియస్‌... అటువంటి కళాకారులను ఉద్ధరించడానికి మనం నడుం కట్టాలి’’.‘‘కడితే ఏం లాభం? నడుం నొప్పి రావడం తప్ప?’’‘‘సహనంతో సకల కార్యాలను సాధించవచ్చు. మనకెలాగూ పనీపాటా లేదు. పెద్ద చదువులు లేవు. అందువల్ల మనం దేనికీ పనికిరాము.కనుక మనమో సాహిత్య సంస్థను స్థాపించాలి. గుర్తింపుకు నోచుకోని కళాకారులకు అభినందన సభలు ఏర్పాటు చెయ్యాలి. పెద్దపెద్ద వాళ్ళను వక్తలుగా పిలవాలి. అలా ఐదారు మీటింగులు చేశామంటే మనకో గుర్తింపు వస్తుంది. దాంతోపాటు డబ్బు కూడా వస్తుంది’’.‘‘ఎలా?’’‘‘సన్మానం చేయించుకోవాలని తహతహలాడే వాళ్ళు మనదేశంలో వేలమంది వున్నారు. ఒకడు ఒక సింగిల్‌పేజీ కథ రాయగానే తనకు సన్మానం చెయ్యడానికి ఎవరొస్తారా అని ఎదురు చూస్తుం టాడు. అలాగే ఒకడు చిన్న తేటగీతి రాయగానే తనను నన్నయతో పోల్చుకుంటాడు. సినిమాలో లక్షమంది సిపాయిల్లో ఒకడిగా అరక్షణంలో ఆరోవంతు సేపు తెరమీద కనిపించినవాడు ఐశ్వర్యారాయ్‌ పక్కన హీరోగా వేస్తున్నట్లు ఊహించేసుకుని నంది అవార్డుకోసం నీలుగుతుంటాడు. వీళ్ళే మనకు పెట్టుబడి. ఖర్చులకోసం వారినుంచి డబ్బు గుంజుతాం. కలిసొస్తే టాటా, బిర్లాలంత వారం కావచ్చు. ఏమంటారు?’’ అన్నాడు కామేశం.