తెల్లని పాల వెన్నెల్లాంటి తళతళ మెరిసిపోయే పక్షులు. ఎంత అందంగా ఉన్నాయో... ఇటు రాండి... ఇటు... ఇటు. తన వైపే చూస్తున్నాయి.తలలతో సైగలు కూడా చేస్తున్నాయి. గొంతెత్తి పిలుస్తున్నాయి.వొస్తున్నా... నేనూ వొస్తున్నా. ఎంత ముద్దుమురిపాలు కుమ్మరిస్తున్నాయో...! మురిపించి మైమరిపిస్తున్నాయో! అరెరే దగ్గరగా వొస్తుంటే దూరంగాపోతారేందమ్మా. నన్నూ మీ జట్టులో చేర్చుకోరూ....!అయ్యో ఎగిరి పోతున్నారెందుకు? అయినా... ఆ... ఆ... అందుకుంటాలే. మిమ్మల్ని ఆదు కుంటాగా! అరే... నేనూ గాల్లో తేలుతున్నానే! ఆహా శరీరం తేలికై దూదిపింజలా తేలుతుందే....!ఓ... నాకూ రెక్కలొచ్చేశాయి. నేనూ మీతో వస్తున్నానుగా. ఎంత దూరమని వెళతారు. ఇలా ఎగురుకుంటూ అయ్యో! ఇంత ఎత్తులో ఎంత భయంగా ఉందో!ఈ కొండలూ, గుట్టలూ, మైదానాలూ ఎంత అబ్బుర పరుస్తున్నాయి. ఈ చెట్లేమిటి ఆకాశంతో పోటీ పెట్టుకుంటూ ఎదుగుతున్నాయే! ఆహాహా ఈ వెండి మబ్బుల్లో తేలిపోతుంటే ఎంత హాయిగా చల్లగా తనువు మైమరచి పోతుందో!ఓహ్‌.... ఎంత మనోహరమైన ప్రపంచమిది. సమ్మోహకర ప్రపంచంలోనికి లాక్కుపోతున్నాయే.

 జల పాతాలూ అవి కొండలే కరిగి నేల మీదకు వ్రహిస్తున్నట్టుగా ఉన్నాయే.ఇదేమిటి... ఆ... ఆ... ఇదేమిటి? పడి పోతున్నానే! అయ్యయ్యో జలపాతంలో పడి పోతున్నానే! ఎవరో లాగుతున్నారే! ఎవర్రా నన్ను కిందకు లాగేదీ...?‘‘ఎవరూ? సరోజా నువ్వా? ఎంత కమ్మని కలను చెడగొట్టావ్‌... ప్చ్‌ ... అయ్యో!’’‘‘ఏమిటండీ ఇక్కడ నేను అరిచి గీపెడుతున్నాను. మీకు వినపడడం లేదా!’’‘అబ్బా ఎంత పెద్దగా అరుస్తుందో!ఎవరు పిలిచినా కళ్ళు తెరవగూడదు అనుకుంటా. హఠాత్తుగా విచ్చుకుంటాయి. ఎందుకీ కనురెప్పలు. ఇంకేమైనా ఉందా! నెమ్మదిగా తెరవాలి. నెమ్మదిగా... కళ్ళపై అరిచేతులుంచితే ఎంత వెచ్చగా ఉంది. చీకటి జీవితానికి వెలుతురునిచ్చే తారకల్లా... హా... ఈ జీవితానికివే గవాక్షాలు కదా! ‘‘పిలుస్తుంటే కళ్ళు తెరవరేమిటి’’ కసురుకుంటూంది సరోజ.నువ్వు కసురుకున్నా విసురుకున్నా లాభం లేదమ్మా. చీకటి లోకంలో నుండి వెలుతురు ప్రపంచంలోనికి ప్రయాణించేటప్పుడు నెమ్మదిగా రెప్పలు విప్పార్చుకుని లోకాన్ని చూడాలి. ఇవి గాజుగోళాలు. వీటికేమైనా అయితేనా! హమ్మో ఇంక తట్టుకోగలనా! గుండె వేగంగా కొట్టు కుంటుంది.‘‘ఎన్నిసార్లు పిలవాలి మిమ్మల్ని. రోజూ నాకిదొక తంతుఅయిపోయింది. విసిగించకుండా లేవండి’’ పెద్దగా అరిచింది సరోజ.‘‘ఎందుకంత పెద్దగా అరుస్తావు? నాకేమన్నా చెముడనుకున్నావా!’’‘‘నా మాటంటేనే ఎందుకలా విసుక్కుంటావు. ఇదుగో ఊరికి దూరంగా విసిరేసినట్టుగా తీసుకున్నారే ఇల్లు. ఎన్నిసార్లు చెప్పినా నా మాటేమైనా తలకెక్కుతుందా!’’రోజుకి ఎన్నిసార్లు అంటుందో ఈ మాట. నా మనసు అరల్లో కొచ్చి అణువణువూ తడిమ చూడు ఒక సారి. ఎట్లా చెబితే తెలుస్తుంది నీకు. పుట్టినప్పటి నుంచీ నీకు కళ్ళున్నాయి కాబట్టీ వాటి విలువేమిటో తెలియదు నీకు.