రాత్రి భోజనాల తర్వాత చేయి తుడుచుకొంటూ వీధిలోకి నడిచాను. ఆకాశం నిండా వాన మోడాలు కమ్ముకొని ఉన్నాయి.ఎదురుగా వేపచెట్టు కింద అరుగు నిండా జనాలు కూచుని యవ్వారాలు చేస్తున్నారు.పడమటి గాలుల పోడుకు చెట్లకొమ్మలు అల్లల్లాడుతున్నాయి.మృగశిర దాటి ఆర్ద్ర కార్తె వచ్చింది. సన్న సన్న తుంపర్లు రాలుతూ ముంగిళ్ళు చల్లబడ్డాయి గాని ఒక్క పదును వాన కూడా కురవలేదు. బీళ్ళు పచ్చబడలేదు. ఎండిన గడ్డిపాదులు చిగురించి బర్రెగడ్డికి ఎదగటం మాట అటుంచి గొర్రెగడ్డిగా కూడా మారలేదు.రెండేళ్ళ నుంచి కరువు తాండవిస్తూ ఉంది.

ఈ యేడు సకాలంలో వానలు కురుస్తాయనీ, చెరువులన్నీ నిండి అలుగులెత్తుతాయనీ వాతావరణ శాస్త్రజ్ఞుల నుంచి సిద్ధాంతుల దాకా అందరూ నమ్మకంగా చెబుతున్నారు.నేల దప్పిగొని ఉంది. అంతులేని దాహంతో అలమటిస్తూ ఉంది. ఇప్పుడొక పెద్ద వాన కావాలి. వంకలు వాగులు పొంగి, చెరువులు దొరువులు నిండి, భూగర్భజలాలు పెరిగే వాన.ఆ విషయాలే మాట్లాడుకొంటున్నారు అరుగు మీద కూచున్నవాళ్ళు. పాలెండిన బర్రెల్ని చాలావరకు అమ్మేసుకొన్నారు. అవన్నీ దాదాపుగా కటిక అంగళ్ళకే పోతున్నాయని అందరికీ తెలుసు. అయినా తప్పని పరిస్థితి. ఎవరి కళ్ళల్లో కూడా పిడికెడు ఎండుగడ్డి పోచల్లేవు. గొల్లలు గొర్ల మందల్ని బతికించుకునేందుకు నల్లమల కొండలకు తోలుకెళ్ళారు.ఒకప్పుడు ఇంటికొక కాడి ఉండేది. ఎద్దులగాళ్ళు ఇంట్లో భాగమై ఉండేవి.

‘‘వంద కాండ్లున్న ఊర్లో ఇప్పుడు ఎద్దనేది లేకపాయె...’’ బాధగా అన్నాడు సుబ్బన్న.‘‘వాటిని సాకి సగదీదేదెవుడు? వాటెనక పగులంతా దుక్కిపెల్లల్లో నడిచే మొగోడుండాడా ఇప్పుడు?’’ గురయ్య ప్రశ్న.‘‘అదో... మా ఓబులేసుగాడు ఒక్కడు తప్ప...’’ అంటూ దుబ్బెంగటన్న సవరించాడు. ‘‘ఈ కాలానికి మావోడొక్కడేనబ్బా మొగోడు. కాడెద్దులు బెట్టి సేద్దెం జేస్చాండాడంటే పోతుపాలెగాని కిందే లెక్క...’’‘‘ఎంత పాలెగాడయితే ఏమి- పిల్లనిస్చానని వచ్చే దిక్కే లేకపాయె... తిరిగి తిరిగి కాల్లరిగిపాయె నర్సన్నకయితే...’’ సుబ్బన్న సానుభూతిగా అన్నాడు.‘‘ఆ చింతా తీరిందిలేవోయ్‌ ఈ గురమామ పున్నేన...’’ దుబ్బెంగటన్న అన్నాడు.‘‘ఎట్టా?...’’ లేచి దగ్గరగా వచ్చాడు మేకలోల్ల మునెయ్య.‘‘పెండ్లి కుదిరిన్లే...’’‘‘ఏ ఊరికాడ?’’‘‘మామిల్లపల్లె కాడ...’’ఆ విషయం నాగ్గూడా ఈ రోజు సాయంత్రమే తెలిసింది. నర్సయ్య వచ్చి చెప్పాడు. దసరా ముహూర్తాల్లో పెళ్ళి ఖాయం చేస్తారుట.