రోడ్డు మొగదాలున్న చేన్లోకి దిగీ దిగకముందే అశోకుడి పయి జలదరించింది. తిన్నగ అడుగులేస్తూ ఎప్పటిలాగా వేరుసెనగ పైరు వైపు తేరిపార చూశాడు. పచ్చదనం పావలా భాగం లేదు. ఎండకు మాడిన ఆకులు. అక్కడక్కడ అవి రాలిపోగా మిగిలిన ఒట్టి పుల్లలు. మూడో చోట మరో చెట్టు పెరికి మట్టి విదల్చాక కళ్ళు చెమ్మగిల్లాయి. చెట్టుకు రెండు తప్పితే మూడుకాయలు. అందులో ఒకటీ అరా లొట్టలు. ఐదెకరాల ఖర్చూ, గుత్తా వెరసి పన్నెండు వేల అప అతని గుండెల్లో పిడిబాకులా దిగబడింది.వూడలు దిగి పిందెలు పడినపడు ఆకాశం నంగనాచిలా చిరుజల్లులు చిలకరించింది. అపడే పొలం మీద నీళ్ళు పారింటే ఇప్పటికీ పంటలు కళకళలాడేవి. పంచభూతాలకు, పండించే రైతుకు శత్రుత్వమేమిటి? అనుకుంటూ జమ్మిచెట్టు నీడలో టవలు పరచుకుని కూర్చున్నాడు.‘‘ఒరే అశోకుడూ! జమ్మిచెట్టు చేను మాత్రం అమ్మాకు. తుంగభద్ర నీళ్ళొచ్చాయా అది నీ పాలిట కల్పతరువు అవుతుందిరా’’ చచ్చేనాడు తండ్రి అన్నమాటలు అశోకుని చెవుల్లో గింగురుమన్నాయి. తను పుట్టకముందు నెహ్రూ శిలాఫలకం వేసి పోయాడు. నాలుగు దశాబ్దాలు పైబడినా తుంగభద్ర జలాల పారకం లేదు. డజనుకు మించి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు మారారు. అయినా రాయలసీమకు మహా ఒరిగిందేమిటి? వాళ్ళకుకావాల్సింది ఓట్లు, పదవి, సంపాదన. నీళ్ళుగాదు. ప్రకృతిరీత్యా అదునుకు వానలొచ్చేది అరుదైపోయింది.

 సముద్రం పాలవుతున్న నీళ్ళను రైతుల వైపు తిప్పే నవీన నిస్వార్థ భగీరథుడు రాజకీయాల్లోకి ఎపడొస్తాడో మరి? ఆ లోపల జలయుద్ధాలు జరగకపోవు. నాన్న వెర్రిగాక పోతే కరువు మీద కరువు లొస్తున్న ఈ సీమలో భూములు నిలబెట్టుకోవడం సాధ్యమా? తల విదుల్చుకుని లేచాడు అశోకుడు. ఎవరో ప్యాంటు మనిషి చేన్లోంది చెనక్కాయ చెట్లు పెరుక్కుని పోతున్నాడు. రోడ్డుమీద ఆగిన జీపు అతడు కూర్చున్నాక కదిలింది.‘‘ఎన్నికాయలున్నాయి అశోకా?’’ కింది బజారు పెద్దాయన పసులాస్పత్రి కాడ ఎదురుపడ్డాడు. భూతద్దాల కళ్ళజోడు లోంచి అతని చూపు చెట్లదాకా వచ్చింది.‘‘ఉడ్డాకు లోపే’’ అశోకుడి పెదాలు బలవంతాన విడివడి మళ్ళీ అతుక్కుపోయాయి. కొంపలో పడే దాకా బండ చెవుడు దొందుకుంటే ఎంత బాగుంటుందో అనిపించింది.‘‘జమ్మిచెట్టు చేలో రెండూ మూడా? ఏమి కాలమొచ్చెనాయనా’’ పెద్దాయన చేతికర్ర ముందుకు సాగింది. సకాలంలో వానలు కురిస్తే ఎకరాకు పదారు పదేడు మూటలయ్యే నాలుగు చేన్లలో జమ్మిచెట్టు చేనొకటి. అట్లాంటిది ప్రకృతి పెట్టే పరీక్షలో ఆరేడేళ్ళుగా అట్లర్‌ ఫెయిలవుతోంది. గంగమ్మగుడి మలుపు తిరిగి ముందుకు అడుగేయడానికి అశోకుడికి సిగ్గయింది. చిన్న చిన్న సందుల్ని కలుపు కుంటూ గ్రామపంచాయితీ ఆఫీసు దాటి రెండు పాయలుగా చీలే పొడవైన బజారది. కొత్తగా వచ్చిన కోడళ్ళు తప్ప అంతా చిన్నాన్నా, పెదనాన్నా, మామా, అన్నా అనేంత పరిచితులు. బంధువులున్నారు. సావాసగాళ్ళున్నారు. రైతు తత్వంతో ఏవేవో అడుగుతారు. వాటిలో ఏదో మాట ఎదలో గుచ్చుకోవచ్చు. ఇట్లా పంట పండితే పిల్లదాని పెళ్ళేం చేస్తావన్నా పడాల్సిందే. చాటుగా ఇల్లు చేరే సొరంగమూ లేదు. పీర్ల సావిడి వెనక్కి జారుకుంది. సర్పంచి మేడ కంటికింపైన రంగుతో మెరిసిపోతోంది. తొమ్మిది పది బారల్లో రాముల దేవళం. వేపచెట్టు కింద పులిజూదం చుట్టూ ఏడెనిమిది మందున్నారు.