రామబ్రహ్మం హుషారుగా బయల్దేరాడు హనుమంతయ్య ఫ్లాట్‌కి. తన బర్త్‌డే పార్టీకి రమ్మని ఫోన్‌ చేశాడు. పార్టీ అంటే మందు పార్టీయే. రామబ్రహ్మం సర్వీసులో వున్నపడు మందు పార్టీలకు కొదవ వుండేది కాదు. రిటైర్‌ అయిన తర్వాత పిలిచేవాళ్లే లేరు.హనుమంతయ్య అతని కొలీగ్‌. రిటైరైపోయి ఒంటరిగా వుంటున్నాడు. భార్యపోయింది. పిల్లలు అమెరికాలో సెటిలైపోయారు.రామబ్రహ్మం వెళ్లేసరికి పాత కొలీగ్స్‌ నలుగురూ చేరిపోయారు.‘‘రావోయ్‌ బ్రహ్మం నీ కోసమే ఎదురుచూస్తున్నాం.’’అని ఆహ్వానించాడు హనుమంతయ్య.‘‘అపడే పార్టీ మొదలా? ఇంకా ఎనిమిది గూడా కాలేదు.’’ అంటూ కూర్చున్నాడు రామబ్రహ్మం.పార్టీ మొదలైంది.‘‘బ్రహ్మం! మా పనిమనిషి మరీ ముసలమ్మయిపోయిందోయ్‌. ఎవరైనా అమ్మాయిని చూడు.

\దీన్ని మాన్పించేస్తాను. గ్లాసులు, కపలు పగలగొడుతోంది. కూరల్లో వుప, కారం దంచేస్తోంది. ఏమన్నా అంటే కళ్లు కనపడ్డం లేదు సారూ! అంటుంది. చస్తున్నాననుకో.’’అన్నాడు హనుమంతయ్య.‘‘ఎన్నాళ్లనుంచో పనిచేస్తున్నది కదా! కంటికి శుక్లాలు వచ్చేయేమో? డాక్టర్‌కి చూపించి కళ్లజోడు ఇప్పించు. దివ్యంగా పనిచేస్తుంది. అంతేగాని కుర్రపిల్లల్ని పెట్టుకోకు. ప్రాబ్లమ్స్‌ వస్తాయి’’ అన్నాడు రామబ్రహ్మం.‘‘ఏం ప్రాబ్లమ్స్‌ వస్తాయంటావు? సరిగా పనిచేస్తే వుంటుంది. లేకపోతే పోతుంది’’అన్నాడు హనుమంతయ్య.‘‘మా గురవయ్యకి జరిగింది వింటే నువ్వీమాట అనవు’’ అని నవ్వాడు రామబ్రహ్మం.‘‘ఎవరా గురవయ్య? ఏమాకథ?’’‘‘మా వూరాయనేలే. నీలాగే రిటైరై ఒంటరిగా వుంటున్నాడు’’ అని మొదలుపెట్టాడు రామబ్రహ్మంఒక రోజు పొద్దున్నే గురవయ్య ఫోన్‌ చేసి అర్జెంటుగా రమ్మన్నాడు. 

ఏంటయ్యా కథ? అంటే వచ్చాక చెప్తాను రమ్మన్నాడు. గురవయ్యకి కంగారెక్కువ. ఏ ప్రాబ్లమ్‌ వచ్చిందోనని వెళ్లాను.నేను వెళ్లేసరికి గురవయ్య ఇంట్లో పనిచేసే అహల్య, దాని తల్లి చంద్రమ్మ, ఇంకెవరో యువకుడు వున్నారు. అక్కడ వాతావరణం ఎందుకో గంభీరంగా వుంది. ఆ యువకుడు ఖద్దరు బట్టల్లో దర్పంగా కనిపించాడు. గోల్డ్‌ఫ్రేమ్‌ బ్లాక్‌ కళ్లద్దాలు, చేతులకు వుంగరాలు ముంజేతికి బ్రాస్‌లెట్‌, మెడలో దళసరి చైనూ చూసి ఎవరో ఛోటా రాజకీయ నాయకుడేనని అనిపించింది.అదేమాట చెప్పి గురవయ్య పరిచయం చేశాడు.‘‘యూత్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ లింగారావు.’’‘‘మీ కోసమే ఎదురు చూస్తున్నాం’’ అన్నాడు లింగారావు.‘‘నా కోసమా? ఏమిటి విశేషం?’’ అన్నాను.