మొయినొద్దీన్‌ బాబా బుక్‌స్టాల్‌లో విచారంగా కూచున్నాడు. బస్టాండంతా రద్దీగా వుంది. వచ్చీపోయే బస్సుల శబ్దాలతో రొదగా వుంది. పక్కనే జ్యూస్‌ సెంటర్‌లోని గ్రైండర్ల శబ్దం కంపరమెక్కిస్తోంది. వేలాడదీసిన టీవీల్లోని పాటలు మరింత కంపరమెక్కిస్తున్నాయి.బాబా ఓసారి నిర్లిప్తంగా.. నిర్వి కారంగా టీవి వైపు చూసాడు.ఆ రంగుల డబ్బా.. తన జీవి తాన్నే దెబ్బకొట్టింది. ఇక్కడే కాదు.. తనింట్లో కూడా. తను కిటికీలు, తలుపులూ మూసేసు కున్నా తనిం ట్లో జొరబడి మాటల్నే కరువు జేసింది.తనకి అన్నం పెట్టి వాడలోని ముచ్చట్లన్నీ చెప్పి కొసిరి కొసిరి వడ్డించే భార్య రజియా.. ఇపడు పల్లెం తన ముందరపడేసి ముందు గదిలోకెళ్ళి సీరియల్‌ చూస్తూ కూచుంటుంది.అన్నీ కేబుల్‌ బంధాలై పోయాయి.బాబా ఓసారి తన స్టాల్‌లోని బుక్స్‌వైపు చూసుకున్నాడు. రంగు రంగుల ముఖ చిత్రాలతో వంద లాది పత్రికలతో కళకళలాడే బుక్‌ స్టాల్‌లో ఇపడేమీ లేవు. రెండు వారపత్రికలు.. వేలాడదీసిన నాలుగు దినపత్రికలు.. పది ఇరవై బూతు పుస్తకాలు.. అంతే.ఒకపడు ఉదయం అయిదింటి నించి సాయంత్రం తొమ్మిది దాకా తన స్టాల్‌ ముందు ఇరవై మంది దాకా వుండేవాళ్లు.ఇపడేరి? ఒక్కరైనా తన బుక్‌స్టాల్‌ గురించి అడగరే?జిరాఫీల్లా మెడలు సాగదీసి కళ్ళని పెకిలించి టివి స్ర్కీన్‌కి అతికించి ప్రతి రంగుల డబ్బా ముందు ఇరవై ముప్పయి మంది లీనమై .. ధ్యానమై..మొయినొద్దీన్‌ బాబా కళ్ళని కన్నీటి తెరలు కప్పేసాయి.

ఇరవై అయిదేళ్ళ కింద చిన్న టేలాతో మొదలైన బుక్‌స్టాల్‌ క్రమ క్రమంగా ఎదిగి కళకళలాడేది. వసీమా పెళ్ళి చేసినపడు ఎంత సంపాదన?బిడ్డ పెళ్ళికి ఎంతో మంది అధికార్లు, కవులు, రచయితలు, పాఠకులు వచ్చారు అభిమానంతో. ఇపడు వాళ్ళంతా ఏరి? ఎక్కడా కన్పించరే? అంతా ఒక్కసారే మాయమైనట్టు ఎవరూ కన్పించరే..అదుగో..జనం ఉరుకులు.. పరుగులు.. దేనికోసం? ప్రపంచ విజ్ఞానమంతా పుస్తకాల్లో వుందంటారే.. మరి ఒక్కరూ బుక్‌స్టాల్‌ వైపు రారేం?‘ఒక్క అక్షరం ముక్క లక్ష మెదళ్ళకు కదలిక’ అని తను ఇష్టంతో రాసిపెట్టిన బోర్డు చిలుం పట్టిపోతోంది. తన పట్ల ఆప్యాయంగా చూసేవాళ్ళంతా కనీసం పట్టించుకోవట్లేదు.తన బుక్‌షాప్‌ తనకే పరాయిదైపోతోంది.మొయినొద్దీన్‌ బాబాకి గుండె బరువెక్కింది. గతం కాగితంలా రెపరెపలాడింది.వయసు మీద పడుతుంటే బుక్‌స్టాల్‌ చూసు కొమ్మని పెద్ద కొడుక్కి చెప్పినపడు వేలకు వేలు డిపాజిట్లు కట్టి.. గొర్రె తోకంత కమీషన్‌ కోసం పద్దెని మిది గంటలు శవం ముందు కాపలా కాసినట్లు ఆ టేలాలో కూచోవాలా? నావల్ల కాదు. నేను పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసింది బాగా బతకడానికి.. అని నిష్కర్షగా చెప్పాడు.