మంచి సంబంధం. కట్నాల ఊసు లేదు. పిల్ల నచ్చింది.రెండ్రోజుల్లో మళ్ళీ మూఢాలు వస్తాయి. కనుక, రేపే తాంబూలాలు మార్చుకుందాం అని వియ్యాల వారి నుంచి ఫోను.ఆ యింట్లో అందరూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బియి పోయేరు. ‘మా సునంద అదృష్టవంతు రాలు’ తల్లి సరస్వతమ్మ యీ మాట అప్పటికి ఏ వందోసారో అనడం జరిగింది. కూతురి అదృష్టానికి నారాయణ కూడా ఎంతగానో పొంగిపోయేరు. వియ్యంకుల వారినుంచి ఫోన్‌ వచ్చి నప్పటి నుంచి, ఆ దంపతులకి కాలు ఒక చోట నిలవడం లేదు. చుట్టపక్కాలకి ఉదయం నుంచి ఫోన్లు చేస్తూ ఆ శుభవార్త అందజేస్తూనే ఉన్నారు. ఇరుగు పొరుగులకీ, ఊళ్ళో స్నేహితులకి ఆ వార్త చేరవేసారు. మరోపక్క తాంబూలాలు యిచ్చుకుందుకి అట్టే వ్యవధిలేక పోవడంతో వాళ్ళకి క్షణక్షణానికీ కంగారు పెరిగిపోతోంది. పీకల మీదకి యీ మూఢాలొకటి వచ్చి పడుతున్నాయి. ఏం చెయ్యాలో తోచడం లేదు. ఓ పక్క వియ్యాలవారు మూఢాలు రాకుండానే తాంబూలాలు తీసుకుందామని తొందరపెడుతూ ఉంటే, వ్యవధి కావాలని అడిగే సాహసం ఆ దంపతులకి లేక పోయింది.ఈ సంబంధానికి సునంద తన సుముఖత ముందే తెలియజేసింది. అయితే, యింత అవ్యవ ధానంగా నిశ్చయ తాంబూలాలు తీసుకోవడం ఆమెకి నచ్చడంలేదు. ‘మరోసారి వాళ్ళతో మాట్లాడ రాదూ, నాన్నా’ అంది. కూతురి మాటలతో మళ్ళీ వియ్యంకుడికి ఆ విషయమై ఫోన్‌ చేశారు నారాయణ.

‘‘అబ్బే, అనుకున్నాక మరి ఆలస్యం ఎందుకు బావగారు! మూఢాలు రాకుండానే ఆ తంతు జరి పించేద్దాం... మాట్లాడుకోడానికి మరేం లేదు కదా? అదీకాక, మా వాడికి అట్టే సెలవు కూడా లేదు. తాంబూలాల కార్యక్రమం చాలా సింపుల్‌గా జరిపించేద్దాం... కాదనకండి....’’ అని జవాబొచ్చింది.మరి చేసేదేముంది కనక? హడావిడిగా పనులకి సిద్ధమయ్యారు నారాయణ దంపతులు.కట్నం ప్రసక్తిలేని సంబంధం వొచ్చినందుకు సునంద ఎంతగానో సంతోషించింది. అమ్మాయి ఉద్యోగం చేసి సంపాదిస్తున్నా కట్నం పేరిట వేధించే వ్యక్తులున్న యీరోజుల్లో కట్నం ఊసెత్తని వారి సంస్కారానికి పొంగిపోయింది. ఆ రోజంతా హడావిడిగా షాపింగ్‌ పూర్తిచేసి, బట్టలూ, స్వీట్లూ అవీ కొని మర్నాడు నిర్వహించబోయే కార్యక్రమానికి బిజీబిజీ అయిపోయేరు నారాయణ దంపతులు. వియ్యాల వారిదీ అదే ఊరు కావడం చేత, కొంత నయం. ప్రయాణ హడావిడి లేదు. దగ్గరి వాళ్ళకి ఫోన్లు చేసి కార్యక్రమానికి ఆహ్వనించేరు.మర్నాడు నిశ్చయ తాంబూలాల కార్యక్రమం నిరాడంబరంగానే అయినా, ఎంతో ఉల్లాసంగా జరిగింది. కొద్దిపాటి మంది బంధువులూ, స్నేహితులూ హాజరై దీవించేరు. ఫొటోలూ, వీడియోలు షరా మామూలే.