మోహన్‌రెడ్డి యింతకు వడిగట్తాడు అనుకోలేదు - అనుకున్నాడు సాదు శంకర్‌ నారాయణ.తాను ఎంత బిసి అయితే మాత్రం అంత బలహీనంగా వున్నానా!? అతని చొరవ ఏం బాగులేదు! ఇంటికొచ్చిన మనిషి కదా అని వూరుకున్నానే కానీ, అదే వేరే తావునైతే అతని తల తిరిగిపోయేట్లు మాట్లాడేవాణ్ణి.. ఇలా ఆలోచిస్తుండటంతో శంకర్‌కి నిద్రపట్టిందికాదు. జరిగిందంతా గుర్తుకు రాసాగింది.్‌్‌్‌లెక్చరర్‌గా రిటైర్‌ అయిన దగ్గర్నుంచి శంకర్‌కు పనులెక్కువైనాయి. పనివుండే వానికి ఒకటేపని- పనిలేనివానికి అన్నీ పనులే అన్నట్లయ్యింది అతని పరిస్థితి.రెండు దినపత్రికల్లో రెండు శీర్షికలు రెండేళ్ళుగా ఎత్తిన కలం దించకుండా రాస్తున్నాడు. వారపత్రికలు, మాసపత్రికలు ఏవి తిరగేసినా సాదుశంకర్‌ రాసిన కథలే! బిసిల జీవితాలలోని ఎన్నోకోణాల్ని వెలికితీసి అక్షరబద్ధం చేస్తున్నాడు.పాఠకుల ఉత్తరాలు, విమర్శకుల ప్రశంసలు ముమ్మరంగా రాబట్టాయి. అడపాదడపా ఎలక్ర్టానిక్‌ మీడియాలో చర్చాగోష్టుల్లో పాల్గొంటున్నాడు. ఒక రచయితగా, ఒక విద్యావేత్తగా, ఒక మేధావిగా, బిసిల ఆత్మబంధువుగా నాలుగేళ్లకే పేరు తెచ్చుకున్నాడు.ఉన్న ఒక బిడ్డ కళావతిని లెక్చరర్‌కిచ్చి వున్నంతలో బాగానే పెండ్లి చేసి పంపాడు. 

ఎంబిఏ చదివి - రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తానన్న ఒక్కగానొక్క కొడుకు సాకేత్‌ని తన రిటైర్మెంట్‌ ద్వారా వచ్చిన ఏడు లక్షలు యిచ్చి ప్రోత్సహించాడు.ఈ నాలుగేళ్లలో సాకేత్‌ హైదరాబాద్‌ సిటీలో.. పదిమందిని మింగిన అనకొండలా ఎదిగినాడు. సర్వ ఆశ్రయ్‌ రియల్‌ ఎస్టేట్స్‌ సంస్థ పెట్టి బలంగా పుంజుకుంటున్నాడు.కావాల్సినంత వీలు వ్యవధి చేతిలో వుండటంతో శంకర్‌ చెలరేగి రచనలు చేసేస్తున్నాడు. బిసిల సమస్యలపై రాసిన వ్యాసాలను రెండుపుస్తకాలు.. బిసీల జీవితస్థితి గతులను గురించి రాసిన కథలు రెండు పుస్తకాలుగా ముద్రించి ఆవిష్కరణ సభ కడప కళాక్షేత్రంలో భారీగా పెట్టాడు.ఆవిష్కరణ సభకు రాష్ట్రం నలుదిక్కుల నుంచి రచయితలు, విమర్శకులు రావడమే కాక - ఒక ఎస్‌సి, ఒక బిసి మినిస్టర్లు యిద్దరూ వచ్చారు. బిసి సంఘాల నాయకులూ హాజరైనారు.సాహిత్యసభకు కులసంఘాల నాయకులు, అధికార పార్టీ మంత్రులు రావడంతో కొందరు రచయితలు- శంకర్‌ కొంపదీసి ఎమ్మెల్యేగా పోటీచేస్తాడో ఏమో అని అనుకున్నారు. కొందరైతే చనువు కొద్ది పైకి అడిగేశారు కూడా.సరిగా అపడు రాజకీయ బీజం శంకర్‌ మనసులో బిసి సంఘాల నాయకులు కొందరు వేశారు. ఎమ్మెల్యేగా కాదు కానీ ఎమ్మెల్సీగా ఎందుకు నిలబడకూడదన్నారు.మొహమాటంకొద్ది ముందు తనకా వుద్దేశం లేదన్నాడు. తీరా ఎమ్మెల్సీల నోటిఫికేషన్‌ విడుదల అయ్యాక మెదడులో పురుగు తొలవడం మొదలైంది.గ్రాడ్యుయేట్‌ కాన్‌స్టిట్యుయెన్సీ నించి పోటీ చేస్తే సరి. అంతా చదువుకున్నోళ్ళే ఓటర్లు. వున్నకాడికి చైతన్యస్థాయి వుంటుంది వాళ్లకు. పైగా- ఏ పార్టీ అభ్యర్థిగా తాను నిలిచేది లేదు. ఫలానా పార్టీ అభ్యర్థిని అని రంగువేయడానికి సాధ్యంకాదు.