శ్రీహరి అంత పనిచేశాడా? ‘‘అన్నాడు వెంకట్‌ ముక్కుమీద వేలు వేసుకుంటూ’’ ఆడపిల్ల కనిపిస్తే తలవంచుకు నడిచే వీడింతకి తెగించాడా?’’‘‘అయినా రంభలాంటి పెళ్ళాన్ని యింట్లో పెట్టుకుని వీడికిదేం బుద్ధి’’ అన్నాడు రాజారావు కోపంగా.‘‘నిజంగానా?’’ నమ్మలేక పోతున్నాను.‘‘ఈ రాముడు మంచి బాలుడు ఇంతకి దిగజారాడా?’’ అన్నాడు ఆచారి.‘‘నిప్పులేనిదే పొగరాదు’’ అన్నాడు వెంకట్‌ తనకు అందిన వార్తను సమర్థించుకుంటూ.ఇప్పుడు ఆఫీసులో అందరూ చర్చించుకునే వార్త ఇదే! నిప్పుఎక్కడ బయలుదేరింది? ఏ మౌలికప్రేరణ, విజృంభించి జ్వలించి ఎవర్ని చలింపచేసేంది. అసలు జరిగిందేమిటి?శ్రీహరికి పెళ్లయి రెండేళ్లయింది. అతని భార్య అన్నపూర్ణ. బంగారు ఛాయతో మిసమిసలాడుతూ ఉంటుంది. ఆ ఛాయమీద ఏ చీరకట్టినా, ఏ నగపెట్టినా ఆమె కళకళలాడుతూ అందరినీ ఆకర్షిస్తుంది. 

ఇంతటి శిల్ప సుందరి భార్యగా దొరికినందుకు శ్రీహరి మురిసిపోయాడు. పైగా ఆమెది కాన్వెంట్‌ చదువు. ఎం.ఏ. పాసయింది. వాళ్ల నాన్న పెద్ద ఆఫీసరు. సంపన్నుడు. వాళ్లింట్లో అంతా స్టైలుగా ఉంటారు. శ్రీహరి ఓ సామాన్య మధ్యతరగతి లెక్చరరు గారబ్బాయి. ఎలాగో బ్యాంక్‌ ఉద్యోగం వచ్చింది. కుర్రాడు మంచివాడు. అందమైనవాడు, అమ్మాయిని బాగా చూసుకుంటే చాలని శ్రీహరి మామగారు ఇతడిని అల్లుడిగా చేసుకున్నారు.నిజానికి అన్నపూర్ణకు రంగులో ఉన్న ప్రత్యేకత రూపంలో లేదు. సన్నగా, పట్టుదలగా, గీత గీసినట్లున్న పెదిమలు, సన్నని సూటిముక్కు, బిగుతుగా శరీరాన్ని పట్టినట్లున్న చర్మం, మగవాడిని అంత మురిపించే ఒంపులూ, సొంపులూ లేని శరీరం అయినా ఆమె ఎక్కడకు వెళ్లినా అందరూ తెల్లబోయి చూసేవారు. ఏమిటీ మెరుపు! అని శ్రీహరి ఆమెతో వెళుతుంటే గర్వంగా ఫీలయ్యేవాడు.కాని త్వరలోనే ఆమె ప్రవర్తన శ్రీహరిని నిరుత్సాహానికి గురిచేసింది. ఆమెది అంతా అఫీషియల్‌, స్టైలిష్‌, పాలిష్డ్‌ ప్రవర్తన. ఆమె దృష్టిలో శ్రీహరి మధ్యతరగతి మేనర్స్‌ తెలియని మూర్ఖుడు! వాళ్లిద్దరి మధ్యా దూరాన్ని ఆమె గుర్తు చేసినప్పుడల్లా శ్రీహరి ఆత్మన్యూనతా భావంతో కృంగి పోతుంటాడు.ఆమెది అంతా అతి నాగరికత కుటుంబం. ఏ ఉద్రేకాన్ని అతిగా ప్రదర్శించకూడదు.

తిన్నా, తుమ్మినా, దగ్గినా, ఆఖరుకు నవ్వినా నాజూకుగా, నాగరికంగా పక్కవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి. పొరపాటున ఒకరికొకరు తగిలితే ‘సారీ’ అనాలి. ఏది కావలిసినా, ముందుగా ‘ఎక్స్‌క్యూజ్‌మి’ అంటూ అడగాలి. ఈ అలవాట్లన్నీ మంచివే అయినా శ్రీహరికి పాటించడం కష్టంగా ఉంది. అందుకే ఆమె ఇతణ్ణి మరీ మరీ హేళన చేస్తుంది. శ్రీహరి మరీ దిగాలు పడిపోతాడు. ఇవన్నీ ఎలాగో సర్దుకుపోవచ్చు కాని ఈమె గారికి సరసంలోనూ అన్నీహద్దులే, నియమాలే!!అంత ఆశగా, మోటుగా మీద పడొద్దని మెదటి రాత్రే మందలించింది. అప్పటినుంచి ఆమె శ్రీహరికి క్లాసు పీకుతూనే ఉంది. శ్రీహరి సాధ్య మైనంతవరకు, తన చిలిపి కోరికలనూ, సరదాలను అణచుకుంటేనే ఉన్నాడు. ఎప్పుడైనా, సరసం ముంచుకొచ్చి శ్రీహరి ఆమెను వెనక నుంచి వచ్చి గట్టిగా కౌగలించుకుంటే ఆమె ప్రాణం పోయినట్టు కెవ్వున అరచి, కౌగిలి విడిపించుకుని ‘‘ఏమిటి శ్రీహరి, మరీ ఇంత మోటు సరసం’’ అంటూ చీదరించుకుంటుంది. శ్రీహరి సారీ మీద సారీ చెప్పుకుని, ఎలాగో ప్రేమగా, గోముగా, పడక గదిదాకా తీసుకువస్తే, ఆమె విషయం పసికట్టి, ‘‘ఛీ, ఇప్పుడా, శృంగారం, పగలు పదింటికా? రాత్రి చూద్దాం లే!’’ అని నోరు మూయిస్తున్నది. ఎకనామిక్స్‌ మీద వ్యాసం వ్రాసుకునేందుకు గదిలోకి వెళ్లిపోతుంది.