ఆఫీసరు గారు మంచి కాకమీద వున్నారు!ఎదురుపడిన వాడినల్లా చెరిగి పారేస్తున్నాడు! చెలరేగిపోతున్నారు! నిన్న ఆయన గారికి ఓ భజన సంఘం వాళ్ళు చేసిన సన్మాన కార్యక్రమానికి స్టాఫ్‌ ఒక్కరు కూడా హాజరుకాకపోవడం ఆయనకు అవమానకరంగానూ, కోపంగానూ వుంది. ఆ వేడిలోనే రోజూకన్నా ఓ గంటముందు ఆఫీసుకు వచ్చి తెగ రెచ్చిపోతున్నాడు.ఆదివారంపూట ఆ భజన మనకెందుకని అంతా బద్ధకించేశారు.

అదే యిపడు ఆఫీసరు గారి కోపానికి అసలు కారణం అన్న విషయం స్టాఫ్‌ అందరికీ అర్ధమయిపోయింది. ‘అదేమీ అఫీషియల్‌ ప్రోగ్రాం కాదు గదా!? భజన సంఘం వాళ్ళ పిలుపు తప్ప తానుగా మనకేం చెప్పలేదు గదా? మరి అటువంటపడు ఈ ఉరుములు - మెరుపులు దేనికో’ అంటూ కాసేపు చెవులు కొరుక్కుని ఎవరి సీటుకు వాళ్ళు అతుక్కుపోయి బిక్కుబిక్కుమంటూ ప్రాణా లు అరచేతిలో పెట్టుకుని బుద్ధిగా పనిచేస్తున్నట్లుగా నటించేస్తున్నారు.సీనియర్‌ క్లర్కు గుర్నాథం యథాతథంగా భుజాన సంచి వేలాడేసుకుని వక్కపొడి నములుకుంటూ ఆలస్యంగా ఆఫీసులోకి అడుగుపెట్టాడు. అటెండెన్స్‌ రిజిస్టరు అప్పటికే ఆఫీసరు గారి టేబులు మీదికి చేరిపోయిన సంగతి చెవిన వేశారు. గుర్నాధం ఏమాత్రం తొట్రుబాటు లేకుండా సరాసరి ఆఫీసరు గారి గదిలోకి ప్రవేశించాడు.‘అయిపోయింది గుర్నాథం పని!’ అనుకున్నారంతా. గుర్నాథానికి తాను సీనియర్‌ననీ, తనను యింతవరకూ ఏ ఆఫీసరూ పల్లెత్తుమాట అనలేదనీ, తాను చెప్పినట్లు విన్నారనీ స్టాఫ్‌ దగ్గర గొప్పలు పోతూ వుంటాడు.‘ఈరోజు గురుడు పూర్తిగా దొరికిపోయాడు!’‘తల వాచిపోతుంది!’‘ఈ దెబ్బతో అయ్యగారి మిడిసిపాటు వదిలిపోతుంది!’యిలా రకరకాల కామెంట్స్‌ చేసుకుంటున్నారు బయట సిబ్బంది.

ఆఫీసరుగారి గదిలోకి గుర్నాథం వెళ్ళిన తరువాత బయట వాళ్ళకు అరుపులు, కేకలు వినిపించాయి.‘పాపం! గుర్నాథం బలయిపోయాడు!’ అనుకున్నారు స్టాఫ్‌. ఆ తరువాత నిశ్శబ్దం!‘బక్కప్రాణికి ఏమయ్యిందో!’‘బహుశా గుర్నాధం ఫెయింట్‌ అయిపోయి వుంటాడు’ అనుకున్నారంతా.ఓ పావుగంట తరువాత తాపీగా నవ్వుకుంటూ బయటకు వచ్చిన గుర్నాథాన్ని చూసి అవాక్కయ్యారు!‘గుర్నాథానికి మతి చలించలేదుగదా!?’‘ఏమయ్యిందో? ఏమిటో?’ అన్న ఆత్రంతో చుట్టుముట్టి -‘‘ఏమైంది?’’ ‘‘ఏమన్నాడు?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.గుర్నాథం చిద్విలాసంగా నవ్వుతూ ‘‘సిగరెట్‌’’ అన్నాడు.