‘‘వెన్నెల వలస... పేరు బాగుంది. ఆ పేరు వింటుంటేనే కుండపోతగా కురుస్తున్న పున్నమి వెన్నెల్లో తలారా స్నానిస్తున్న ఫీలింగ్‌.పేరులాగానే ఊరు కూడా అంతే అందంగా ఉంటుందా.... వెళ్ళి చూస్తేగానీ విషయం తెలీదు....’’వెన్నెలవలస ట్రాన్స్‌ఫరైందని తెలీగానే రాజులో కలిగిన భావ సంచలనం అది.అయిదు నిముషాల క్రితమే బదిలీ ఉత్తర్వులు అందుకున్నాడతను.‘‘ఏమోయ్‌, రాజూ! నిన్నెక్కడికి విసిరేసారు?’’ అడిగాడు అవధాని పలకరింపుగా నవ్వుతూ.ఆయన చేతుల్లోనూ బదిలీ ఉత్తర్వులు ఉన్నాయి.అవధానిని చూడగానే రాజుకి కాబూలీ వాలాయే గుర్తొస్తాడు.తీసుకున్న అప్పు తీర్చలేని పరిస్థితిలో కాబూలీ కళ్ల పడకుండా ఉంటేచాలని ఓ బడుగు జీవి ఎలా అనుకుంటాడో... సరిగ్గా అవధాని కళ్లపడకుండా ఉండాలని రాజు కోరుకుంటాడు. అయితే,అది కుదరని పనే.ఎందుకంటే.... రాజు, అవధాని రెండేళ్లుగా ఒకేకప్పు కింద... ఒకే పాఠశాలలో పనిచేస్తున్నారు.దాంతో, ఎవరి క్లాసు రూంలో వాళ్లు పాఠాలు చెప్పుకునే సమయాల్లో తప్ప, కారిడార్‌ లోనో.. స్టాఫ్‌ రూంలోనో... లాంగ్‌ బెల్‌ కొట్టిన తర్వాత హడావుడిగా ఇళ్లకెళ్లే టైంలో స్కూల్లో గేట్‌ దగ్గర... ప్రతి రోజూ ఒకరికొకరు ఎదురుపడక తప్పేది కాదు.రాజుకి ఇష్టం లేకున్నా పలకరించక తప్పేది కాదు. అవధాని చిర్నవ్వు విసిరితే గ్రహచారం కొద్దీ... అచ్చం ఆయనలాగే ఆయన రెండో కూతురు సుష్మే రాజు కళ్లకు కనిపించేది. నున్నగా రాగిచెంబులా మెరిసిపోయే బట్టతల మీద అక్కడక్కడా రెండంటే రెండే వెంట్రుకలు గాలికి ఎగిరెగిరి పడుతుంటే అయోమయంగా అతనివేపే చూసేవాడు రాజు.నుదురంతా పాకే కుంకుమ బొట్టు అవధాని స్పెషాలిటీ.తెల్ల పంచెకట్టు, లాల్చీ- ఆయన ఆహార్యం.రాజు కనిపించగానే ఎక్కడలేని అభిమానం కురిపించేస్తూ... అమాంతం ఎగిరి గంతేసి మరీ బిగియారా కావలించుకోవడం ఆయనదైన స్టయిల్‌.

అష్టావధానంలో అప్రస్తుత ప్రసంగంలా అవధాని చీటికి మాటికీ తన రెండో కూతురు సుష్మ ప్రస్తావన తీసుకొస్తుంటాడు.అది రాజుకు అసలు నచ్చదు. కూతురి అందం గురించి తెగపొగుడుతూ... పోటీలో పార్టిసిపేట్‌ చేస్తే ఈ యేటి మిస్‌ యూనివర్స్‌ సుష్మేనని తెగ బిల్డప్‌ ఇచ్చేస్తుంటాడు. ఆమె ముందు నీలికళ్ల ఐశ్వర్య బచ్చన్‌, అందాల సుస్మితాసేన్‌, యుక్తాముఖి, డయానా హెడెన్‌... లాటి అందెగత్తెలెవరూ సాటి రారని మహా గొప్పలు పోతుంటాడు. అంతేకాదు... పెళ్లి చూపుల పేరుతో ఒక్కసారంటే ఒక్కసారి తన కూతురు సుష్మను చూసేందుకు రావాల్సిందిగా అవధాని రాజుని వత్తిడి చేసేవాడు.‘‘అంతగా పిలుస్తున్నాడు కదా... పోనీ, పాపం ఓ సారి సుష్మను చూసోద్దామను’’కున్న కోరిక రాజులో ఒకవేళ తలెత్తినా... ఆ ఊహని మొగ్గలోనే తుంచేలా తెలివి తక్కువగా అవధాని ప్రవర్తించేవాడు.అమ్మాయి పోలికలు చెబుతూ, అచ్చం తన పోలికే అనేవాడు. ఆ మాట వినగానే మండుకొచ్చేది రాజుకి. ఎక్కడో కాలేది. చిన్నప్పుడు తిన్న ఉగ్గునుంచీ.. ఎపుడూ తాగని పెగ్గు వరకూ తన్నుకొచ్చేలా వాంతి కాలిగేది. దాంతో, అవధానిని చూసినపుడల్లా ఒక్కసారి కూడా చూడనైనా చూడని ఆయన రెండో కూతురు కనిపించి నవ్వొచ్చేది. అయితే, రాజు వాలకం గమనించని అవధాని తన కూతురుని అదేపనిగా పొగుడుతూ మైమరిచిపోయేవాడు. అంతటితో ఆగకుండా... ఆడపిల్లకు తండ్రి పోలికొస్తే అంతకుమించిన అదృష్టం మరోటి లేదంటూ అడ్డమైన రీజనింగ్స్‌ ఇచ్చేవాడు. వెంటనే, రాజు ఊహలో అవధాని పంచెకట్టు క్షణాల్లో మటుమాయమై చీరకట్టు కనికట్టు చేసేది.