ఇంటిముందు రేకులషెడ్డులో దోస్తులతో కలిసి పులిజూదం ఆడుతున్నాడు బాబు. ఇంతకు ముందు ఇంటిముందు కొబ్బరిచెట్లు ఇంటెనక మామిడి, నిమ్మ, బత్తాయి, ఇంటిచుట్టూ మల్లె, గులాబి, చామంతి, నందివర్థనం లాంటి పూలతో ప్రతి ఇల్లు కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు కనీసం పిట్ట కూడా కానరావడం లేదు. కొత్త రాజధాని కట్టడం కోసం ఆ ఏరియా మొత్తాన్ని గుత్తకు తీసుకుని బుల్డోజర్లతో చదును చేసి పారేశారు.పంట పొలాలు, పాడి పశువులు పోగొట్టుకున్న జనం అక్కడక్కడ రేకుల షెడ్డు వేసుకుని కాలక్షేపం కోసం బచ్చాలాటలు, గోళీలాటలు, గెచ్చం కాయలు, పులిజూదం ఆడుకుంటున్నారు.ఆట మంచి జోరు మీదుంది. బాబు మేక పులికి చిక్కేలా ఉంది.‘‘రేయ్‌! టైగర్‌బామ్‌ పట్రా!’’ ఛాతిమీద రుద్దుకుంటూ పక్కన కూర్చుని ఆట చూస్తున్న అవతారంతో చెప్పాడు బాబు.‘‘గురూ! మనం మేక పార్టీ. ఇప్పుడు టైగర్‌ అవసరమా?’’ డౌటుగా బాబు వంక చూశాడు అవతారం.‘‘సెటైర్లొద్దు. చెప్పింది చెయ్‌’’ కసిరాడు బాబు.పక్కనేఉన్న కొట్లోంచి టైగర్‌బామ్‌ తెచ్చిఇచ్చాడు అవతారం. మందు రాసుకుంటూ ఇంకో రెండు ఎత్తులేశాడు బాబు.మిగిలిన ఆటగాళ్లంతా ఆటలో మునిగిపోయారు. కొంతమంది పిల్లలు దూరంగా గాలిపటాలు ఎగరేసు కుంటున్నారు. పావుగంట గడిచింది.

‘నొప్పి తగ్గలేదురా! ఇది డూప్లికేటు సరుకేమో? అవతారం వంక చూస్తూ అన్నాడు బాబు.కొంతసేపటికి చక్కెర కలిపిన నీళ్ళగ్లాసు తీసుకొచ్చి ‘‘ఇది ట్రై చెయ్‌ గురూ!’’ అంటూ బాబు చేతికిచ్చాడు అవతారం.ఆట ఇంకో రెండెత్తులు ముందుకు సాగింది.బయట ఎండ చిటపటలాడుతోంది.‘‘ఈ ఏడాది ఎండాకాలం ముందే వచ్చేసినట్టుంది’’ చేతి గుడ్డతో చెమటలు తుడుచుకుంటూ అన్నారు వాళ్ళలో ఒకరు.‘‘షుగర్‌వాటర్‌ పనిచేసినట్టు లేదురా’’ అన్నాడు ఛాతిమీద రుద్దుకుంటూ బాబు.‘‘షుగరూ డూప్లికేటేనంటావా?!’’ నవ్వుతూ అన్నాడు అవతారం.‘‘వెటకారమా? ఈడ కొరివికారంలా మండిపోతుంటే.’’‘‘ఆకలినొప్పేమో గురూ! ఆంజనేయస్వామి దీక్షలో ఉండి ఉపాసాలు చేస్తున్నావుగా. పోనీ మస్తాన్‌ మిలిట్రీ హోటల్‌ నుంచి మటన్‌ బిర్యానీ తేనా?’’‘‘ఏదో తేడాగా ఉందిరా’’ రుద్దుకుంటూ చెప్పాడు బాబు. అవతారం కూడా కొంచెం సేపు ఛాతిమీద రుద్దాడు.‘‘టైగర్‌బామ్‌ రాసినా, చక్కెరనీళ్ళు తాగినా తగ్గలేదంటే - గుండె నొప్పేమోరా?!’’ అన్నాడు బాబు.