సోమయాజులు గారి కళ్ళల్లో ఎర్ర జీరలు విద్యుల్లతల్లా పాకుతున్నాయి.దవడలు అదురుతున్నాయి.కణతల మీద నరాలు ఉబ్బుతున్నాయి.కొడుకు శ్రీనాథ్‌ పడుకున్న మంచం దగ్గరే నిలబడి వాడి ముఖంలోకే చూస్తున్నారాయన.మంచం మీద కొడుకు పక్కనే కూర్చుని వాడి బుగ్గ మీద అరంగుళం ఎత్తున తేలి చిట్లిన వాతలకి వెన్న పట్టిస్తూ కళ్ళ నీళ్ళని కను రెప్పల చాటున కుక్కుకుంటోంది ఆయన భార్య కాత్యాయని.తండ్రి కళ్ళల్లోకి భయం భయంగా చూస్తూ ‘‘నేను...నేను...నేనేం తప్పు చెయ్యలేదు నాన్న గారు...’’ అన్నాడు శ్రీనాథ్‌ లోపల్నుంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని, భయాన్ని అణుచుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తూ...వెక్కుతూ.ఉబికి వస్తున్న కొడుకు కన్నీటి ధారల్ని తన చీర కొంగుతో అద్దుతూ, ‘‘ఏమండీ! వాడ్ని కొట్టింది ఇన్సెపెక్టర్‌ ఖాన్‌ట. ఖాన్‌ ఒకప్పుడు మీ స్టూడెంట్‌ కావొచ్చు...’’విసురుగా తలతిప్పి ఆమె ముఖంలోకి గుచ్చి గుచ్చి చూసారు సోమయాజులుగారు.ఆయన చూపుకి ఆవిడ బెదిరింది.

తన ఉద్దేశ్యం గబగబ చెప్పడానికి ఆత్రపడుతూ, ‘‘ఏం లేదు. మీరు ఆవేశంలో తొందరపడి, ఖాన్‌ని ఏమీ అనకండి. అతను చాలా మంచివాడని మనకు తెలుసుకదా...ఎందుకలా కొట్టాల్సి వచ్చిందో కారణం తెలుసుకోకుండా మనం తొందరపడితే...’’ మాటలు నమిలింది.ఆయన ముఖం ప్రసన్నమయ్యింది. భార్య ముఖంలోకి అభినందనగా చూసి, ఆమె తల మీద చెయ్యి వేసి అభయంగా నిమిరి, కొడుకును చూసుకోమన్నట్లుగా చేతి సంజ్ఞతో నిర్దేశించి వరండా లోకి నడిచి, పడక్కుర్చీలో వాలి, కళ్ళు మూసుకున్నాడు...ఖాన్‌ తన కొడుకును ఎందుకు కొట్టినట్లు?!తన కొడుకు ఏదైనా తప్పు పని చేస్తూ అతని దృష్టిలో పడ్డాడా? వీడు అలాంటి వాడు కాదే?! గతంలో ఎప్పుడో అతన్ని తను దండించిన దానికి ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడా?! అతను అలాంటి వాడు కాదే?!‘‘మరి కారణం ఏమయి వుంటుంది?!’’ఆ విచికిత్స లోంచే ఏవో ఏవేవో జ్ఞాపకాలు! ఆ రోజు కొన్ని సంవత్సరాల క్రితం...క్లాసు నడుస్తోంది. టెన్త్‌ క్లాసు స్టూడెంట్స్‌కి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం గురించి మంచి ఆవేశంతో కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తూ చెప్తున్నారు సోమయాజులు మేష్టారు. ఆయన ఆవేశానికి ఎక్కడ ఆటంకం కలిగించిన వాళ్ళఏమవుతామోనన్నంత భయ భక్తులతో నిశ్శబ్దంగా తదేక ధ్యాసతో కనురెప్పలు కూడా ఆడించకుండా చెవులు రిక్కించి వింటున్నారు విద్యార్థులంతా.