‘‘డాడీ, నాకు తల దువ్వవా, స్కూల్‌కి టైము అయిపోతూంది’’ కళ్ళు నులుముకుని భరద్వాజ లేచి పక్కకి చూసాడు. మంచం పక్క అయిదేళ్ళ కొడుకు కార్తీక్‌ నిలబడి ఉన్నాడు. గడియారం వైపు చూసాడు. దాదాపు ఏడున్నర చూపిస్తూంది. ‘అరె! వాడు స్కూల్‌కి వెళ్ళాల్సిన టైము అయి పోతూంది అప్పుడే’ అనుకున్నాడు.‘‘అమ్మ తల దువ్వలేదా?’’ అడిగాడు మెల్లిగా గుసగుసలాడినట్టు.‘‘లేదు డాడీ, అసలు డ్రెస్‌కూడా వెయ్యలేదు. నేనే వేసుకున్నాను.’’ భరధ్వాజ వాడి వేపు చూసాడు. వాడు వేసుకున్న నిక్కరుకి జిప్‌ పెట్టు కోలేదు. చొక్కా బటన్సు అన్నీ తప్పు పెట్టుకున్నాడు. తలంతా రేగి ఉంది. బెల్టు బిగదీసి నిక్కరు కింద జారకుండా కట్టేసాడు. భరద్వాజ నిట్టూర్పు విడిచాడు. తర్వాత మెల్లిగా కార్తీక్‌ చొక్కా, నిక్కరూ సరి చేసి బెల్టు పెట్టాడు. దువ్వెన వాడి చేతుల్లోంచి అందుకుని తల నీట్‌గా దువ్వాడు.‘‘నీ టిఫిను బాక్స్‌ ఏదిరా?’’ అడిగాడు.‘‘నాన్నమ్మ సంచీలో పెట్టింది డాడీ, అవునుగాని డాడీ, అందరూ ఎందుకు కోపంగా ఉన్నారు? ఈ రోజు నాన్నమ్మ కూడా నాతో సరిగా మాట్లాడలేదు’’. ఈ లోపుగా ఆటో హారను బయట వినిపించింది.‘‘బై డాడీ’’ వాడు బయటకు తుర్రుమన్నాడు. భరద్వాజ చూపు గోడ మీద కేలెండరు మీద పడింది. పదిహేడవ తారీఖు చూపిస్తోందది.

 ‘ఇంక మూడు రోజులు! కోర్టు విధించిన గడువు ఇంక మూడురోజుల్లో ముగుస్తుంది. ఆ తర్వాత పరిస్థితుల్ని బట్టి కార్తీక్‌ను చూసుకోడానికి ఎవరైనా మనిషిని పెట్టుకోవాలి. మంచం దిగి వంటింటి వేపు నడిచాడు భరద్వాజ. లోపల తల్లి గొంతు గట్టిగా వినిపిస్తూంది.‘‘పిదపకాలం మనుషులూ, పిదపకాలం బుద్దులూనూ, ఏళ్ళొస్తే సరి కాదు, కాస్త ఇంగితజ్ఞానం ఉండాలి. మా రోజుల్లో ఇలాంటివి ఉండేవా? అసలు ఏది మంచో ఏది చెడో తెలియక పోతే ఎలా చావాలి?’’‘‘ఏమిటమ్మా’’ అడిగాడు నెమ్మదిగా భరద్వాజ.‘‘ఏమీలేదు నాయనా మా కర్మ! మా మాటలు మీరేం పట్టించుకోకండి, ఎలా జరగాల్సి ఉంటే, అలా జరుగుతుంది. అంతా మా నుదుటి మీద ఆ భగవంతుడు రాసిన రాత’’ అక్కడనించి భరద్వాజ వెళ్ళి పోబోతుంటే శాంతమ్మ అంది. ‘‘ఫ్లాస్క్‌లో కాఫీ పోసాను. తాగివెళ్ళు’’ ఈ మాటలు ఎంతగట్టిగా వినబడుతున్నా పక్క గదిలోంచి ఏ శబ్దమూ రాలేదు. అవును బంధం తెంచుకోవాలనుకున్న దానికి మాటలతో పనేంటి ఇంక. ఉసూరుమంటూ బాత్‌రూమ్‌వైపు నడిచాడు భరద్వాజ. స్నానం చేసి, తల్లి చేసిన టిఫిను తిని ఆఫీసుకు బయల్దేరాడు భరద్వాజ.ఎప్పుడు లేచిందో ఏమో, సునంద కూడా లేచి తయారయి ఆఫీసుకు వెళ్ళడానికి రడీగా ఉంది. శాంతమ్మ సునందతో ఎక్కువ మాట్లాడ్డం మానేసింది. తల్లి తనలో తానే గొణుక్కోవడం తప్పించి, తనతో కూడా ఎక్కువగా మాట్లాడ్డం లేదని గ్రహించాడు భరద్వాజ. హాల్లోకి వచ్చి బూట్లు వేసుకుంటున్న భరద్వాజ దగ్గరకి తండ్రి వెంకట్రావు వచ్చాడు.