‘వాన వచ్చేట్టుంది. ఎక్కడికి ఇప్పుడు?’ అంటున్నది వెనకనుంచి కోడలు...‘ఊరికే..అట్లా నాలుగడుగులు వేసివద్దామనీ’ అన్నాను.‘గొడుగయినా తీసుకు వెళ్లండి’నేను వెనుదిరిగి లోపలికి వెళ్లి గొడుగు తీసుకుని బైటికి వచ్చాను.వీధిలోకి వచ్చి పైకి చూస్తే ఆకాశంలో మబ్బుతునక అయినా లేదు. ‘పోనీలెమ్మ’ని చేతిలో గొడుగు ఊపుకుంటూ నడుస్తున్నాను. ఎదురింటి వారి అమ్మాయి-అమ్మణ్ణి-ఎదురై నవ్వుతూ ‘తాతగారూ! గొడుగెందుకండీ చేతిలో?’ అన్నది‘తాతగారూ’ అన్న పిలుపుకు నాకు వొళ్లు మండింది.‘తోవలో వానవొస్తే..మనవరాలా! ఏం చెయ్యాలి?’ అన్నాను...‘వానారాదు. పాడూరాదు...తాతగారిదంతా చాదస్తం..’ అన్నది మరింతగా నవ్వుతూ‘సరే. దీన్ని తీసుకుపోయి మా యింట్లో పడెయ్యి. నీమాట కాదనడమెందుకు?’అంటూ గొడుగు ఆ పిల్లకు ఇచ్చాను. దాన్ని అందుకుని అమ్మణ్ని వెళ్లిపోయింది. నేను ముందుకు నడిచాను. వీధి మొదట రోడ్డు అంతా దాదాపు నిర్జనంగా ఉంది. సెలవులు కావడం వల్ల అక్కడ కుర్రకుంకలు చేరి ఉధృతంగా క్రికెట్‌ ఆడుతున్నారు. నేనక్కడ నిలబడి చూస్తున్నాను. అందులో బౌలింగ్‌ చేస్తున్న కుర్రవాడు నా వంక చూసి అనవసరంగా నవ్వుతూ, ‘వేస్తారా?’అని అడిగాడు. నేను హుషారుగా ముందడుగు వేసి ‘ఇవ్వు..వేస్తాను’ అని సిద్ధపడ్డాను. వాడు బంతి అందించాడు. నేను చొక్కాచేతులు పైకి మడిచి వెనక్కు పది అడుగులు నడిచి బంతి వేసేందుకు సిద్ధపడ్డాను.

 బ్యాటింగ్‌ చేస్తున్నవాడు నిర్లక్ష్యంగా నిలబడి ఉన్నాడు. నేను వేగంగా పరుగెత్తి బంతి విసిరాను. అంతలో అంతటా నవ్వులు..బంతి ఎటో పోయింది. కాని నా భుజం కలుక్కుమని విపరీతమైన నొప్పి పుట్టింది. పక్కన కూలబడి నాకు నేను సపర్యలు చేసుకుంటే రెండు నిమిషాల తర్వాత ఫరవాలేదనిపించింది.వాళ్లు నా బాధను ఈషణ్మాత్రమూ పట్టించుకోకుండా తమ ఆటకొనసాగించారు.నేను నీరసంగా లేచి నడిచాను.‘అరవై దాటిన తర్వాత బ్రతకడమే తప్పు’ అనుకున్నాను. ‘అందరూ అనవసరంగా తాతగారూ, తాతగారూ’ అంటారు. అది మొదటి బాధ. ఏమి మాట్లాడినా ‘చాదస్తం’ అంటారు. ఒక విషయం వాళ్లకు అర్థం కాలేదేమోనని రెండుసార్లు చెబితే ‘సుత్తి కొట్టాడు’ అంటారు. పాత విషయాలేవైనా గుర్తు చేయబోతే ‘చెప్పొచ్చావులే మహా..అంతా పాత సొద’ అంటారు. ఏదైనా మాట వినబడక ‘ఏమిటీ! మళ్లీ చెప్పు’ అన్నట్టు చూశామా, ‘చెవిటి మేళం’ అంటారు. పాతకాలపు ఆణిముత్యం వంటి సినిమా పేరు ఏదైనా ఎత్తితే ‘బోరుబోరు’ అంటారు. త్వరగా నాలుగడుగులు వేయబోతే ‘నెమ్మది...నెమ్మది! ఏమిటా పరుగు?’ అంటారు. నెమ్మదిగి నీరసంగా నడిస్తే ‘ఇలా నత్త నడకలు నడిస్తే అయినట్టే’ అనీ అంటారు. బట్టతలే అనుకోండి... చివర మిగిలిన నాలుగు పరకలూ చిరాకు పుడితే దువ్వుకుందామని దువ్వెన తీస్తే ‘ముసిలాడి షోకులు చూడరా’ అన్నట్టు కళ్లతోనే సైగలు చేసుకుంటారు. ఇదంతా పెద్ద వ్యధ...