డాక్టర్‌ రమా మేడమ్‌, కూర్చోండి, కూర్చోండి’’ అని ఛైర్మన్‌ గారు పేషెంట్‌ స్టూల్‌ మీద కూర్చున్నారు. నేను రాస్తూ రాస్తూ వున్న చీటిని ఆపేసి ఆయనవైపు శ్రద్దగా చూశాను. ‘‘ఇవ్వాళ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌కి మీరు నిడదవోలు వెళ్ళాలి. పదకొండు గంటలకల్లా మీకు లంచ్‌ పంపిస్తాను. టిక్కెట్‌ కూడా. సారీ, ఏసీ చేర్‌కార్‌ టిక్కెట్‌ దొరకలేదు. ఇపడే పోలయ్య రైల్వేస్టేషన్‌ నుండి ఫోన్‌ చేసి చెప్పాడు’’.‘‘మా హాస్పిటల్‌కి బ్రాంచీలు లేవు. నాది, డాక్టర్‌ శేఖర్‌ గారిది, ఆర్‌.ఎం.ఓ. పోస్టులు. స్పెషలిస్టులందరూ ఎవరి వేళలపడు వారు వాళ్ళవాళ్ళ ఛాంబర్స్‌లో కూర్చుని డబ్బు ఇచ్చేరకం పేషంట్లను చూస్తారు. ఎక్కడైనా పరాయి ఊర్లో ఏదైనా కన్సల్టింగ్‌ వుంటే నేను కాని, డాక్టర్‌ శేఖర్‌ గాని వెళ్ళి నిర్మొహమాటంగా ఫీజులు తీసుకుని వైద్యం చేస్తాం. మాకు ఆర్‌.ఎం.ఓ. జీతం, వసతి, భోజనం కాక అలాంటి ఔట్‌స్టేషన్‌ ట్రీట్‌మెంట్లలో 50-50. ఉద్యోగం సాధారణంగా రొడ్డ కొట్టుగా వుంటుంది. కాని మధ్యమధ్య ఇలాంటి ప్రయాణాలు తగిలి కొంచెం ఊరట కలిగిస్తాయి. ఈ ప్రయాణాలలోనే మేము పేషెంట్లు కానివారిని పలకరించగలుగుతాము.

రైలు అనకాపల్లి వంతెన దాటాక ఒక ముసలామె నా సీటు దగ్గరకొచ్చి - ‘‘అమ్మా, నేను ఇక్కడ కూర్చోవచ్చునా?’’ అని నేను కూర్చున్న సీటులోకి చూపించి అడిగింది.‘‘అంటే? నేను ఎక్కడ కూర్చోవాలి?’’ అన్న ప్రశ్న కళ్ళల్లోకి తెచ్చుకుని చూశాను. ఆవిడ అభయహస్తం లాంటిది చూపిస్తూ ఒక వేలితో నాలుగు అరల అవతలకి చూపించింది. ‘‘అక్కడ 35లో మీరు కూర్చోవచ్చు... మరేం లేదు, అక్కడ ఒకామె ఇద్దరు పిల్లలతో ఉంది. వాళ్ళు అదేపనిగా నామీద పడి ‘అమ్మమ్మా, తాతగారు ఏరీ’ అంటూ ఎన్నో ప్రశ్నలతో నన్ను వేపుకు తింటున్నారు’’.నేను 35 ఎక్కడుందా అని వెతుక్కుంటూ ముందువేపుకి వెళ్ళాను. 35 ఖాళీగా వుంది. ఎదుటి సీట్లో ఆ అల్లరి పిల్లలు, వాళ్ళ అమ్మ వున్నారు. నేను ఎక్కడనుండో వచ్చి ఆ 35లో కూర్చున్న సంగతి తనకేమీ పట్టనట్లు ఆమె తన పిల్లల మీద శ్రద్ధలో నిమగ్నమై వుంది.సీట్లో కూర్చున్నాను. ఇది కూడా కిటికీ ప్రక్క సీటే.ఎటొచ్చీ చెట్లు ఇందాకటి సీట్లోలా గాక వెనక్కి వెళ్ళాక కనబడుతున్నాయి. ఎదుటి సీటు ఆవిడ పిల్లాడు తడిపేసిన లాగు విప్పి దానిని జాగ్రత్తగా ఒక ప్లాస్టిక్‌ కేరీ బేగ్‌లోకి చేర్చి పెద్ద బ్యాగులోంచి ఇంకొక పొడిలాగు తీసి తొడిగింది. ఖాళీగా వున్న రెండో పిల్లాడు ఆమె జడ వెనకాల తగిలించిన హేర్‌ క్లిప్‌ని ఎన్ని కష్టాలు పడి అయినా ఊడపీకాలని ఆ పనిలో నిమగ్నమై వున్నాడు. ఆమె ఈ పిల్లాడికి లాగు తొడుగుతూ, ఆ పిల్లాడికి తన జడ దొరకకుండా తప్పించుకోవడానికి వాడికన్నా బిజీగా వుంది.