మొదటిసారిగా నేనా వూరు వెళ్లింది పదేళ్ల క్రిందటనుకుంటాను. ఏదో పని మీద కాకినాడ వెళ్లినప్పుడు అక్కడకు దగ్గర్లోనే చాలా ప్రాచీనమైన శివాలయం వుందనీ అది చూడవలసిన ప్రదేశమని మిత్రుడంటే ఇద్దరం కలిసి బయల్దేరాం. వూరికి చివరగా పచ్చటి పంటచేల సమీపంలో వుంది ఆ శివాలయం. ఎత్తైన గోపురం. ఆలయానికి నాలుగుపక్కలా ఎత్తయిన గోడలూ చూస్తుంటే నాకు హంపీ క్షేత్రం జ్ఞాపకం వచ్చింది. వూరికి చివరగా వుందేమో, భక్తుల రద్దీ అంతగా లేదు. మేము కాక ఐదుగురు మాత్రమే భక్తులు దైవదర్శనం చేసుకోటానికి వచ్చారు. శాంపిల్స్‌ పుచ్చుకుని, డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణం చెయ్యటానికి వృత్తిరీత్యా అలవాటు పడ్డ నాకు గుడి చుట్టూ తిరగడం కొత్త అనుభూతినిచ్చింది.నాకు దైవం మీద నమ్మకం వుందా అంటే వుందని కాని, లేదని కాని గట్టిగా చెప్పలేను. నిజానికి పూర్తి ఆస్తికుడుగానీ, పూర్తిగా నాస్తికుడు గాని ఎవరూ వుండరని నా అభ్రిపాయం. ఐనా అభిషేకం చేయించి అక్కడున్న సిమెంటు బెంచీమీద కూచున్న నాకు అనిర్వచనీయమైన ఆనందం కలిగింది.

చెప్పలేనంత ప్రశాంతతతో నా మనసు నిండిపోయింది. నేను దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకున్నాను కాని, ఎన్నడూ ఇంత ఆనందం, మనశ్శాంతి కలగలేదు. సుమారు ఒక పావుగంట పక్కన మిత్రుడు కూచున్నాడన్న విషయం కూడా మరచిపోయి, ఆనంద పారవశ్యంతో వుండిపోయాను. ఆ రోజు నా జీవితంలో గుర్తుంచుకోదగ్గ రోజని నాకిప్పటికీ అనిపిస్తూ వుంటుంది.ఇంటికి వచ్చాక నేను కొత్త వ్యక్తినై పోయాను. అది కాకతాళీయమో, పవిత్రమైన ఆ క్షేత్ర మహత్యమో నేను నిర్థారించలేను. అప్పటికి అపరిష్కృతంగా వున్న కుటుంబ సమస్యలన్నీ పటాపంచలై పోయాయి. కుటుంబంలో శాంతి నెలకొంది. ఆనాటి నుంచీ నేను అంతర్ముఖుణ్ణై పోయాను. పూజా పురస్కారాలు, ధ్యానమూ అలవాటు లేని నాకు ప్రతి రోజూ స్నానమయ్యాక నా గదిలో కూర్చుని ఆ దేవాలయం లోని పరమేశ్వరుణ్ణి మనోనేత్రం ముందు ఓ పది నిమిషాలు నిలుపుకోవడం నా దినచర్యగా మారింది. అప్పటినుంచీ నా జీవితాన్ని ఓ మలుపు తిప్పిన ఆ దేవాలయాన్ని ఏడాదికోసారి దర్శిస్తూ వచ్చాను. ప్రతిసారి అదే ఆనందం, అదే ప్రశాంతత నేననుభవించాను.