పద్మాకర్‌ ఇల్లు చేరేసరికి, అదొక రణ రంగంలా వుంది. పిల్లలిద్దరూ గ్రుక్క తిప్పుకోకుండా, ఆరున్నొక్క రాగాలాపనలో వుండగా వాళ్లను సముదాయించడం సొంపుకాబోలు, వినోదిని వాళ్ళను మించి, ఇంటి పై కప్పు ఎగిరిపోయేలా, కేకలు వేస్తూ, హడావిడి చేస్తూంది.అతడ్ని చూడగానే పిల్లలు ఏడుపులాపేసారు. అతని దగ్గర వాళ్లకామాత్రం భయం వుంది; తల్లి దగ్గరమాత్రం అసలే లేదు- మాట్లాడితే, కొడుతుందని. అయితే, వాళ్ళింకా వెక్కుతున్నారు.పద్మాకర్ని చూడగానే వినోదిని అగ్గి మీద గుగ్గిలమయింది. ‘‘అయ్యాయా, అయ్యగారి బలాదూరు తిరుగుళ్లూ! ఈ పాటికైనా తఁవకు ఇల్లు గుర్తొచ్చింది- సంతోషం! వీళ్లిద్దరూ రానురానూ రాక్షసులైపోతున్నారు- నా పాలిటికి. కాల్చుకు తింటున్నారు. నేఁ చెప్పిన మాట సుతరామూ వినరు కదా! మీరేమో ఆఫీసు నుండి తిన్నగా ఇంటికి రాకుండా, ఏవేవో రాచకార్యాలు వెలగబెడ్తారు- ఇల్లూ, ఇల్లాలూ, పిల్లలూ వున్నారన్న సంగతి పూర్తిగా మరిచిపోయి! మీకేం, మీరు మగ మహారాజులు! ఇంట్లో పరిస్థితి ఎలాగున్నా, ఊరేగడానికి బోలెడంత టైమూ, స్వేచ్ఛా మీకున్నాయి. 

నేనీ సంసార సాగరాన్ని ఇంకెంత మాత్రం ఈదలేను బాబూ! తిన్నగా మా అమ్మ దగ్గరికి వెళ్లిపోతాను. మీరూ, పిల్లలూ హాయిగా వుండండి-’’ అంది చిటపటలాడుతూ.పద్మాకర్‌ విసుగ్గా ముఖం చిట్లించాడు: ‘‘మొదలెట్టావూ నీ సొద! ఇంటికి మనిషొస్తే ఒక్క నిమిషమైనా వూపిరి తీసుకోనివ్వవు కదా! బైట నేనేదో మహా సుఖపడిపోతున్నట్టు, ఒకటే గోలగోల చేస్తావిలా! రాను రానూ నాకు ఇంటికి రావాలంటేనే భయమేస్తోంది. అందుకే అన్నారేమో ‘ఇంటి కంటే గుడి పదిలం’ అని. నేనేమీ ఊర్లో షికార్లు వెలగబెట్టి రాలేదిప్పటి దాకా! ఆఫీసులో నా ప్రక్కసీటతను సెలవు పెట్టాడని, అతని పని కొంచెం చూడమని మేనేజర్‌ నన్ను రిక్వెస్ట్‌ చేశాడు. అది పూర్తయినప్పటికి ఇదిగో ఈ సమయమయింది. అలిసిపోయి వళ్లు నొప్పుల్తో నేనింటికి వచ్చేసరికి, మహా బాగా ఇచ్చావులే స్వాగత సన్మానం! విశ్రాంతి తీసుకోడానికి కూడా ఇంటికి రాకూడదేం, నా ఖర్మ కాబోతే? మాట్లాడితే అమ్మ కూచిలా మా పుట్టింటికెళ్ళి పోతానని తర్జని, బెదిరింపులొకటి నాకు! అంత కష్టమేం పెట్టాను నిన్ను? ఇకపోతే, పిల్లలన్నాక అల్లరి చేయరా? అసలేం జరిగిందో అరచి గీపెట్టక, నిదానంగా చెప్తే, నేను సరిదిద్ద ప్రయత్నిస్తాను కదా?’’వినోదిని మూతి మూడు వంకర్లూ తిప్పింది. ‘‘పెళ్లైన దగ్గర్నుండీ ఒహటే చూస్తున్నాను కదా మీరూ, మీ సరిదిద్దడాలూ! ఎన్నిసార్లు నా ముద్దూ ముచ్చట్లూ తీర్చారు? సరదాగా ఒక సినిమాకో, షికారుకో పోడం ఎటూ లేదు- నేనూ సరిపెట్టుకొని వూరుకున్నాను. కనీసం ఏరికోరి కన్న సంతానం - వాళ్ళ సరదాలైనా ఎప్పుడైనా తీర్చేరా మీరు? తోటి పిల్లలంతా సినిమాలని, షికార్లని సరదాలు చిత్తగిస్తూ వుంటే, వీళ్లేమో బిక్క ముఖాలేసుకుని, బిక్కు బిక్కుమంటూ, ఇంట్లోనే పడి ఏడుస్తున్నారు-’’