వరండాలో మంచం మీద కూర్చుని ఉన్నాడు కేశవరావు. గంట నుంచీ గేటు బయట తిరిగే మనుషులనీ, రోడ్డు మీద పోయే రిక్షాలనీ, ఆటోలనీ చూస్తూ ఉన్నాడు. లోపల గదిలో పిల్లలు టి.వి. పెద్ద సౌండు పెట్టుకుని కార్టూన్‌ నెట్‌వర్క్‌ చూస్తున్నారు. పక్కగదిలో కొడుకు పేపర్‌ చూస్తూ ఉన్నాడు. కోడలు వంటింట్లో ఉంది. పిల్లలు టి.వి. దగ్గర్నుంచీ ఇప్పుడిప్పుడే కదిలేటట్లు లేరు. రోడ్డు మీదకు చూసీ,చూసీ విసుగెత్తిపోతోందికేశవరావుకు. ‘‘పిల్లలూ! ఇటు రండి’’ పిలిచాడు. మనవడూ, మనవరాలూ ‘‘ఆఁ’’ అన్నారేగానీ అక్కడ నుంచీకదలలేదు. మరో రెండుసార్లు పిలిచాడు. కోడలు వంటింట్లో నుంచీ వచ్చి టి.వి. ఆఫ్‌ చేస్తూ ‘‘తాతయ్య పిలుస్తూంటే వినిపించడంలా! వెళ్ళండి’’ అన్నది.మనవడూ,మనవరాలూ విసుక్కుంటూ వచ్చి ‘‘ఏమిటి తాతయ్య!’’ అన్నారు.‘‘ఇలా కూర్చోండర్రా!’’ చేయి పట్టి మంచం మీద కూర్చోబెట్టాడు.‘‘మీకు చక్కటి పద్యాలు చెప్తాను. చిన్న చిన్న పదాలతో బాగుంటాయి పలకండీ! ఉప్పుకప్పురంబు ఒక్క పోలికనుండు......’’ టీచర్‌గా చేసి రిటైరైన కేశవరావు అలవాటు ప్రకారం అన్నాడు.‘‘అబ్బబ్బా! తాతయా! సండే కూడా చదువేనా? రోజూ స్కూల్లో క్లాసులు, స్టడీ అవర్లు. ఇంటికొస్తే హోవర్కు. ఇంక మాకు రెస్ట్‌ ఎప్పుడు? అన్నాడు మనవడు. కేశవరావు ఒక్కక్షణం మౌనంగా ఊరుకున్నాడు.‘‘సరే! నా దగ్గర చందమామ పుస్తకం ఉంది. బోలెడు మంచి కథలున్నాయి. చదువుకుందాం’’ అన్నాడు.‘‘అవేమన్నా ఎగ్జామ్స్‌లో వస్తాయా! అవి చదవడం ఎందుకు? అసలు స్కూల్లో తెలుగు మాట్లాడితే మా మేడం ఫైన్‌ కూడా వేస్తారు’’ అన్నది మనవరాలు.ఇద్దరూ లోపలికి వెళ్లిపోయారు.

‘‘నాన్నా! వాళ్ళనెందుకు ఇబ్బంది పెడతావు? ఏదో ఆదివారం ఒక్కరోజు సెలవు. సరదాగా టీ.వీ. చూడనీ!’’ అప్పటికే అవన్నీ వింటున్న కేశవరావు కొడుకు అన్నాడు.‘‘ఇబ్బందేమిట్రా! రకరకాల పుస్తకాలు చదివితే మనసు వికసిస్తుంది. ఎప్పుడూ టీ.వీ. ముందు కూర్చుంటే స్థూలకాయం వస్తుంది’’ అన్నాడు.కొడుకు సమాధానం చెప్పలేనట్లు చూసి ఊరుకున్నాడు.కేశవరావు నిట్టూర్చాడు. ‘‘ఏం పిల్లలో! చక్కగా ఆటలు ఆడకుంటూ శరీర ధారుఢ్యం పెంచుకోవడం లేదు. మంచి పుస్తకాలు చదివి తెలివి తేటలు పెంచుకోవడం లేదు. ఎప్పుడు చూసినా ఆ టీ.వీ. ముందు కూర్చోవడం, లేదా బండెడు పుస్తకాలు ముందేసుకుని హోంవర్కు చేస్తూ ఉండడం.తన చిన్నపుడు ఇలాగా! చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి, బాలానందం, బాలభారతి, జాబిల్లి ఎన్ని పిల్లల పుస్తకాలో! తన స్నేహితులందరి ఇళ్ళల్లో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పుస్తకం ప్రతి నెలా తెప్పించుకునేవాళ్ళు. ఒక పుస్తకం చదవడం అవగానే ఒకరిదొకరు మార్చుకుని చదివేవారు.నాలుగవ తరగతిలో ఉండగానే రామాయణం, భారతం, భాగవతం మొదలైన కథలన్నీ తెలిసేవి. అవన్నీ పుస్తకాల్లో సీరియళ్ళుగా వచ్చేవి. అవన్నీ చదవడం అలవాటైన మీదట పాఠాలన్నీ ధారళంగా చదవడం వచ్చేది.