ఉషోదయపు మసక వెలుతుర్లో కోటిపల్లి బస్టాండ్లో పదేళ్ల తర్వాత బస్‌ దిగిన ప్రసాద్‌కి పరిచయమున్న పరిసరాలు పలకరించినట్టన్పించింది. బయటి కొచ్చి ఇన్నీసుపేట వైపు నడుస్తుంటే, సెల్‌ఫోన్‌ శబ్దం చేసింది. నంబరు చూసి.. ‘‘రమణా! గుడ్మాణింగ్‌’’ అన్నాడు.‘‘ప్రసాదూ! వచ్చాశావేంటి? నేను నీ కోసం బస్టాండ్లో చూస్తున్నాను’’.‘‘మెల్లగా నడుస్తున్నాను. ఓ ఫర్లాంగు దూరంలో ఉన్నాను’’.‘‘అక్కడేఉండు వచ్చేస్తున్నా’’.ఐదు నిమిషాల్లో రమణ కార్లో రావడంతో, ప్రసాద్‌ కార్లో ఎక్కేశాడు. కుశల ప్రశ్నలయ్యేలోపే కారు ఇన్నీసుపేటలో రమణ ఇంటి ముందాగింది.రమణ, ప్రసాద్‌ రాజమండ్రి వి.టి. కాలేజీలో ఇంటర్మీడియట్‌ కలిసి చదువుకున్న మిత్రులు.అప్పట్లో రమణ బిజినెస్‌మేన్‌ కావాలని కలలుగనేవాడు. అనుకున్నట్టుగానే డిగ్రీ చదివి, ఫ్యాబ్రికేషన్‌ వర్క్‌షాపు పెట్టి, దానిని హాస్పిటల్‌ ఎక్విప్‌మెంట్‌ తయారుచేసి ఫ్యాక్టరీగా మార్చి, దిగువ మధ్య తరగతి నుండి ఎగువ మధ్య తరగతికి ఎదిగిన వ్యాపారవేత్త. ఇన్నీసుపేటలో రెండు అంతస్తుల ఇల్లు. కారు. పిల్లలకి కార్పొరేట్‌ చదువులు, కడియం దగ్గర స్థలాలు ఏర్పరచాడు.పరస్పర పరామర్శలు, పలకరింపులు అయ్యాక...‘‘ఏంటి ప్రసాదూ! అమెరికా వదిలి పెట్టాలని లేదేంటి?’’ అన్నాడు రమణ.‘‘పిల్లలిద్దరూ అక్కడే సెటిలయ్యారు. మాకు ఉద్యోగాలక్కడే కాబట్టి ఇంకా ఇక్కడికొచ్చి చేసేది ఏముంది?’’‘‘అవునా!? మరి ఇల్లు ఖాళీ చేయించమన్నావేంటి? పడగొట్టి కొత్తిల్లు కడదామనా?’’‘‘అమ్మేద్దామనుకుంటున్నాను’’.‘‘అమ్ముకోవటం ఎందుకురా! తాతల్నాటిల్లు. ఎప్పటికైనా మనదీ అని ఒకటుంటే రాకపోకలు, ఇక్కడి వాళ్ళతో అనుబంధాలు ఉంటాయి. నువ్వెంత అమెరికాలో స్ధిరపడ్డా... సొంతూరు సొంతూరే’’.

‘‘నిజమే... మేం వచ్చి ఇక్కడ ఉండలేనప్పుడు. ఇంటి బాగోగులు చూసుకోలేనప్పుడు.. అమ్మే సేయడమే బెటరు కదా! రేట్లెలా ఉన్నాయి’’ అన్నాడు.‘‘ఆకాశన్నంటుతున్నాయి. దానవాయిపేట సెంటర్లో ఇల్లు గదా!’’‘‘అద్దెకున్నవాళ్ళు ఖాళీ చేశారా?’’‘‘చెయ్యమని చెప్పాను. నీకు చెప్పాను చూడు... ఆరేళ్ళబట్టీ అదే కాలేజీలో లెక్చరర్‌’’.‘‘అలాగా! అవునూ. ఈరోజు నీ ప్రోగ్రాం ఏంటి?’’‘‘బిజినెస్‌ డీల్‌ గురించి విజయవాడెళ్ళాలి. సాయంత్రానికి వచ్చేస్తాను. నువ్వు రెస్ట్‌ తీసుకో. ఈలోపు అద్దెకుంటున్న ఆ లెక్చరర్ని పిలిపిస్తా’’‘‘వొద్దుద్దు. నేనే వెళ్తాను. అతని ఫోన్‌ నంబరివ్వు’’ అన్నాడు ప్రసాదు.ఫఫఫఅమెరికాలో కార్లలో తప్ప కాలు కిందపెట్టని ప్రసాదు రోడ్డు మీద నడుస్తూ, పరిసరాల్లో మార్పుని వేగాన్ని గమనిస్తున్నా, మార్పుమాటున ఇంకా సజీవంగా ఉన్న అలనాటి జ్ఞాపకాలే గుర్తుకు రాసాగాయి. దానవాయిపేట బి.ఇడి వీధిలో నాలుగో ఇంటి ముందు ఆగాడు. అప్పట్లో ఇంటి ముందు పెద్దరావిచెట్టు ఉండేది. ఇప్పుడు రెండస్తుల మేడ, షాపులు కన్పిస్తున్నాయి. తన బాల్యం నుండి మార్పులేని ఇంటిగేటు తీసుకుని, లోపలికెళ్ళబోతూ, ఇంటిముందు ఖాళీగా ఉండే స్థలంలో అందంగా పెంచిన పూల మొక్కల వైపు చూడగానే, ఇంట్లో ఉంటున్న వాళ్ళ అభిరుచి అర్థమయింది. గేటు చప్పుడు విని, లోపల్నుంచి సన్నగా, ఎత్తుగా, కొద్దిగా బట్టతలతో ఉన్న వ్యక్తి వచ్చి....