‘‘మాధవ్‌ గారూ...’’‘‘...............’’‘‘ఓ వేణు మాధవ్‌ గారూ....’’తన సీటులో పనిచేసుకుంటున్న మాధవ్‌ తలెత్తి ఎదురుగా వస్తున్న మాధవిని చూసి ‘‘పిలిచారా?’’ అని అడిగాడు.‘‘కాదు...అరిచాను. అయినా మీకు వినబళ్లేదు’’ కోపం నటిస్తూ అంది మాధవి.‘‘అందుకే మిమ్మల్ని భోజనం ప్రతి రోజూ చెయ్యమని చెబుతుంటాను. అరిచానని మీరనుకుంటున్నారు. మీలో మీరే మాట్లాడుకుంటున్నారని నేననుకుంటున్నాను’’‘‘జోక్‌ బాగుంది కానీ కంగ్రాచ్యులేషన్స్‌’’‘‘థ్యాంక్స్‌’’‘‘ఎందుకని అడగరేం?’’‘‘అదే పనిగా సీటు దగ్గరకి వచ్చి అభినందించిన వారు ఎందుకో చెప్పకపోతారా? అని ఊరుకున్నాను.’’‘‘మన బ్రాంచి నుంచి ఆఫీసరు పోస్టుకు ఇంటర్వ్యూ కోసం ఇద్దర్ని సెలక్ట్‌ చేశారు. అందులో మీరున్నారు’’మాధవ్‌ ముఖం ఆనందంతో వెలిగింది.‘‘థాంక్యూ...థ్యాంక్యూ వెరీమచ్‌. అలాగే మీరు కూడా నా అభినందనలు అందుకోండి’’‘‘అంటే ఈ విషయం మీకు ముందే తెలుసా?’’ అనుమానంగా అడిగింది మాధవి.‘‘మీరు చెప్పాకే నాకు తెలిసింది’’‘‘మరి ఆ రెండోవ్యక్తిని నేనని మీకెలాతెలిసింది?’’‘‘మీరు సెలక్ట్‌ కాకపోయి వుంటే మీ ముఖం ఇంత ఉత్సాహంగా, ఆనందంగా వుండదు కాబట్టి ఊహించాను.’’‘‘అంటే మీరొక్కరే సెలక్ట్‌ అయితే నేను బాధపడతాననుకున్నారా?’’ నిష్ఠూరంగా అంది.‘‘నేను సెలక్ట్‌ అయినందుకు కాదు, మీరు కానందుకు బాధపడేవారు.’’‘‘మీతో మాట్లాడి నేను గెలవలేను కాని నేను సీటుకు వెళుతున్నాను. మీకు ఆల్‌ ది బెస్ట్‌’’‘‘థాంక్యూ అండ్‌ విష్‌ యు ది సేమ్‌’’ అన్నాడు మాధవ్‌.్‌్‌్‌ఆ రోజు రాత్రి మాధవికి మాధవ్‌ పదే పదే గుర్తుకు రాసాగాడు. అతని మాటలు, నవ్వు, హుందాతనం, చిలిపితనం, కళ్లముందు కదలాడసాగింది.

‘‘మాధవ్‌ మంచివాడు. ఆఫీసులో అందరితో ఆప్యాయంగా మాట్లాడతాడు. ఎలాంటి భేషజాలు లేని మనిషి. ఎవరినీ నొప్పించడు. ఎపడూ హుషారుగా వుంటాడు. అందరికీ తన చేతనయినంత సహాయం చేస్తాడు. అటువంటి వ్యక్తి స్నేహం లభించడం తన అదృష్టం’’ అనుకుంది మాధవి.మరుసటి రోజు లంచ్‌ టైమ్‌లో మాధవ్‌ ఎదురుపడినపడు ‘‘బాగా చదువుతున్నారా’’ అని అడిగింది.‘‘ఆ... నవ్య, ఇండియా టు డే..’’‘‘మాధవ్‌గారూ.. ఐ యామ్‌ సీరియస్‌’’ అంది కోపంగా.‘‘నో... యూ ఆర్‌ హెల్దీ’’ఫక్కున నవ్వేసింది మాధవి.తర్వాత ‘‘మీరు ఇంత బాగా మాట్లాడే విద్యను ఎక్కడ నేర్చుకున్నారు?’’ అని అడిగింది.‘‘శ్రీ చైతన్య టాకింగ్‌ కోచింగ్‌ సెంటర్‌లో’’మళ్లీ నవ్వింది మాధవి.‘‘నేను చెప్పే విషయం శ్రద్ధగా వింటారా?’’ సీరియస్‌గా అడిగింది మళ్లీ.‘‘చెప్పండి’’ రెండు చేతులూ కట్టుకుని వినయం నటిస్తూ అన్నాడు.‘‘మీరు ఇంటర్వ్యూను సీరియస్‌గా తీసుకునే పక్షంలో రోజూ సాయంత్రాలు మనం కలిసి చదువుకుందాము. అలా చదివితే ఒకరికి తెలియనివి ఇంకొకరి నుంచి నేర్చుకోవచ్చు. కలిసి చదివితే బోరు కొట్టదు’’‘‘మంచి ఆలోచన అలాగే చేద్దాం’’ అన్నాడు మాధవ్‌.ప్రతి రోజూ మాధవ్‌, మాధవి కలిసి చదువుకోసాగారు. క్రమంగా మాధవ్‌తో మరింత చనువు పెరిగింది. మాధవికి ఇంగ్లీషు భాషలో అతని ప్రావీణ్యత చూసి, అతని జనరల్‌ అవేర్‌నెస్‌ చూసి ఆమె ఆశ్చర్యపోయేది. ఇతనికి తెలియని సబ్జెక్టు గాని, విషయం గాని, లేనట్లుంది. కలసి చదువుకోవడం వలన అతని కంటే తనకే ఎక్కువ లాభం కలుగుతుంది అనుకునేది.