ఉదయం పది గంటల సమయం. భాస్కరం ఆఫీసుకి వెళ్ళటానికి గది లోంచి వచ్చాడు. హాలులో టీవీ ప్రోగాం చూస్తున్న భార్య సంధ్యారాణీని అడిగాడు. ‘అమ్మ టిఫిన్‌ తిన్నదా’ అని టీవిపై నించి చూపులు తిప్పకుండానే’ లేదు. ఆకలిగా లేదన్నారు. రాత్రి గూడా బ్రతిమాలగా గ్లాసుడు మజ్జిగ మాత్రం తీసుకున్నారు. నేను మాత్రం ఏం చెయ్యగలను చెప్పండి. ఎంతయినా కోడలు కూతురు కాదుగదా. అదేపనిగా వెంటపడి అడిగినా తప్పు, అడక్కపోయినా తప్పే. ఆవిడకి ఏం చెప్పి ఓదారుస్తారో ఓదార్చి టిఫిన్‌ తినిపించి వెళ్ళండి’ అంది కాస్త నిష్టూరంగా.భాస్కరం మరేం మాట్లాడలేక తల్లి పడుకున్న గదిలోకి వెళ్ళాడు. వరలక్ష్మమ్మగారు పడుకుని లేదు. మంచం మధ్యలో ముడిచి పెట్టుకుని గోడకి ఆనుకుని, ఎదురుగా గోడకున్న భర్త ఫొటోవంక తదేకంగా చూస్తూ కూర్చునుంది. రెండుకళ్ళు అగ్నిగోళాల్లా జ్వలిస్తున్నాయి. కళ్ళ ల్లోంచి కారుతున్న కన్నీరు ముడతలుపడ్డ చెక్కిళ్ళ మధ్య నించి జారి చీర మడతల్లోకి మాయం అవుతున్నాయి. నలిగిపోయిన చీర, రేగిపోయిన జుట్టు ఫ్యాన్‌ గాలికి ఎగిరెగిరి పడుతున్నాయి. దైన్యాన్ని విచారాన్ని, విషాదాన్ని నింపుకున్న గుండ్రటి మొహం. అన్నిటికి మించి పోతూ పోతూ భర్త తీసుకెళ్ళిన పావలాకాసంత బొట్టు తన గొప్పతనాన్ని పరోక్షంగా చాటిచెపుతున్నట్లుగా వుంది. పైశాచికదాడికి గురయ్యి, పవిత్రతని, ప్రాముఖ్యతని కోల్పోయిన దేవాలయంలా వుంది అమ్మ!తల్లి వంక తదేకంగా చూసిన భాస్కరం కళ్లల్లో నీళ్ళు తిరిగాయి. 

నాన్న పోయి ఆరునెలలే అయినా ఈ స్వల్పవ్యవధిలోనే అమ్మలో ఎంత మార్పొచ్చింది. మనిషికి మనిషికి మధ్యన వుండి అనుబంధాలు, ఒకరి మరణంతో తెగిపోయి జ్ఞాపకాలుగా మారి బాధిస్తాయి కాబోలు. కాక పోతే అమ్మ ఎలా వుండేది. ఎంత అందంగా వుండేది. దేవతలు ఎలా వుంటారో తెలీదుగాని, అమ్మని చూస్తే పవిత్రతకి అర్దం తెల్సుకున్నట్లుండేది. నాన్న ప్రతి పండగకి చీర తెచ్చి ఇవ్వాల్సిందే. అమ్మ నాన్న కల్సి వెడుతుంటే నాస్తికులకి గూడా ముచ్చటగా చూడాలని పించేలా వుండేవారు. అలాంటి అమ్మనాన్నపోయాక, ఫెళఫెళా విరిగి పోయి కుప్పకూలిన పూలచెట్టులాగా, విద్యుత్‌ సరఫరా ఆగిపోయి, మూతబడిన జీవిత కర్మగారం లాగా ఇంతటి మార్పా?‘అమ్మా’ అన్న కొడుకు పిలుపు విని వరలక్ష్మమ్మగారు కంగారుగా పమిటతో కళ్ళు తుడుచుకుని ‘ఏం నాన్నా ఆఫీసుకి వెడుతున్నావా?’ అనడిగింది.‘అవునమ్మా. రాత్రి ఏం తినలేదట. ఇప్పుడు గూడా ఆకలిగా లేదన్నావుట. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏం కానమ్మా. నాన్నగార్ని తల్చుకుంటూ కుళ్ళి పోతుంటే నిన్ను చూస్తున్న మాకెంత బాధగా వుంటుంది. అయినా నాన్నగారు ఎక్కడికి వెళ్ళారని, కళ్ళముందు లేరుగాని, మన మనస్సుల్లో, ఆలోచనల్లో నిరంతరం మనవెంటే వుంటారమ్మ, తల్లిభుజం పైన చెయ్యి వేసి ప్రేమగా అన్నాడు.