కల భళ్ళున చిట్లి చెదిరిపోయింది.నల్లని ఒక మహాబిలంలో నుండి... చిక్కని చీకటిని చీల్చుకుంటూ... తెల్లగా వందల వేల సంఖ్యలో బిలబిలమని పావురాల మహోత్సర్గం. విచ్చుకుంటున్న రెక్కల జీవధ్వని. ఒక ధవళ వర్ణార్నవంలోకి పక్షులన్నీ ఎగిరి ఎగిరి... ఆకాశం వివర్ణమై.... దూరంగా...సూర్యోదయమౌతూ... బంగారు రంగు... కాంతి జల.అంతా నిశ్శబ్దం... దీర్ఘ... గాఢ... సాంద్ర నిశ్శబ్దం.లోపల... గుండెల్లో ఏదో మృదు ప్రకంపన. అర్ధచైతన్య... పార్శ్య జాగ్రదావస్థలో... వినీవినబడని సారంగీ విషాద గంభీర రాగధార.ఏదో అవ్యక్త వ్యవస్థ... విచ్ఛిన్నమౌతున్నట్టో... లేక సంలీనమై సంయుక్తమౌతున్నట్టో... విద్యుత్ప్రవాహమేదో ప్రవహిస్తోంది ఆపాదమస్తకం ఒక తాదాత్మ్య పారవశ్యంలో.భాష చాలదు కొన్ని అనుభూతులను అనుభవాలుగా అనువదించడానికి... ఫేజెస్‌.. స్థాయి... ఉన్నతి... తురీయత... వెరసి భౌతికాభౌతిక ఆవరణలో... నిరంతరాణ్వేషణ.వెదుకులాట... ఎడతెగని అనంతశోధన.జీవితమంటే.... వెదకడమేనా... వెదకడానికి ఒక అంతమంటూ ఉంటుందా. ప్రశాంతతకోసం వెదకడం... డబ్బుకోసం వెదకడం.. సౌఖ్యాలకోసం వెదకడం.. మనిషి తనను ప్రేమించే మరో మనిషికోసం వెదకడం... చివరికి.. అర్ధం కాని ‘‘ఏదో’’ కోసం వెదకడం.ప్రొఫెసర్‌ బాలసిద్ధ కళ్ళు తెరిచాడు ప్రశాంతంగా.

ఎక్కడినుండో... ఊర్ధ్వలోకాల అవతలి నుండి.... యోజనాల గగన మార్గం ద్వారా... ఎండుటాకులా తేలితేలి ... కిందకు జారిజారి... ప్రచలిస్తున్న భూతలంపై వాలిపోతున్నట్టు... అనుకంపన...వీణ తంత్రి మృదువుగా మోగుతున్నట్టు... అనువాదం.రైలు పరుగెడుతూనే ఉంది. టకటకా టకటకా పట్టాల లయాత్మక ధ్వని.అరవై ఏడేళ్ళ జీవితం.తన జీవితం ఒక మూసివేసిన పుస్తకంగా మిగిలి... అన్నీ సంక్లిష్టతలే... అన్నీ చీకటి వెలుగులే... క్రీనీడలే... అన్నీ దాచబడ్డ ఎండిన పూలే.కిటికీలో నుండి బయటికి చూశాడు బాలసిద్ధ.రైలు చాలా వేగంగా పోతోంది. కిటికీలో నుండి... దూరంగా భద్రకాళి గుడి శిఖరం.. తటాకం.. నీలిగా.. ఇటు పద్మాక్షమ్మ గుట్టలు.రైలు కాజీపేట్‌ దాటి.. బైపాస్‌ ట్రాక్‌పై నుండి... వరంగల్‌. నాగపూర్‌ దాటిన తర్వాత వరంగల్లే... మహావేగం.వేగం.. కాలం... దూరం... పని మహబూబియా హైస్కూల్‌. వెంకటయ్య సార్‌ లెక్కలు. ఒక తొట్టిని ఒక పంపు ఒక గంటలో ఖాళీ చేయును. అదే తొట్టిని మరొక పంపు అరగంటలో నింపును. ఆ రెండు పంపులను ఏకకాలంలో ఒక గంటసేపు నడిపించిన తొట్టిలో నీరు ఎంతశాతం నిండును.