క్లబ్బు వార్షికోత్సవానికి పిలవటానికి వచ్చారు నలుగురు నారీమణులు, పట్టుచీరల్ని రెపరెపలాడించుకుంటూ, వాణీబాయి గారింటికి, వాళ్ళని కూర్చోబెట్టి కూల్ర్డింకులూ అవీ ఇచ్చి మర్యాదలు చేసింది వాణీబాయి చెలికత్తె చిన్నమ్మ. ఆ తర్వాత కాసేపటికి మేడమీద నుండి క్రిందికి దిగి వచ్చింది వాణీబాయి. కుశల ప్రశ్నలు అయ్యాక క్లబ్బు వార్షికోత్సవం సంగతి చెప్పి చీఫ్‌ గెస్టుగా రావాల్సిందిగా వాణీబాయిని కోరారు వాళ్ళు. వాణీబాయి అందుకు సంతోషంగా అంగీకరించింది. వాళ్ళు ఎన్నో విధాలుగా కృతజ్ఞతలు తెలిపి, ఆ తర్వాత చందా సంగతిప్రస్తావించారు. ఆ మాట వినగానే వాణీబాయి మొహంలో రంగులు మారటం గమనించిన ఒకామె ‘‘రాణీబాయిగారు అయిదువేలు ఇచ్చారు. కార్యక్రమం అనగానే ఖర్చులుంటాయి గదా మేడం. అదే విధంగా మీరున్నూ, ఉదారంగా విరాళం ఇస్తే ఫంక్షన్‌ గ్రాండుగా జరుగుతుంది’’ అంది. ఆ మాట మంత్రంలా పనిచేసింది. వాణీబాయి వెంటనే చెక్కుబుక్కు తీసి పదివేలకి చెక్కురాసి వారికిచ్చింది. వాళ్ళు ఎంతో సంతోషించి, వాణీబాయిని వేనోళ్ళ పొగిడి, కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకుని వెళ్ళారు. వాణీబాయి మొహం గర్వంతో ఒక వెలుగు వెలిగింది.వాణీబాయి ఇల్లూ, రాణీబాయి ఇల్లూ సిటీలో ‘పోష్‌లొకాలిటీ’ లో ఎదురెదురుగా వుంటాయి. అందమయిన గార్డెన్స్‌ మధ్య ఆధునాతనంగా నిర్మితమయిన ఆ రెండు మేడలూ, చూపరులను ఆకర్షించటంలో ఒకదానితో ఒకటి పోటీపడ్తూ వుంటాయి.వాణీబాయి భర్త విన యబాబూ, రాణీబాయి భర్త రాజబాబూ పేరు మోసిన వ్యాపారులు, కోట్లకి పడగలెత్తిన వాళ్ళు. సంఘంలో మంచి గుర్తింపు వున్నవాళ్లు ‘‘పండగ వస్తోంది గదా ‘గిఫ్టు’ ఇద్దామనుకుంటున్నాను. ఏం కావాలి?’’ అని అడిగాడు శ్రీమతిని రాజబాబు.

 రాణీబాయి చిరునవ్వు నవ్వింది. అతనికి ఆ నవ్వే వరహాల పెట్టు.ఇద్దరూ భోజనం చేస్తున్నారు. తను వడ్డించుకుంటూ, అతనికి కూడా కొసరి కొసరి వడ్డించింది ఆమె.‘‘కూర చాలా బావుంది’’ అన్నాడు.‘‘ఇంకొంచెం వేసుకోండి’’ అంది.‘‘చాలు కడుపులో పట్టద్దూ? వద్దూ?’’ అని వారించాడు. కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ కలిసి భోజనం చెయ్యటం అతనికి ఇష్టం. ఎన్ని పనులున్నా వీలుకల్పించుకుని అతను భోజనానికి ఇంటికి రావటం ఆమెకి ఇష్టం.్‌్‌్‌ఎప్పుడూ బిజీగా వుండే వినయబాబుకి ఆ రోజు కాస్త వీలు చిక్కింది. వెంటనే ఇంటికి ఫోన్‌ చేశాడు. వాణీబాయి ఫోను ఎత్తింది.‘‘హలో ఏం చేస్తున్నావు?’’ ఆపేక్షగా అడిగాడు వినయబాబు.‘‘నా మొహం చేస్తున్నాను’’ అంది చిరాగ్గా. అతను ఉలిక్కిపడ్డాడు.‘‘అదేమిటి? మూడ్‌ బాగాలేదా?’’ అన్నాడు.‘‘మూడ్‌ బాగా ఎట్లా వుంటుంది? ఇవాళ పేకాటలో పాతికవేలు పోయాయి’’ అంది.‘‘పోతే పోయాయి అలా అని మూడ్‌ పాడుచేసుకుంటారా?’’‘‘నేను అంతే నా మూడ్‌ పాడయ్యింది. సరేగాని, ఎందుకు ఫోను చేశారు?’’