కాలానికున్న శక్తేమిటో ఈరోజున అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఇన్నిరోజులూ కత్తికున్న ఓవైపు మాత్రమే చూశాను. ఇవాళ బాగా అర్థం అయింది కత్తికి అవతలి వైపున ఎలా వుంటుందో. నేను ఓ డాక్టర్‌ని. నా కడుపులో ఆపరేషన్‌ చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో భరించలేని నొప్పితో, మంచంమీద వున్నాను.సముద్రం ఎండిపోవచ్చు అనడానికి కచ్‌ ప్రాంతం చూస్తే నమ్ముతారు. ఊళ్ళకు ఊళ్ళే నేలమట్టం అవుతాయనడానికి నిదర్శనం మెహంజొదారో. నా విషయంలో అదే జరిగింది.ఎంతోమందికి ఆపరేషన్‌ చేసిన నేను, ఆపరేషన్‌ చేయించుకోవాల్సి వచ్చింది. ఏదో తెలీని భయం. ఇలాంటి భయం ఇదివరకు రోగుల కళ్ళల్లో వుండిందా. నా చేతిని పట్టుకునేందుకు వాళ్ళు చేసే ప్రయత్నాలు, ఆ కళ్ళల్లో సందేహాలు యిపడు అర్ధం అవుతున్నాయి, ఓ ఆశ్వాసనకోసం, చిన్నపాటి ధైర్యంకోసం అని.పేషెంట్ల చేతులు పట్టుకునే అలవాటు నాకు మొదట్నించి లేదు. ఆపరేషన్‌ చేసేటపడు తప్పదు. అది వేరే విషయం.అపడు పేషంట్‌ మత్తులో వుంటాడు. స్పందనలు అవి ఏవీ వుండవు. నాకు అపడు ఏమీ కనపడదు. 

ఆ ఎముక, ఆ మాంసం, ఆ ఆర్టరీలు, వెయిన్‌లు, నరాలు. వీటిని ఎలాగూ ముట్టుకోక తప్పదు. నా వృత్తి అది. నా దినచర్యలో అదో భాగం. ఆ టచ్‌ వేరు.నేను చదువుకునేపడు నాకు ఎలా నేర్పారో ఏం నేర్పారో అదే చేస్తూంటాను.ఒక్కసారి మూలిగాను. నాకేం తెలీలేదు. కానీ బాధ. భరించలేని నొప్పి ఏదో శబ్దం రూపంలో బయటికొచ్చింది.ఎవరైనా మూలుగుతూంటే, ఓ యంత్రంలా నా పని నేను చేసుకుపోయేవాణ్ణి. కానీ యిపడు ఎవరైనా నా పక్కన కూచుని నా ఫీలింగ్స్‌ని పంచుకుంటే బావుణ్ణు.మత్తుగా వుంది.... కళ్ళు మూసుకుపోతున్నాయి.

ఎవరెవరో వచ్చి వెళ్తున్నారు. వాళ్ల కదలికల్లోంచి వచ్చే సన్నటి శబ్దాలు ఎక్కడ్నించో వినిపిస్తున్నాయి.‘‘దుప్పటి సరిచెయ్యండి... ఆ ఇంజెక్షన్‌ .... అదో కాప్‌స్యూల్‌ నిద్రకి... ఏ.సి. తగ్గించండి.....’’ఇలాంటి ఆజ్ఞలు నేనూ యిదివరకు జారీ చేశాను.ఏవో ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించేవాళ్ళని నర్సుల మీదకి వదిలేసేవాణ్ణి. నీట్‌గా షేవ్‌ చేసుకుని, పేషెంట్‌ మంచం దగ్గర నుంచుని కేస్‌ షీట్‌ చూసి, మందులు మార్చడం, అవసరం అయిన పరీక్షలు లాటివి రాసి, నన్నంటిపెట్టుకున్న వాళ్ళకి చెప్పేవాణ్ణి. అంతేకానీ, పేషెంట్‌ మొహం చూడ్డానికేమాత్రం ప్రయత్నించేవాణ్ణి కాదు.