నేను వెళ్లేసరికి నవారు మంచం మీద గోడ వైపు తిరిగి పడుకుని ఉన్నారు నాన్నగారు.చెప్పులు వీధి గుమ్మంలోనే విడిచి వెళ్లానేమో, నేను వచ్చినట్లు ఏ విధమైన శబ్దమూ కాలేదు. మంచం దగ్గరగా వెళ్లి, ‘పడుకున్నారా?’ అన్నాను.‘ఎవరూ?’ అంటూ ఇటు వైపుకి ఒత్తిగిల్లారు.‘నేనే’ అన్నాను.‘రా, ఇలా కూర్చో’ అన్నారు పడుకునే. నేను అక్కడున్న ఒక స్టీలు కుర్చీ కొంచెం పక్కకి లాగి కూర్చోబోతూంటే ఆ చప్పుడు విని, ‘అంతదూరంలో ఎందుకు? ఇలా వచ్చి కూర్చోవమ్మా’ అంటూ, మంచం మీద తను లేచి కూర్చుని, నాకు తన పక్కన చోటు చూపించారు చేత్తో మంచం మీద తట్టుతూ.నేను వెళ్లి మంచం పట్టీమీద కూర్చున్నాను.నాన్నగారు చేత్తో తడుముతూ నా వీపు మీద చెయ్యివేసి, తన పక్కన మంచం మీద తడిమి, ‘సరిగ్గా కూర్చోమ్మా’ అన్నారు.
నేను కొంచెం వెనక్కి జరిగి సర్దుకున్నాను.ఆయన చేత్తో తడుముతూ, నా చెయ్యి అందుకుని తన చేతుల మధ్య పెట్టుకుని, ‘నువ్వొస్తానని రోజూ ఎదురు చూస్తున్నాను. అంతా కులాసాగా ఉన్నారా?’ అన్నారు.‘ఊఁ’ అన్నాను సన్నగా.ఆయన ఇంకేమీ మాట్లాడకుండా నా చెయ్యి నిమురుతూ ఉండి పోయారు.ఇది వరకోసారి - అంటే, నేను యుక్త వయస్సులో ఉన్నప్పుడు - నాన్నగారూ, నేనూ ఒకే రిక్షాలో వెళ్లవలసి వచ్చింది ఎక్కడికో. రిక్షా విశాలంగా ఉన్నా, నేను ఒక వైపుకి బాగా ఒదిగి కూర్చున్నాను.‘సరిగ్గా కూర్చోమ్మా పడిపోతావు’ అన్నారు నాన్నగారు.నేను మొహమాట పడుతూ ఒక అంగుళం ఆయన వైపుకి జరిగాను.నాకు అక్షరాభ్యాసం అయినప్పటి నుంచి ఆయన నన్ను క్రమశిక్షణ పేరుతోనూ, మడీ, ఆచారం కారణాల వల్లనూ, చూపులతోనే అల్లంత దూరాన నిలబెట్టి మాట్లాడటం అలవాటయి, ఆయన దగ్గర చనువు తీసుకునే సాహసం హరించుకుపోయింది నాన్నగారిని ఏ సమయంలో చూసినా మడికట్టుకున్నట్లుగానే అనిపించి, నాకు ముడుచుకు పోవడం అలవాటయిపోయింది.
అలాంటిది, రిక్షాలో ఆయన్ని అంటుకునేట్లు ఎలా కూర్చోగలను?స్కూలు నుంచి రాగానే ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని ఆ ప్రశ్నలూ, ఈ ప్రశ్నలూ వేస్తే స్కూలు కబుర్లన్నీ చిలకలా చెబుతారు పిల్లలు. అంతేకాని, ‘లెక్కల్లో మార్కులెన్నొచ్చాయి?’ అనో, లేదా ‘మార్క్స్‌షీటు పట్టుకొచ్చావా?’ అనో గుడ్లురుమూతూ వీధి గుమ్మంలోనే నిలదీస్తే పిల్లలు బిక్కచచ్చి పోరూ! అలా బిక్క చచ్చిపోతూనే బతికాను ఇరవై ఏళ్ళు వచ్చేవరకూ. ఆ బెదురు ఇంకా పోలేదు.నాన్నగారికిప్పుడు ఎనభై దాటాయి. ఆపరేషను చేస్తే కంటి చూపు వచ్చే వయస్సు దాటి పోయింది. తక్కిన విషయాల్లో అనారోగ్యం లేకపోయినా, దృష్టిలోపమే ఆయన్ని బలహీనుణ్ణి చేసింది. మంచం మీదే గడుపుతున్నారు రెండేళ్ల నుంచీ.