రమ్మీలో కూర్చుంటే అన్ని ఆటల్లోనూ పన్నెండు ముక్కలే పండుతయ్‌. ఎక్స్‌టెన్షన్‌ అంది చావదు.బ్రిడ్జి ఆడుతుంటే ‘‘అప్పోనెంట్స్‌’’కి గ్రాండ్‌ శ్లామ్‌లు పడతయ్‌, నా చేతిలో పాయింటే వుండదు.సినిమా టిక్కెట్ల క్యూలో నిలుచుంటే నా దగ్గరి కొచ్చేసరికి బుక్కింగ్‌ కౌంటర్‌ని కట్టేస్తాడు.అంతా తరుగు.అన్నింట్లోనూ తరుగు.జీవితంలో వెలితి.జీవితం నాతో క్షణక్షణానికి దోబూచులాడుకుంటుంది, అడుగడుక్కీ దాన్ని నేను పట్టుకుందామనుకుంటే, అది నన్ను మొట్టి పరిగెత్తుకుపోతుంది.‘‘అసలు నువ్వు పుట్టడమే అలా పుట్టేవు. ఏడో నెలలోనే ఏదో కొంప మునిగినట్టు నా ప్రాణం తీసి ఈ లోకంలోకి తన్నుకొచ్చావు’’. అమ్మ నన్ను శపిస్తున్నట్టుంటుంది. ఆమె రూపం నాకు తెలీదు. ఆమె చావబోయే ముందు మాత్రం ఖచ్చితంగా ఇలా అనుకుని వుంటుందని అనిపిస్తూ వుంటుంది నాకు.‘‘అసలు నీ తరుగంతా నీ కుడికాల్లోనే వుంది. కుడి ఎడమలకి అరంగుళం వ్యత్యాసం చాలు - కురచదనం కనిపించటానికి’’ సత్యం అనేది అక్షరాలా నిజం.‘‘ఆ అవలక్షణం సంగతి సరే - చూపుడువేలుని బొటన వేలుకంటే అంత తక్కువగా ఎందుకు అతికించాలోయ్‌ - బెమ్మదేవుడు.... అది మాత్రం తరుగుకాదూ?’’ రాజు ప్రశ్నలాంటి సందేహం, సందేహంలాంటి ఎద్దేవా.ఎస్సెల్సీలో ఒక మార్కు... తక్కువతో ‘‘స్కూల్‌ ఫస్ట్‌’’ పోయింది.

1905 నుంచీ వేలాడ దీసిన బోర్డు మీద రమాకాంతం పేరు రాసి నన్ను కుళ్ళి పొమ్మన్నారు. వాడిప్పుడు నైవేలీలో ఇంజనీరు.బియ్యేలో ఆరు వందలకి మూడు వందల యాభై తొమ్మిది మార్కులిచ్చి ఏడవ మన్నారు. ఫస్టు క్లాస్‌ అంటే తంతామని హెచ్చరికన్న మాట!ఓ కంపెనీలో ఆఫీసర్‌ ఉద్యోగానికి ఐ.ఎ.ఎస్‌.కి దీటైన పోటీపరీక్ష రాస్తే నేను పదో వాడిగా వచ్చాను. ఇంటర్వ్యూలో నెగ్గిన తర్వాత నా నెంబరు ఇరవై ఒకటికి దిగజారింది. ఏడాది గడిచినా అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ రాదు. బొంబాయి పోయి కనుక్కుంటే ఇరవై మందిని తీసుకుని లిస్టుని ‘‘శ్ర్కాప్‌’’ చేశామన్నారు.గుమాస్తా ఉద్యోగానికీ, టైపిస్టు ఉద్యోగానికి కలిపి వున్న పరీక్ష రాస్తే టైపిస్టుగా ‘‘సెలక్టు’’ చేశారు. వెయిటింగ్‌ లిస్టులో వుంది నా పేరు. ఉద్యోగంలో చేరాల్సిన వాళ్ళలో ఒకతను హఠాత్తుగా పాము కరిచి పోయాట్ట. నాకిచ్చారు.‘‘తరుగులో మెరుగంటే యిదే. ఇకనుంచీ నీ జాతకం మారుతుందిలే’’ సత్యం ఆశాజీవి. నన్ను అభినందించాడు.ఆఫీసులో అందరికీ గాడ్రేజ్‌ టేబుల్స్‌ కుర్చీలు. నే వెళ్ళేసరికి ‘‘కేపిటల్‌ బడ్జెట్‌’’ అయి పోయింది. ‘ఇక్కడ కూర్చో’ అన్నారు. మాంథాతల నాటి కొయ్యటేబులూ, కొయ్యకుర్చీ లభించినై. 1965లో కొన్న ‘‘అండర్‌ వుడ్‌’’ టైప్‌ రైటర్‌ యిచ్చారు. జూనియర్‌ మోస్టుని మరి.నాకు నలుగురు మాఁవయ్యలు. వాళ్లకి పన్నెండుమంది ఆడపిల్లలు. అందులో ‘‘అయిదుగురు నాకు ఈడూ జోడూ కుదిరిన వాళ్ళు. పెద్ద మావయ్య మూడో కూతురు సావిత్రి నా భార్యయితే బాగుణ్ణు’’ అని నా గుండె చప్పుడు చేస్తూ వుండేది. సావిత్రికి సంబంధం ఖాయమైంది. ఆవిడ డాక్టరు గారి భార్య యిప్పుడు. కోడి మెడని నొక్కి పట్టినట్లయింది. నా కోరికని నొక్కేసుకున్నాను.