‘‘మీరు తెలుగువాళ్ళా?’’ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ‘‘అవును! ఎలా గుర్తుపట్టారు?!’’ అంది.అతను మందహాసం చేశాడు. ‘‘మీలో తెలుగుదనం తొలివెన్నెల్లా తొంగి చూస్తోంది. మీ విశాల నేత్రాలు, మీ వెన్నెల నవ్వులు, నిండు చంద్రుడు లాంటి గుండ్రని మొహం, మీ ప్రవర్తనలో మూర్తీభవించిన ఆత్మాభిమానం..’’‘‘ఆగండి...ఆగండి...మీరు కవులా?!’’ నవ్వుతూ అడిగిందామె.‘‘నేను కవిని కాను. కానీ మిమ్మల్ని చూస్తుంటే కవిత్వం పొంగుకొస్తోంది. పున్నమిరోజున సముద్రం పొంగినట్టు..’’‘‘అలా నిజంగా సముద్రం పొంగుతుందా?’’‘‘ఏమో! సముద్రాన్నే అడగాలి’’‘‘సముద్రం చెబుతుందా?’’‘‘చెబుతుంది! కానీ, దాని భాష మనకి అర్థం కావాలి...’’‘‘సముద్రానికి భాష ఉంటుందా?’’‘‘ఈ సృష్టిలో అన్నిటికీ భాషలున్నాయి. చీమ కూడా మాట్లాడుతుంది.’’‘‘మీరెప్పుడు విన్నారు?’’‘‘చీమల్ని జాగ్రత్తగా పరిశీలించండి. మీరూ వినగలరు.’’‘‘మీరు బాగా మాట్లాడతారు. మీ పేరు?’’‘‘నాకు చాలా పేర్లున్నాయి. ఏ పేరు చెప్పమంటారు?’’‘‘మీ అసలు పేరు చెప్పండి.’’‘‘వెంకట్‌! తిరుపతి వెంకన్నకి మొక్కుకుంటే అయిదునెల్ల వయస్సులో నా ఆయువు కాపాడాడట. అందుకే వెంకట రమణ అని పేరు పెట్టానంది అమ్మ.’’

 

‘‘ఆ తర్వాత పేర్లు?’’ కుతూహలంగా అడిగింది.‘‘కొన్నాళ్ళు ఒక క్రిస్టియన్‌ ఫాదర్‌ పోషించాడు. థామస్‌ అని పిలిచేవాడు. ఆ తర్వాత ఒక ముస్లిం కోటీశ్వరుడి దగ్గర పని చేశాను. షరీఫ్‌ అని పిలిచేవాడు.’’‘‘మీ అమ్మా నాన్నా?’’‘‘లేరు! అయిదేళ్ళ వయసులో ఉన్నప్పుడే అమ్మా నాన్నా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. అప్పట్నుంచీ నా స్వతంత్ర జీవితం మొదలైంది.’’‘‘జీవితంలో చాలా కష్టాలు పడ్డారన్నమాట!’’‘‘కష్టాలూ, కన్నీళ్ళూ లేని జీవితంలో ఏమి రుచి ఉంటుంది? చేదురుచి తెలియకుండా తీపి ఎలా ఆస్వాదించగలం? చీకటి ఏమిటో తెలిస్తే కదా వెన్నెల కోసం ఆరాట పడతాం?’’‘‘మీరేం చదువుకున్నారు?’’‘‘జీవితాన్ని, విశాల ప్రపంచాన్ని! అంతకన్నా గొప్ప గురువులు ఎవరుంటారు?’’

‘‘నిజమే, ఎంత చదువుకున్నా ఎన్ని డిగ్రీలు సంపాదించినా చేప నీటిలో బ్రతికినట్లు మనం ఈ ప్రపంచంలోనే మనుగడ సాగించాలి...’’ నిట్టూరుస్తూ అందామె.‘‘మీ పేరు చెప్పలేదు?’’‘‘మీరు అడగలేదు.’’‘‘అడుగుతున్నాను చెప్పండి’’‘‘పద్మిని..’’‘‘అద్భుతం..’’‘‘ఏమిటా అద్భుతం?’’‘‘సరిగ్గా మీ అందానికి సరిపోయే పేరు పెట్టినందుకు మీ తల్లిదండ్రులను అభినందించాలి.’’‘‘నా పేరు పెట్టింది మా అమ్మ. నాన్నని నేను ఎప్పుడూ చూడలేదు.’’‘‘ఎందుకని అలా..’’