నేను రాజమండ్రి రైల్వేస్టేషనుకు చేరేసరికి టైము ఉదయం తొమ్మిది.కౌంటర్‌లో టిక్కెట్టు తీసుకొని, ‘ఎంక్వయిరీ’లో‘జన్మభూమి’ ఎప్పుడొస్తుందని అడిగాను.‘‘తొమ్మిదిన్నర’’ అంది కౌంటర్‌లో అమ్మాయి.చేసేదేంలేక జనరల్‌ వెయిటింగ్‌ హాల్లో కూర్చున్నాను.నాపక్కసీటులో ఓ ‘సీనియర్‌ సిటిజన్‌’ (సీసి). నన్నుచూసీ చూడనట్లు చూశాడాయన. ఆ వయసులోనూ ఆయన ముఖంలో ఏదో ఆకర్షణ, కళ్ళల్లో మెరుపు కొట్టొచ్చినట్లు కన్పడుతున్నాయి.ఆకాశం మబ్బుల్తో కమ్మేసినా... గాలి స్తంభించి, ఉక్కపోతగావుంది. పైనున్న సీలింగ్‌ ఫేన్‌ వంక ఒకసారిచూసి, సీసిగారితో ‘‘ఫేను వేసుకుంటే మీకేమైనా అభ్యంతరమా?’’ అని అడిగాను.‘‘అబ్బే...నాకేం అభ్యంతర ం?’’ అన్నాడు ఆయన.వెంటనే లేచి, ప్రక్కనున్న ఫేను స్విచ్‌ ఆన్‌చేశాను.ఫేన్‌గాలికి వొంటికి పట్టిన చెమట ఆరి, హాయిగా అనిపించింది.ఇంతలో ప్రక్కనున్న ‘సీసి’గారు... ‘‘మీరు కనుక, ఫేను వేసుకోవచ్చా...అని అడిగారు. మరొక రైతే, నా ఇష్టాయష్టాలతో ప్రమేయమేంటన్నట్లు...’’ అంటుండగానే, ఆయన మాటకు అడ్డొచ్చి, ‘‘అబ్బే ... మీరు పెద్దవారు... ఈ వయసులో, ఈమబ్బు వాతావణంలో... ఫేనుగాలిపడక మీరు ఇబ్బంది పడ్డారనుకోండి.. అందుకని అడిగాను’’ అన్నాను.‘‘చాలా థాంక్స్‌... ఈరోజుల్లో పెద్దవయసు వాళ్ళను గౌరవించే మీలాంటివాళ్ళు తక్కువ మంది ... మీరు ఏవూరు వెళ్తున్నారు?’’ అని అడిగారు.‘‘బెజవాడ... మరి మీరో?’’ అన్నాను.‘‘సికింద్రాబాదు..మా అమ్మాయి-అల్లుడు- మనవల్నీ చూసొద్దామని. ..ఉద్యోగాలు చేసే వాళ్ళకు రావటం ఎలాగూ వీలుకాదూ...’’ అన్నారు.

‘‘ఈవయసులో, ఇలా ఒంటరిగా... రిజ ర్వేషను చేయించుకున్నారా...ఏమైనా అర్జంటు పనా?’’ అని అడిగాను.‘‘రిజర్వేషను అక్కర్లేదు...సీటుదొరుకుతుంది. పగలు ట్రైన్‌కదా! అర్జంటంటూ ఏంలేదు...తరచూ వెళ్తుంటాను..పిల్లల్ని చూసిరావటానికి. మనవలు తింటానికి, సున్నుండలు, కజ్జికాయలు, చక్రాలు, ఇంకా ఇంట్లోకి కారం-చింతపండు వగైరా వగైరా తీసుకెళ్లున్నాను. స్టేషనుకు అల్లుడొస్తాడు.. కష్టమేం లేదు.’’ అన్నారాయన.నాకేం మాట్లాడాలో తెలియలేదు. ఆయన ముఖంలోకి తేరిపాక చూస్తుంటే..ఆయనే చెప్పు కొచ్చారు...గవర్నమెంట్‌ ఉద్యోగంచేసి, రిటైరై పదిహేను సంవత్సరాల పైనే అయ్యిందట. జగ్గంపేట దగ్గర ఓ చిన్నగ్రామం. సొంతింట్లోనే నివాసం-. ఇద్దరు కొడుకులు-ఒక కూతురు. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఉద్యోగ నిమిత్తం తలా ఒకదారి పట్టారు. ఆయన మాత్రం భార్యతో కలిసి తన సొంతింట్లోనే... ఆ చిన్న గ్రామంలో ఉంటున్నారట. పెద్దగా ఆస్తుపాస్తుల్లే వట. పెన్షన్‌ డబ్బుల్తోనే అడ్జస్టు అయిపోతున్నా రట. తన ఇంటి ఆవరణలోనే రాములవారికి ఓ చిన్నగుడి కూడా కట్టించారట. తనే ఆ గుడిని రోజూ శుభ్రంచేసి, దేవుడికి దీపంపెట్టి, ఓబెల్లంముక్క, పండు నైవేద్యం పెట్టి, పెరట్లో పూలుకోసి- మాలకట్టి, రాములవారి విగ్రహానికి వేయటం ఆయన దినచర్యట. సర్వీసులో ఉన్నప్పుడు ఆయన ఎవ్వరిదగ్గర చేయిచాచి యాచించి యెరుగడట. ఎవ్వరైనా సంతోషంగా ఏదైనా ఇస్తే తీసుకునే వాడట...’’ ఇలా తన గురించి, నేనేమీ అడక్కుండానే చెప్పుకొచ్చారు.