‘‘ఎక్కడ నుంచి ఫోన్‌?’’ శ్వేత ఆరాటంగా అడిగింది. ‘‘అర్జంట్‌గా స్టేషన్‌కు రమ్మని కబురు’’ అన్నాడు రోహిత్‌. ‘‘రాత్రి పది గంటలకు కూడా డ్యూటీ యేనా? ఈ పోలీస్‌ సబిన్‌స్పెక్టర్‌ ఉద్యోగం అంటే ఇలానే వుంటుంది కాబోలు. వేళకానివేళలో ఎప్పుడు కబురొస్తే అప్పుడు వెంటనే డ్యూటీకి వెళ్లితీరాల్సిందే, పైగా ఇల్లు, పెళ్లాం కంటె డ్యూటీయే ముఖ్యం అనుకునే సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ మీరు! మీ చేత మూడుముళ్లు వేయించుకున్నాక తప్పుతుందా? సుఖ పడటానికైనా రాసిపెట్టివుండాలి’’ అంటూ సాధింపు ధోరణిలో కిచెన్‌ సామాన్లు సర్దుతూ ఏకరువుపెట్టింది శ్వేత.‘‘ఎందుకోయ్‌ అంతగా ఫీలయిపోతున్నావ్‌? చాలా చిన్న పనిమీద వెళ్తున్నాను. పదిన్నరకి నీ దగ్గరకు వచ్చి వాలక పోతే అప్పుడు మాట్లాడు’’ అని యూనిఫాం వేసుకుంటూ ఆమెను శాంతపరిచాడు రోహిత్‌.అతను బయటకు వెళ్లగానే ఆమె తలుపు గడియపెట్టి హాల్లో సోఫాలో కూర్చుంది ఒంటరిగా. నిజానికి ఆ సమయంలో ఆమె తన భర్త కౌగిలిలో కరిగి పోవాలి. ఏమీ తోచక భర్త తిరిగి వచ్చేలోపు అరగంట కాలక్షేపం చేయడానికి న్యూస్‌ పేపర్‌, వీక్లీ, మంత్లీ మాగజైన్లను తీసింది. కాని వాటి మీద ఆమె దృష్టి నిలవలేదు. చివరికి టి.వి. ఛానల్‌ ఒకటి ఆన్‌ చేసింది. ఆ బుల్లి తెర మీద ఒక యువకుడు ‘నన్నేం చెయ్యొద్దు’ అని ప్రాధేయపడుతున్న ఒక యువతిమీదకు మేక మీదకు పులివెళ్తునట్లుగా వెళ్తున్నాడు.

 ఆమె తప్పించుకోలేకపోయింది. మరుక్షణంలో అతడామెను తన కబంధ హస్తాలతో బంధించాడు. ఆమె పెనుగులాడినా ఫలితం లేక పోయింది. అతడామెను ఒక మంచం మీద పడేసి ఆమె శీలాన్ని హరించాడు. ఈ సంఘటన చూసిన శ్వేతకు ఆ యువకుని మీద విపరీతమైన కోపం అసహ్యం ఒక వైపు అతని పశుత్వానికి బలి అయిన ఆనిస్సహాయురాలిపైన అంతులేని సానుభూతి మరొక వైపు కలిగాయి. వెంటనే టి.వి. ఆఫ్‌ చేసింది. హఠాత్తుగా వాస్తవాన్ని గమనించి భయంతో కంపించిపోయింది. శరీరమంతా చెమటలు పట్టాయి. తనుకూడా ఆ రాత్రి సమయంలో ఒంటరిగా వుంది. తనకే అటువంటి జరగకూడని సంఘటన ఎదురైతే తన గతేం కాను? కాని ఈ ఆలోచన వచ్చిన మరుక్షణంలో తన భర్త సమర్థ వంతుడైన పోలీస్‌ ఆఫీసర్‌ అని గుర్తు తెచ్చుకుంది. అతను దొంగలకి, నేరస్థులకి యముడులాగా కనిపిస్తాడు. ఒడ్డు, పొడుగు వున్న బలవంతుడు. కండరాలు పెంచిన అతని చేతులతో ఎంతటి గూండానైనా ఎత్తి విసిరివేయగలడు? ఈ ఆలోచనలతో ఆమెకు ధైర్యం వచ్చి తనకు కలిగిన భయం అర్థం లేనిదని తన తెలివి తక్కువ తనానికి చిన్నగా నవ్వుకుంది. గడియారం వంక చూసింది. పదిన్నరకు ఇంకా అయిదునిమిషాలు వుంది. తన భర్త వస్తానని చెప్పిన టైముకు ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. అతనిది ఇండియన్‌ పన్‌క్చుయాలిటీ కాదు. భర్త గురించిన ఆలోచనలతో అయిదు నిమిషాలు గడిచినా, అయిదు సెకన్లు గడిచినట్లు ఆమె కనిపించింది.