దియే జల్తే హై, పూల్‌ ఖిల్తే హై!బడీ ముష్కిల్‌ సే, మగర్‌, దునియా మే దోస్త్‌ మిల్తే హై!(దీపాలు వెలిగినంత, పూలు వికసించినంత సులభం కాదు, స్నేహితుల్ని పొందటం)నా కిష్టమైన కిషోర్‌ పాటల్లో, నాకు బాగా నచ్చిన వాటిల్లో ఒకటైన, ఆ పాటను ఎంపీ3లో ఎంజాయ్‌చేస్తూ, నా లోకంలో నేనుండగా, ఎక్స్యూజ్‌మీ! అన్న ఓ గానకోకిల్లాంటి స్వరం వినబడగానే, తుళ్లిపడి ఈ లోకంలోకి వచ్చి చూస్తే, ఎదురుగా ఒక యువతి నిల్చునుంది. ఏ మాత్రం తొట్రుపాటు లేకుండా వున్న నన్ను, నా ప్రశ్న మార్క్‌ ముఖాన్ని చూస్తూ, నాది మీ పై బెర్త్‌. అది తీసుకుని, కొంచెం మీ సైడ్‌ లోయర్‌ నాకు ఇవ్వగలరా? అని అడిగింది, నేనడిగాక ఎందుకివ్వడులే అన్న ధీమా కూడిన స్వరంతో. సారీ మేడం! నిజానికి నాది బే లోని బెర్త్‌. నేనే వాళ్ళని రిక్వెస్ట్‌ చేసుకుని, కావాలనే, ఈ బెర్త్‌ తీసుకున్నాను, ఇవ్వను అనే అంతే నిశ్చితాభిప్రాయ స్వరంతో. ఆమెను చూసి, ఆమె అడక్కుండానే చొంగ కార్చుకుంటూ, గింగిరాలు తిరిగిపోతూ, ఆమెక్కావలసినవన్నీ ఇచ్చిన వాళ్ళెంతోమందిని చూసిన ఆమె, అతని అభిప్రాయం పట్ల గౌరవ పూర్వకంగా మారు మాట్లాడలేదు. ఏడాది దూరం తర్వాత, స్వచ్ఛంగా తన స్వప్నను కలుసుకోవడానికి వెళ్తున్న బాలు, ఆమెకతనిలో కన్పించటమే కారణం. ఎందుకంటే, ఆమెది అదే పరిస్థితి కాబట్టి!నేనెక్కిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌ వరంగల్‌ స్టేషన్లో ఆగినప్పుడు తీసుకున్న, ఘనతవహించిన రైల్వే వారి ఇరవై రూపాయలు కూడా చేయని, నలభై రూపాయల భోజనాన్ని ఎలాగోలా లాగించేసి, మళ్ళీ నా లోకంలో నేను పడ్డాను. సరిగ్గా ఏడాది క్రితం, ఇదే రోజు రమ్యకిచ్చిన మాట ప్రకారం, నా అభిప్రాయం చెప్పడానికి, విశాఖ బయల్దేరిన నేను గతంలోకి జారు కున్నాను. ట్రాన్సఫర్‌ మీద వైజాగ్‌ బ్రాంచ్లో డ్యూటీకి రిపోర్ట్‌ చేసిన రోజే కావటంతో, ముందుగా వెళ్లి ఫార్మాల్టీస్‌ అన్నీ పూర్తిచేసేసి, నా సీట్లో కూర్చున్న నన్ను, హలో! కొత్తగా వచ్చిన కృష్ణగారు మీరేనా? ఐయాం రమ్య. ప్లీజ్డ్‌ టు మీట్‌ యు! వెల్కం టు వైజాగ్‌ అండ్‌ ఆల్‌ ది బెస్ట్‌. ఈ సీట్‌ నాది అంటూ నా పక్కసీట్లో కూర్చుంటూ వెంటనే తన పనిలో పడి పోయింది. మధ్యలో తలెత్తి, కొత్త కదా! ఏమైనా అవసరమైతే చెప్పండి, హెల్ప్‌ చేస్తాను, అంది. థాంక్స్‌! అవసరమైతే చెప్తాన్లెండి అన్నాను, నాకు తెలిసిన పనే కావటంతో.

 నాకు టీ అలవాటుందని అడిగి తెలుసుకుని, సింహాచలం! కృష్ణ సార్‌, కొత్తగా వచ్చారు. ఆయన క్కూడా టీ ఇవ్వు, అంది. టీ తాగుతూ, ఆట విడుపుగా, వ్యక్తిగత వివరాల్లోకి దిగాం. రమ్య ఉద్యోగంలో చేరి రెండేళ్లైంది. గాజువాకలో చేసి, అవకాశమొస్తే ఇక్కడ కొచ్చింది. చదువుకుంటున్న చెల్లి, తల్లీ, తండ్రీ. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం మాది అంది. భలే వుంది! మాదీ షేంటు షేం అని సరదాగా అన్నాను. ట్రాన్స్ఫర్‌ ఎక్కడకని అడగ్గానే, వైజాగ్‌ అన్నారు. వైజాగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఇక వైజాగు? అనుకుని ఎగిరి గంతేసి వచ్చిక్కడ వాలాను. అంతిష్టమా వైజాగంటే? అని అడిగితే, ఇష్టమా? అవకాశం వుంటే, ఇక్కడే సెటిలైపోతాను కూడా, అన్నాను. ఎందుకంత ఇష్టమని అడిగితే, ఈ ఊరంటే ఇష్టపడని వాళ్ళెవరుంటారు చెప్పండీ? అని ఒక్క ముక్కలో టకీమని జవాబిచ్చాను. అరవవాడైనా తెలుగోడి కంటే ఎక్కువగా విశాఖనిష్టపడి, వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన బాలచందర్‌ ముందు నేనెంతండీ, అన్నాను ముక్తాయింపుగా, నా సినీ పరిజ్ఞానాన్ని జోడిస్తూ! నాకే అంతేనండి. ఇక్కడే పుట్టి పెరిగానేమో, నాకూ మీకంటే ఎక్కువిష్టమని అంటూ, లంచ్లో మాట్లాడకుందాంలెంది, అని మళ్ళీ తన పనిలో మునిగిపోయింది. లంచ్‌ టైం అవుతుండగానే, రమ్యగారూ! ఇక్కడ దగ్గర్లో మంచి భోజన హోటల్‌ ఎక్కడుందండి అని అడిగాను. దగ్గరలోనే ద్వారక వుందిగాని, మీకు వెజ్‌ అభ్యంతరం లేక పోతే, కొత్తగా ఈ రోజే వేంచేశారు కాబట్టి, భోంచేయండి, నా లంచ్‌ పంచుకుందాంలే అంది. చాలా కలివిడిగా, ఏ మాత్రం కొత్తదనం లేకుండా! నేనే ఆశ్చర్యపోయాను, ఆమె ఫ్రీ మూవ్మెంట్కి! అది బహుశా అప్పటివరకు నన్ను గమనించిన తనకి, నా మీద కల్గిన సదభిప్రాయం వల్లే కావచ్చు. మళ్ళీ థాంక్స్‌ చెప్తూ, మీరు కానివ్వండి, షేర్‌ చేసుకుంటే, ఇద్దరమూ అర్ధాకలితో సాయంత్రం వరకూ గడపాలి. కనీసం నా మెదడు తింటానికైనా, మీరేమో శాకాహారాయే! నాకెలాగూ ఈ రోజు నుండి తిప్పలు తప్పవు కాబట్టి, నేను బయటకెల్తాలే అని లేచి వెళ్ళిపోయాను.