కోర్టు ఆవరణ చాలా రద్దీగా వుంది. ఆఫీసుకు సంబంధించిన కేసు కాగితాలు పట్టుకుని అడ్వకేటుకోసం అలా కూర్చున్నాను. సివిల్‌ కోర్టులోనే ఫ్యామిలీ కోర్టు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ బంట్రోతు ‘సుందర్‌, శైలజ’ అని మూడుసార్లు అరిచాడు. ఏదో గుర్తుకొచ్చి అటు చూశాను. ఆ అమ్మాయి లోపలికి విసురుగా వెళ్లిపోయింది. వెనుక ఎంతో నిదానంగా కళ్లజోడు సర్దుకుంటూ సుందరం నడిచాడు. కూర్చుని వున్నవాడ్ని ఎపడు లేచి నిలబడ్డానో నాకే తెలియదు.ఇదేంటి? సుందరానికి ఎపడు పెళ్లయింది? ఈ పరిస్థితి ఎపడు వచ్చింది? అక్కడ నిశ్శబ్దం ఏర్పడింది. సుందరం ఓ స్థాణువులా నిలబడి వున్నాడు. కొద్దిగా అలజడి ప్రారంభం అయింది. చాలాకాలం క్రితం కళాభవనంలో ఒక్కొక్క శిల్పాన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ వెళుతున్నాను.వాటి వెనుక కొన్ని మాటలు కాగితాల మీద వ్రాసి తగిలించారు.‘తెలుసుకోవటం కల. తెలుసుకోకపోవడం కళ’‘హలో’ వెనుకనుండి వినిపించింది. అటు చూశాను.‘సుందర్‌’. తెల్లని కుర్తాలో, గెడ్డంతో అతను చేయి ముందుకు చాచాడు. చేయి కలిపాను.‘ఈ ప్రదర్శన నాదే’. ఈ కళాకారుడు నాకు పరిచయం లేదు. అతనిలో చొరవ బాగా వుంది.‘శిల్పాన్ని చూస్తున్నారా? వెనుక వున్న సందేశాన్ని చూస్తున్నారా?’‘సమన్వయాన్ని చూస్తున్నాను’‘మీరు వ్రాస్తారా?’‘శిల్పులకు, చిత్రకారులకు ఎందుకో రచయితలంటే గిట్టదు’. 

నా కార్డు తీసి ఇచ్చాను.‘పొరపాటు...’ అన్నాడు. ‘నేను ఒపకోను. శిల్పం లేనిచోటు సృష్టిలోనే లేదు. ప్రతి ఆలోచనా ఒక బొమ్మే! కవిత్వంలో శిల్పం లేదా?’‘నిజమే. ఇక్కడ రాతిలోంచే భావాలు జీవమైనాయి. వీటికి భాషతో పనిలేదు. సందేశాలు కొన్ని మీ మాడర్న్‌ ఆర్ట్‌లాగానే చిక్కు ప్రశ్నలలా మిగిలాయి.’‘భాషలో చెప్పలేనివి ఇక్కడేమైనా దొరికాయా?’ అది సవాలులా వుంది.‘ఏమో... అంతా అర్థం... సగం సగంలా వుంది.’‘ఈ మాడర్న్‌ ఆర్ట్‌ చూడండి... అర్ధం అయ్యే బొమ్మల మధ్య ఒక అబద్ధం - ఒక ప్రశ్న? అవునా? ఒక అబద్ధంలా తయారయి ఒక నిజాన్ని వెతకాలి. ఆత్మశోధన అంటే ఇదే... మరల కలుస్తాను...’ చేయి కలిపి ఎవరినో కలవాలని వెళ్లిపోయాడు. పబ్లిక్‌ గార్డెన్స్‌ వైపు చూసి మరల లోపలికి చూశాను. రాయితో ఆట ఆడుకుంటున్న మేధావిలా కనిపించాడు.తెల్లకాగితం నన్ను పిచ్చిగా వెక్కిరిస్తోంది. దానిమీద శిల్పం చెక్కటం ఎలా? ఆశ్చర్యం వేసింది. ఏ మాటా పలుకని బండరాయిలో అంత భావం అలా చిరస్థాయిగా నిలబడిపోయింది. నా పలుకులో శిల్పం లేదు. నా కళలో స్థిరత్వం లేదు. నేను ఓడిపోయాను. ఆలోచించాను. కొన్ని తెల్లకాగితాలు తీసుకుని ఒక సవాలుకు సమాధానంగా ‘శిల్పం’ అని వ్రాశాను. నిజమే. ఒక కథ పూర్తయిన తరువాత అది ఒక శిల్పంగానే నిలబడాలి. సుందరంగా కనిపించాలి! దానిని ఈ కాగితం మీదనే చెక్కాలి. గంగలా ఆ సుందరి ఇలా జాలువారి అక్షరాలా ప్రవాహంలోకి దిగి మరల ఒక స్థాణువులా కనిపించాలి. కలం మీద కాప్‌ పెట్టి లేచి నిలబడ్డాను. ఇది సాధ్యమా?