పదిహేను రోజులుగా మనసు కుదురుగా ఉండటం లేదు. దృష్టి సావిత్రి మీదకే పోతోంది. ఎన్నిసార్లు భార్య ఫోటో చూసినా ‘‘నేను రెడీ... మీదే ఆలస్యం... డాక్టరు నాకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెటు ఇచ్చాడు. మా నాన్న మీ నాన్నగారికి ఆ విషయంలో ఉత్తరం కూడా రాశారు. ఫోన్లో కూడా చెప్పారు. మీ వాళ్ళని ఒత్తిడి చేసి వస్తారని రోజూ ఎదురు చూస్తున్నాను’’ అన్నట్టుగానే వుంది. దానికితోడు సెల్‌లో అందంగా మెసేజ్‌ కూడా ఇచ్చింది. అది చదువుతుంటే వళ్ళో ఉన్నట్లే ఫీలవుతున్నాడు రామచంద్రం.అతనికి ముప్పయ్‌... ఆమెకు జస్ట్‌ ఒకేడాది మాత్రమే తక్కువ. ఇద్దరికీ ఫార్మల్‌గా పెళ్ళిచూపులు జరిగాయి. పెద్దలు సరదాగా మాట్లాడు కున్నారు. ఇచ్చిపుచ్చుకోడాలేం లేవు. మాకు ఆశలు, కోరికలు లేవు అన్నారు రామచంద్రం తల్లి, తండ్రి. మీ అమ్మాయికి ఏం పెట్టుకున్నా అది మీ ఇష్టం అన్నారు కూడా. 

కేవలం అయిదు నెలల్లోనే ఈ తతంగం అంతా గమ్మత్తుగా, ఆశ్చర్యంగా ముగిసింది.ఇక మిగిలింది ‘‘శోభనం’’. అక్కడ అనివార్య పరిస్థితులు, అడ్డంకులు ఎదురయ్యాయి. వెంటనే శోభనం జరిగేందుకు సావిత్రి నాయనమ్మకు తీవ్ర అనారోగ్యం... ఆ తరువాత పెద్దావిడ కాలం చేసింది. నాలుగు రోజులకే రామచంద్రానికి స్కూటరు ప్రమాదం... రెండు నెలలు ఇల్లు దాటని పరిస్థితి. తరువాత సావిత్రికి ఎం.బి.ఏ పరీక్షలు... ఇలా ఏవో ఒకటి వారిని దూరంగానే ఉంచిన ఎపిసోడ్లు తలెత్తాయి.ఇప్పుడు దంపతులు ఆరాట పడుతున్నారు. ఏ అడ్డంకులూ లేవు. పైగా రోడ్డు సాఫీగా జాతీయ రహదారిగా వుంది. ఎంతటి వేగాన్నయినా ఎదుర్కోగల వాతావరణం.

ఇలా ఉండగానే సావిత్రి తండ్రి వియ్యంకుడికి మరోసారి ఫోను చేశాడు- ‘‘వారిముచ్చట, సరదా. ఆనందానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. పది రోజుల్లో మేము తీర్థయాత్రలకు వెళ్ళేందుకు ప్రయత్నాలు పూర్తయ్యాయి’’ అంటూ.రామచంద్రం తండ్రి కూడా ఆ విషయం కొడుక్కు వివరించాడు. మళ్లీ అతనికి ఆఫీసులో సెలవు సమస్య... వారం రోజులు వాయిదా పడింది. ఇంక ఏ ముహూర్తం అవసరం లేదనుకున్నారు రెండు వైపుల వాళ్ళు, ముఖ్యంగా కొత్తదంపతులు.