టెక్నో సొల్యూషన్స్‌ మూడవ అంతస్తుపై ఉన్న రూఫ్‌ రెస్టారెంట్లో బాల్కనీ పిట్టగోడ పక్కనే వున్న కుర్చీలో ఆ రోజు సాయంత్రం కూర్చొని వున్నాడు కిషోర్‌ మూలపాటి. రోడ్డుకు అవతలి వైపు వున్న మైదానంలో క్రికెట్‌ ఆడుతున్న కుర్రాళ్లని చూసి బరువుగా నిట్టూర్చాడు. మైదానంలో కుర్రాళ్లు రోజూ క్రికెట్‌ ఆడుతుంటారు. ఏ రోజన్నా సాయంత్రం ఖాళీ దొరికితే వెళ్లి వాళ్లతో కాసేపు క్రికెట్‌ ఆడాలని అతని కోరిక. కానీ అది తీరడం లేదు. రోజూ సాయంత్రం స్నాక్స్‌ తీసుకునేటప్పుడు బాల్కనీ పిట్టగోడ దగ్గర కుర్చీలో కూర్చొని క్రికెట్‌ ఆడేవారిని చూస్తూంటాడు. ‘‘ఎన్నాళ్లయ్యిందో క్రికెట్‌ ఆడి!’’ అనుకున్నాడు స్వగతంగా. అతడి మనసులో చదువుకునే రోజులనాటి జ్ఞాపకాలు. ఇంతలో ‘‘కమాన్‌ గైస్‌! వియ్‌ హావ్‌ వర్క్‌’’ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ పిలుపు. లేచి తన సెక్షన్‌ వైపు అడుగులు వేశాడు.క్రికెట్‌ అతడికి ఆరోప్రాణంగా వుండేది. కాలేజీ రోజుల్లో అతను బ్యాటింగ్‌కి దిగితే, అవతలి జట్ల బౌలర్లు గడగడలాడేవారు. పరుగుల వర్షం కురిపించడంలో అతడు సిద్ధహస్తుడు. బ్యాట్‌తో అతడు చేసే విన్యాసాలు అద్బుతంగా వుండేవి. జిల్లా స్థాయి టీముకు సెలక్టయి, టోర్నమెంట్లు కూడా ఆడాడు. రంజీ సెలక్షన్‌కు ప్రయత్నించాడు. 

కొంత ప్రయత్నం తరువాత అంగబలం, అర్థబలం లేనిది రంజీ సెలక్షన్‌ సులభం కాదని అర్థమైంది. దానితో ఆ ప్రయత్నాలు విరమించుకోక తప్పలేదు.ఈలోపుగా కుటుంబ బాధ్యతల వత్తిడి పెరిగింది. క్రికెట్‌ ఆటపై మక్కువ వున్నా, చదు వును అశ్రద్ధ చేయకపోవడం అతడికి లాభించింది. డిగ్రీ తరువాత కొన్ని కంప్యూటర్‌ కోర్సులు చేయగానే... టెక్నో సొల్యూషన్స్‌లో ఒక సంవత్సర కాలానికి కాంట్రాక్టు ప్రాజెక్టు ఎనలిస్టుగా ఉద్యోగం దొరికింది. ఈ ప్రయత్నాలలో అతడి క్రికెట్‌ ఆట మూలపడింది.అతడు పనిచేసే ప్రాజెక్టు అమెరికాలోని ఒక పెద్ద ఫైనాన్స్‌ కంపెనీవారు టెక్నోసొల్యూషన్స్‌కి ఇచ్చినది. సంవత్సర కాల పరిమితి గల ప్రాజెక్టు అది. జీతం అతడు ఊహించిన దానికన్నా ఎక్కువగానే వుంది. సంవత్సర కాలంలో పని తీరు బాగుంటే కంపెనీ పర్మినెంటుగా తీసుకుంటుందనే ఆశాభావం వుంది. టెక్నోసొల్యూషన్స్‌ కంపెనీకి ఈ విషయంలో ఇండస్ర్టీ వర్గాలలో మంచి పేరే వుంది.అప్పటికి ఆరు నెలలైంది కిషోర్‌ కంపెనీలో చేరి. రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచీ రాత్రి తొమ్మిది గంటలదాకా డ్యూటీ వుంటోంది. ప్రాజెక్టు వ్యవధి సంవత్సర కాలమే కావడంతో పని వత్తిడి ఎక్కువగా వుంటోంది. దానికి తోడు ప్రాజెక్టు మేనేజరు చేసే వత్తిడి ఒకటి. అతడి ప్రమోషన్‌ ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేయడంపై ఆధారపడి వుంది మరి! ఉదయమే లేచి పనులు పూర్తి చేసుకొని, తొమ్మిది గంటలకల్లా ఆఫీసులో పడితే తిరిగి వెళ్లేది రాత్రి తొమ్మిది తరువాతే. అల్పాహారం, భోజనం, స్నాక్స్‌, కాఫీ, టీలు అన్నీ కంపెనీ రెస్టారెంట్లోనే. ఏవైనా స్వంత పనులు చేసి పెట్టడానికి కంపెనీలోనే ఒక విభాగం వుంది. త్రికరణ శుద్ధిగా సర్వకాల సర్వావస్థల యందు కంపెనీ అభివృద్ధికి ఉద్యోగులంతా అంకితమవ్వా లన్నది టెక్నోసొల్యూషన్స్‌ పాలసీ. దాన్ని ఆ విధంగానే కంపెనీ సాధించుకుంటూ వుంటుంది. క్రికెట్‌ ఆడడం మాట దేవుడెరుగు. టీవీలో మ్యాచ్‌ చూడడానికి కూడా వీలు కావడం లేదు కిషోర్‌కి.