రాత్రి మంచి నిద్రలో వుండగా ఎవరో తట్టి లేపినట్లయి కళ్లు తెరిచాను. ఎదురుగా కళ్లు చెదిరే వెలుగు! ఆ వెలుగులోంచి ఓ దివ్యమంగళ రూపం క్రమంగా దగ్గిరగా వచ్చింది. ఆ రూపం దేముడా! దేముడిలాగే వున్నాడు మరి - పీతాంబరాలు, మెడలో మెరిసే వజ్రాలహారాలు - చేతులకి కంకణాలు నెత్తిన కిరీటం, వెనకతల వెలుగుచక్రం -- నిజంగా దేముడే - అమ్మో, నాకు దేముడు ప్రత్యక్షమయ్యాడు. ‘దేముడూ... నువ్వేనా - దేముడివేనా - నమ్మకం కుదరక అడిగాను. చిరునవ్వు నవ్వి అవును’ అన్నాడు దేముడు.‘‘ఏ దేముడివి స్వామి, మెడలో పాము, నెత్తిన గంగ, త్రినేత్రం అవి లేవు కనక శివుడివి కావు - మురళి, ఫించం అవి లేవు కనక కృష్ణుడివి కావు. నామాలు లేవు కనక వెంకన్నవి కావు, సుదర్శన చక్రం లేదు విష్ణువ్వి కాదు. మరే దేముడివిస్వామి?’’‘‘నువ్వెవరు అనుకుంటే ఆ దేముడినే - భక్తులు ఏ రూపం తల్చుకుంటే ఆ రూపం కనిపిస్తుంది’ చిరునవ్వి నవ్వి అన్నాడు. 

ఉబ్బితబ్బిబ్బి అయిపోతూ ‘‘నేనేం పుణ్యం చేశానని నాకు ప్రత్యక్షమయ్యావు దేముడూ’’ ఆనందం పట్టలేక అడిగా. ‘‘నీకు ఓ వరం యిద్దామని వచ్చాను. ఓ వరం కోరుకో ప్రసాదిస్తాను’’ నవ్వుతూ అన్నాడు.‘‘అమ్మో వరమే! వరాలిచ్చేటంత పుణ్యం ఏం చేశాను దేముడూ, నేనేం తీర్థయాత్రలు చెయ్యలేదు. గుళ్లు గోపురాల చుట్టూ తిరగలేదు. నోములు, వ్రతాలు, యాగాలు, యజ్ఞాలు, ఉపవాసాలు ఏమీ చెయ్యలేదు. మొక్కలు మొక్కి నోట్లకట్టలు హుండిలో వేయలేదు. ఏదో స్నానం చేసి దేముడి దగ్గర దీపం పెట్టి, రెండు నిమిషాలు దేముడికి దండం పెట్టుకోడం తప్ప నేనేం పూజలు చెయ్యలేదే స్వామీ’’ ఆశ్చర్యంగా అన్నా. ‘‘పూజలు వ్రతాలు చెయ్యక్కరలేదు. ఈ మధ్య మంచి మనసుతో కాస్త దానాలు ధర్మాలు చేశావుగా అందుకని... ‘తెల్లపోతూ చూశాను’. ఏమిటి ఆ కాస్తకే మీ దేముళ్లు వరాలిచ్చేస్తారా? తిరగేసి బోర్లోసి లెక్కేసినా ఓ ముప్ఫై వేలన్నాలేవు. అంతకే వరాలిచ్చేయడానికి వచ్చావా?’ ఆశ్చర్యానందాలతో అన్నాను.