గురువారం వస్తోందంటే గుండెల్లో గుబులు మొదలవుతోంది శైలజకి. తనింటికి దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వచ్చి, ఉదయం పది గంటలకల్లా ప్రత్యక్షమవుతుంది సుందరమ్మ పిన్ని. ఈ ఊరు వచ్చి సంవత్సరమవుతోంది. శైలజ భర్త ‘స్టేట్‌ బ్యాంక్‌’లో చేస్తాడు. ఇద్దరు పిల్లలు. కొడుకు ఇంటర్‌ ఫస్టియర్‌, కూతురు టెన్త్‌. వాళ్ళ చదువులు, అవసరాలు అన్నీ తనే స్వయంగా చూసుకుంటుంది శైలజ. ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉండే శైలజకి తీరిక సమయాలు తక్కువే. తమింటికి కొంచెం దగ్గరలోనే సుందరమ్మ పిన్ని ఇల్లు. తల్లి నలభై ఐదేళ్ళకే గతించటంతో మొదటిసారి పిన్ని వచ్చినప్పుడు తల్లిని చూసినట్లే అన్పించి, చాలా సాదరంగా ఆహ్వానించి, ఆప్యాయంగా వండిపెట్టింది. అది మొదలు ప్రతీ గురువారం అదో అలవాటుగా మారింది. మొదటి సారి సుందరమ్మ పిన్ని వచ్చినరోజు జ్ఞాపక మొచ్చింది శైలజకి. పది గంటల సమయంలో తలుపు చప్పుడయింది. అంతకు అరగంట ముందే భర్త, పిల్లలు వెళ్ళారు. వంటిల్లు సర్దుకుని, దీపం పెట్టుకుని ప్రశాంతంగా ఒక అరగంట సేపు పూజ చేసుకుంటుంది తను. ఇంకా పూజ మొదలవ్వనేలేదు. ఎవరబ్బా! అనుకుంటూ తలుపు తీసింది. ఎవ్వరూ లేరు. ‘‘అదేంటి?’’ తలుపు చప్పుడయిందే’’ అనుకుంటూ గుమ్మం దిగి రెండడగులు వేసింది.

 ప్రక్కనే స్తంభం చాటున నవ్వుతూ సుందరమ్మ పిన్ని. ఆశ్చర్యపోయింది తాను. తమాయించుకుని ‘‘ఓ! పిన్నీ! నువ్వా! రా! రా! అరె! ఇల్లెలా తెల్సిందీ! రా లోపలికి’’ ఆప్యాయంగా చేయిపట్టి తీసుకువెళ్ళింది. ముందుకు పొడుచుకు వచ్చిన రెండు పళ్ళు, లోతుకళ్ళు, దబ్బ పండు ఛాయ, ముదురురంగు జరీచీర, మొళ్ళో రెండు పేటల కాశికాయల గుళ్ళ గొలుసు, మూడుపేటల చంద్రహారం, రెండు చేతులకీ, చెరో డజను బంగారు గాజులు, చేతిలో నల్లటి పర్సు, స్తంభం చాటున దాక్కుని కొంటెగా నవ్వుతున్న పిన్ని మొహం ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది.‘‘సుధీర్‌ మీ ఆయన దగ్గర అడ్రసు వివరంగా తీసుకున్నాడట. నేనే కనుక్కోమన్నాను. ప్రతీ గురువారం గుడికి వస్తుంటాను కదా! ఈ ఏరియా అంతా నాకు తెలిసిందే. ఇంటి నెంబరు ఉంది కదా! ఎన్నాళ్ళ యిందే నిన్ను చూసి’’ అంటూ దగ్గరకు తీసుకుంది. తనకి కూడా ఎంతో సంతోషంగా అన్పించింది. అమ్మే తనింటికి వచ్చిందన్నట్లుగా.