దేవుడున్నాడని నమ్మవలసి వచ్చింది.కష్టాలలో కమిలిపోయి కాదుకన్నీళ్లలో కాగిపోయి కాదుమా సుంద మావయ్య వంటి వ్యక్తిని సృష్టించడం ఆషామాషీ వ్యవహారం కాదని గ్రహించడం వల్ల....సందేహం లేదు. ఇది దేవుడి పనే! చిన్నప్పటి నుంచి పెద్ద వాళ్లు చెప్పగా దేవుడి లీలలు చాలానే విన్నాను. సుంద మావయ్యొక ఫినామినన్‌. ‘కష్టపడి పైకొచ్చిన వాళ్లు’ అని కొందరి గురించి వింటూంటాం. దానినొక సుగుణంగా పూజించేవాళ్లని చూస్తూంటాం.కోట్ల కొద్దీ ఆస్తులు కూడబెట్టిన ఒక మాజీ మంత్రి తన చిన్నప్పటి కష్టాల గురించి మురిపెంగా గుర్తు చేసుకోవడం నాకు తెలుసు.మా సుంద మావయ్య కోట్లు సంపాదించలేదు గానీ, చక్కని ఇల్లు కట్టాడు. పరిమితికి మించకుండా ఇద్దరు పిల్లల్ని కన్నాడు. అతి శ్రద్ధగా కేంద్రప్రభుత్వ ఉద్యోగం మాత్రమేచేసి ఎప్పటికపడు జీతాల పెరుగుదలలు, ఆదాయపు పన్నుల నుంచి బయటపడడానికి ప్రభుత్వం కల్పించే రకరకాల పత్రాల సదుపాయాలూ, ఏమారకుండా గమనిస్తూ ఏ యెండకాసినపడు ఆ ఆయా గొడుగులు వేసుకుంటూ సర్వీసు అంతా ‘‘పాపం సుందరం మంచివాడు’’ అనిపించుకొని బయటపడ్డాడు.సుంద మావయ్య పాపం మంచివాడే! అయితే ఏది పాపం? ఏది మంచి?ఎవరికీ అపకారం చెయ్యని మనిషి మావయ్య అయినా మా బంధువులు, ముఖ్యంగా మా అమ్మ పిన్ని లాంటి వాళ్లు ఆయనంటే ఎందుకు చిరాకు పడతారో మొదట్లో తెలిసేది కాదు. 

మావయ్య కూడికలలో కుబేరుడంతటి వాడు గనుక వీళ్లు సకాలంలో చీరలూ వగైరాలు దక్కక సణుగుకుంటారనుకునేవాడిని.క్రమంగా నాకు వయస్సు పెరిగే కొద్దీ సుంద మావయ్య మానసిక సౌందర్యం నాకు బాగా అర్ధం అయింది. అప్పటి నుంచీ ఒక వ్యక్తిగా కాక ఆయన్నొక వ్యవస్థగా భావించి ఆయన చర్యల్ని చదవడం ప్రారంభించాను.చిన్నప్పటి నుంచీ ఆయన ప్రవర్తన గురించి కూపీ లాగడం ప్రారంభించాను.పువ్వు పుట్టగానే పరిమళించడం ప్రకృతి సహజం. పరిమళం పువ్వుతనాన్ని సంతరించుకోవడం ఒక వైపరీత్యం.మా సుంద మావయ్య ఒక వైపరీత్యం. అరిషడ్వర్గంలో లోభపరిమళం. మా మావయ్య రూపం సంతరించుకోవడం ఇక్కడ విశేషం.‘‘చూశావుగా! నా కొడుకు వెధవలు నన్ను లోభి అంటున్నారు. కృతఘ్నులు వీళ్లు. డబ్బు మంచినీళ్లలాగా ఖర్చు చేయడం గొప్ప కాదు. బిగబట్టడమే గొప్ప! నది నీళ్లు వరదగా వున్నాయి కదా అని వదిలిస్తే, ఉప సముద్రం పాలు! ఆనకట్ట కట్టడం గొప్ప. నేలైనా, నువ్వైనా సస్యశ్యామలం అయేది అపడే. వీళ్లకి ఎడాపెడా తిండి పెట్టాను. కుంయ్‌ మంటే చాలు ఆరోగ్యం చెడుతుందేమోనని భయపడి మందులు దట్టించాను. ప్రతి పండక్కీ బట్టలు కుట్టించాను. నా శక్తిని బట్టి చదివించాను. కిష్టప్పగాడికి జీన్స్‌ కొనలేదని, సుబ్బాయి గాడికి స్కూటర్‌ కొనివ్వలేదని, మీ అత్తయ్యకి మిరియంగాజులు చేయించలేదని నేను లోభిని. అవును లోభినే. ఒపకుంటే పోలేదూ?’’