శునో భవ చక్షసా శంనో అహ్నోశంభాను నాశం దేహి మశం ధృణే!యథా శమధ్వంఛ మ సద్‌ దురేణేతత్‌ సూర్యద్రవిణం హిచిత్రమ్‌!!‘‘సూర్యభగవానుడా! నీ వెలుతురు చేత, వేడిమిచేత శీతాకాలంలో మమ్మల్ని రక్షించు - మమ్ము ఆశీర్వదించు, ఇంటిలోనూ ఇంటి బయటా మమ్ము రక్షించు. అనేక సంపదలను ప్రసాదించు-’’అంటున్న ఋగ్వేదంలోని సూర్యసూక్తం గుర్తొస్తోంది. ఈరోజు మకర సంక్రమణం, సూర్యుని గమనం మారే రోజు. ఇక చలి తగ్గిపోతుంది. మరియు పెద్ద పండుగ, పెద్దల పండగ-బియ్యం, పప్పులు, నెయ్యి, పాలు, శాకపాకాలతో పొత్తర్లు సిద్ధం చేసి, మా పెద్దలను ఆవహింపచేస్తూ, మా ఇంటి పురోహితునికి దానం ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్న రోజు-చలికి తట్టుకోలేక వేడినీటిలో స్నానం చేసి, పట్టుబట్టలు కట్టుకొని సిద్ధంగా ఉన్నాను. పౌరహిత్యుడు సూరిబాబుగారు రావడమే ఆలస్యం. 

ఇప్పటి దాకా పచ్చి మంచినీరయినా ముట్టలేదేమో కడుపు ఆకలితో కరకరలాడు తోంది. అయితే ఇంతవరకూ సూరిబాబుగారి జాడలేదు. కనుచూపు మేరలో వారి సైకిలు కానరావడం లేదు. నాలుగైదుసార్లు డాబా ఎక్కి ఎదురుచూశాను. ఈ ఎక్కడం దిగడం వల్ల నీరసం మరికొంత.కాలం గడుస్తోంది - ఉన్నట్టుండి వీధిలో చిన్న అలజడి.‘‘సూరిబాబుగారు వచ్చారు - సూరిబాబుగారు వచ్చారు’’ ఎవరో అంటున్నారు.‘‘పుణ్యకాలం రావాలికదమ్మా’’ ఇది ఆయన సమాధానం.నా ప్రాణం లేచివచ్చింది ఆ గొంతు విని.‘‘అమ్మయ్య పుణ్యకాలం వచ్చిందన్నమాట!’’ ఇక దానాల తంతు మొదలవుతుంది. వస్తూనే చేతిలోని చిన్నసంచీని కుర్చీలో పడేసి నూతి పళ్లెం మీదకు వెళ్లారు సూరిబాబుగారు. ఆయన వెంట నేను. చెంబులో నీళ్ళు తీసుకొని ఆయన పాదాలు కడగడానికి ముందుకి వంగాను.‘‘అభ్యాగతిహీ... స్వయం విష్ణువూ....’’ ఇక వీరు విష్ణువుతో సమానం - మా దానాలూ స్వీకరించీ, మాకు హితవచనాలు వినిపించీ తద్వారా మేము దానం చేసిన ఈ పదార్థాలు, మా పితృదేవతలకు చెందేటట్టు అనుసంధానం చేస్తారు. అనగా మా పెద్దలు భోజన సంతృప్తులయి మమ్ములను దీవిస్తారు.ఎంత గొప్ప విషయం.అయితే ప్రస్తుతం నాకే ఆకలిగా ఉంది. గుక్కెడు నీళ్లయినా తాగనివ్వని మా అమ్మ గొప్ప స్ర్టిక్ట్‌.

ఫలితం ఉండదని సెంటిమెంట్‌లో పడేస్తుంది. ఈ తతంగం పూర్తయితే తిండికోసం, వంటింటిలోకి చేరిపోదామని నా తహతహ.సూరిబాబుగారి పాదాలు కడగడానికి మళ్లీ వంగాను - ఏదో అనుమానం. దిక్కులు చూస్తున్నాను. మా విష్ణుమూర్తుల వారు కాళ్లకు చెప్పులు వాడరు. కాబట్టి ఆయన కుడిపాదం కింద ఏదో పెంట తొక్కిన అనుమానం - అనుమానేమిటి, నిజమే! ఈగలు వాలుతున్నాయి. ఈ మహావిష్ణువు రోడ్డు మీద ఏదో పెంటే తొక్కుకు వచ్చారు - వావ్‌! మనసులో అనుకుంటూ తల పైకెత్తి చూశాను. ఆయన ఈ లోకంలో లేరు. ఆరమోడ్పుకన్నులతో, ఆకాశంలోకి చూస్తున్నారు. ఆకాశంలో నుండి దిగుతున్న మా పెద్దలనే చూస్తున్నారో, లేక ఎగురుతున్న గెద్దల్నీ కాకుల్నీ చూస్తున్నారో....