పునరపి జనం, పునరపి మరణం-అన్నాడు సూట్‌కేస్‌ బ్యాక్‌సీట్‌లో పడేసి తను ముందు సీట్లోకి ప్రవేశిస్తూ, సూర్యప్రకాశ్‌. అతని ఎయిర్‌ పోర్ట్‌లో రిసీవ్‌ చేసుకున్న కాంతారావు డైనింగ్‌ హాల్‌ మీద చేతులు వేస్తూనే ‘‘అదేమిటి-సైంటిస్ట్‌కు వేదాంతం’’ అనడిగాడు.వాళ్ళిద్దరూ కాలేజీలో స్నేహితులు. ఎవరి వృత్తుల్లో వాళ్ళు తలమున్కలుగా వుండిపోయినా తీరుబడి సమయాల్లో ఒకళ్ళనొకళ్ళు పరామర్శించుకుంటూ వుండడం చేస్తున్నారు. స్నేహం తప్ప ఇద్దరి మధ్య మరేమీ సంబంధం లేదు.‘‘వేదాంతం కాదు. జీవితాంతం’’ అన్నాడు సూర్యప్రకాశ్‌! ప్రపంచం అంతా మునిగిపోతుందట ఇంకో రెండు సంవత్సరాలలో దేశం అంతా ఇదే గోల. ఎంత మాత్రం భయం లేదని చెప్పినా ఎవరికీ నమ్మకం కుదరడం లేదు. తాము ఎక్కడ కాకుండా పోతామోనన్న భయం... ఆదుర్దా...’’ అని వివరించాడు సూర్యప్రకాశ్‌.కాంతారావు అతని కవిత్వ ధోరణికి నవ్వుకున్నాడు.అతను ‘‘మనం ఈ భౌతిక ప్రపంచానికి మళ్ళీ మళ్లీ రావలసిందే. అంతకంటె మరో మార్గం లేదు. అన్ని సమస్యలూ సామరసంగా పరిష్కారం అయిపోయి, ఇంకేమీ పని మిగలనప్పుడే నిర్వాణం అయినా ముక్తి-మోక్షం లాంటివి అయినా’’ఈమాటు వేదాంతం మళ్ళీ ధ్వనించింది సూర్య్రపకాశ్‌ నుంచి.‘‘అందుకేనా నువ్వు ఇప్పుడు వచ్చింది?’’‘‘జీవితంలో తర్కానికి చోటు లేదు. ఎదురు వచ్చిన దాన్ని అనుభవిస్తూ ముందుకు పోతూ ఉండడమే. జరుగుతున్న దానిని చూస్తూ వుండడం కంటే మరింకేమీ చేయలేం’’కారు మలుపు తిరుగుతోంది.‘‘మరేం అనుకోకు. భార్య పోవడాన్ని నేనేం ఆక్షేపణ చేయను. అది అన్యాయం అనను. ఒక వయసు వచ్చాక భార్య లేకుండా జీవితం గడపడం అసాధ్యం కాకపోవచ్చును. అయినా తల్లి లేని పిల్లవాడుగా పెరగవలసి రావడం మటుకు చాలా అన్యాయం అంటాను’’ అన్నాడు సూర్యప్రకాశ్‌.

కాంతారావు భార్య అప్పటికి ఆరునెలల క్రితమే మరణించింది. ఏడేళ్ళ కుర్రవాడిని విడిచింది. వాడి పెంపకం కోసం కాంతారావు ఒక ఆయా (బేబీ సిట్టర్‌ అనకూడదేమో)ను నియమించుకుని కాలక్షేపం చేస్తున్నాడు. మళ్ళీ వివాహం చేసుకోమని అతనికి స్నేహితులు, బంధువులు కూడా సలహా ఇచ్చారు. ‘‘నీకోసం కాదు పిల్లవాడి కోసం...’’ అని ఎంతగానో నచ్చ జెప్పటానికి చూచారు.నాకోసం కానప్పుడు ఎందుకు? అనుకున్నాడు కాంతారావు. పిల్లవాడికి మరో మూడేళ్లు వచ్చేవరకూ ఎవరేనా ‘ఆయా’ను పెట్టుకుంటే చాలు. ఎందుకు అనవసరంగా మరో కామాటం!కుర్రవాడికి కావలసిన పనులు చూడానికి ఒక మనిషి వుంటే చాలు. స్కూలుకు వెడుతున్నాడు. అక్కడినుంచి రావడంతోటే వాడి అవసరాలు కనిపెట్టి, తను ఇంటికి వచ్చేంత వరకు తోడుగా మరో మనిషి వుంటే చాలు. కొడుకుకు కథలు చెప్పి నిద్ర పుచ్చడం తనకు చేతనవును. తను ఆఫీసు పనుల్లో కూరుకుపోయినప్పుడు మాత్రం వాడికి ఒంటరితనం లేకుండా ఎవరో ఒకరు అంటకాగి వుంటే అంతే చాలు. - ఇక నా సంగతి అంటారా? జీవితాంతం ఇలా ఒంటరిగా వుండిపోవడమే నాకు ఇష్టం. నా ఆలోచనలు, నా కలవరింతలు నాకున్నాయి... అనుకున్నాడు కాంతారావు.